Breaking News

26/03/2019

కలవరపెడుతున్న టీబీ కేసులు

హైద్రాబాద్, మార్చి 26 (way2newstv.in)
టీబీ కేసులు పెరుగుతుండటం కలవరపెడుతున్నది. దశాబ్దం క్రితం అంతరించిపోయిందనుకున్న ఈ వ్యాధి మళ్లీ విజృంభిస్తున్నది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధిగ్రస్తులు అంతకంతకూ పెరుగుతున్నారు. నివారణకు ఖరీదైన మందులు వాడినా నియంత్రణలోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. సుదీర్ఘకాలంగా టీబీ నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చినా ఈ వ్యాధి నిర్మూలన, నియంత్రణ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడంలేదు. పైగా దశాబ్దం క్రితంతో పోల్చితే ప్రస్తుతం టీబీ బాధితుల సంఖ్య మరింత అధికమైంది. వ్యాధి నియంత్రణ కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఆశించిన మేరకు పని చేయడంలేదనే విమర్శలు వస్తున్నాయి. నిర్మూలన కోసం వైద్యశాఖలో ప్రత్యేకంగా ఒక విభాగం పని చేస్తున్నది. సిబ్బంది కొరత ఈ విభాగం పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. 'టీబీ నిర్మూలన కార్యక్రమం'' ప్రత్యేక విభాగానికి రాష్ట్ర స్థాయిలో 24 రెగ్యులర్‌ పోస్టులు ఉంటే ప్రస్తుతం ఏడుగురు మాత్రమే పని చేస్తున్నారు. 


కలవరపెడుతున్న టీబీ కేసులు

పర్యవేక్షణ అధికారులు లేకపోవడం, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది తక్కువగా ఉండడంతో టీబీ రోగులకు సరైన సమయంలో చికిత్స అందడంలేదు. దీంతో ఈ వ్యాధితో చనిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. రాష్ట్రంలో క్షయ నివారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీబీ ఫోరాన్ని కూడా ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోతున్నది. జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా 'ఇట్స్‌ టైమ్‌ టూ ఎండ్‌ టీబీ' నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. 33 జిల్లాల్లో డిస్ట్రిక్‌ టీబీ సెంటర్లు, 171 టీబీ యూనిట్స్‌, 750 డిసిగేటెడ్‌ మైక్రోస్కోపిక్‌ సెంటర్స్‌, గంటల వ్యవధిలో వ్యాధిని నిర్దారించే 30 సీబీనాట్‌ ల్యాబ్స్‌ను, అలాగే ఒక మొబైల్‌ సీబీనాట్‌ వాహనాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్‌లో నోడల్‌ డ్రగ్‌ రెసిస్టెంట్‌ టీబీ సెంటర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. క్షయ అంటువ్యాధి కావడం, నిర్మూలన కార్యక్రమంలో లోపాల కారణంగా ఎక్కువ మందికి కొత్తగా సోకుతున్నది.మనదేశంలో సుమారు 1.5 కోట్ల మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉండగా, రాష్ట్రంలో ఏడాదికి 40 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అందులోనూ సుమారు 20 వేల స్ఫూటమ్‌ పాజిటివ్‌  రోగులు ఉన్నారని అంచనా. ఇక, క్షయ వ్యాధి రోగులు ప్రయివేటు ఆస్పత్రులకు ఎక్కువగా చికిత్స కోసం వెళ్తుండటంతో ఆ వివరాలు ప్రభుత్వ క్షయ నియంత్రణ అధికారులకు అందడంలేదు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే మల్టీడ్రగ్‌ రెసిస్టెంట్‌ (ఎండీఆర్‌) కేసులు మాత్రమే రికార్డుల్లో చేరుతున్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒకరు ఈ వ్యాధితో మృతి చెందుతున్నారు. రోగి నుంచి వెలువడే స్ఫూటమ్‌ బ్యాక్టీరియా మరో 15 మందికి వ్యాప్తి చెందుతున్నదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'మైకో బ్యాక్టీరియమ్‌ ట్యూబర్‌క్యూలోసిస్‌' అనే క్రిమి వల్ల వచ్చే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా సులభంగా చేరుతుంది. ముఖ్యంగా టీబీ క్రిములు ఊపిరితిత్తులకు సోకి శ్వాసకోశ వ్యాధిని పల్మనరీ కలిగించి రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండే వారిలో ప్రవేశిస్తుంది. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అయినప్పటికీ ఏ అవయావానికైనా రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉత్ప్రేరకాలు వాడటం, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌తో బాధపడే రోగులకు త్వరగా వ్యాపిస్తుందని చెబుతున్నారు. 2017లో 23,128 కేసులు, 2018లో 52,191, 2019లో ఇప్పటి వరకు 8,112 కేసులు నమోదయ్యాయి. వ్యాధి నియంత్రణ కోసం ఏటా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నాప్రాణనష్టం మాత్రం తగ్గడంలేదు. టీబీతో ప్రాణాలు కోల్పోతున్న వారు ఏటా 2,500 వరకు ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం లక్ష  మందిలో 217 మందికి టీబీ వస్తున్నది. ఇది ప్రమాదకరమైన వ్యాధి కావడంతో కుటుంబంలో ఒకరికి ఉంటే మిగిలిన వారికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెచ్‌ఐవీ కేసులు పెరుగుతుండడం కూడా టీబీ రోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నది. ప్రతి 10 మంది హెచ్‌ఐవీ బాధితులలో ఆరుగురికి టీబీ సోకుతున్నది. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తిస్థాయి చికిత్స తీసుకుంటే 90 శాతం నయమవుతుంది. వ్యాధి తీవ్రతను బట్టి 6 నుంచి 9 నెలల సమయం పడుతుంది. అదే ఎండీఆర్‌గా మారితే పూర్తి చికిత్స తీసుకున్న 50 శాతం మాత్రమే తగ్గుతుంది. ఇండియన్‌ స్టాండర్డ్స్‌ టీబీ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన వైద్యులే ప్రిస్క్రిప్షన్‌ రాసేలా చర్యలు తీసుకోవాలి. పొగాకు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.' అని వైద్యులు సూచిస్తున్నారు. ఇటు క్షయ, అటు హెచ్‌ఐవీ రోగులకు సేవ చేయాలంటే కత్తిమీద సామే. కానీ, క్షయ విభాగంలోని 714 మంది ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టి 23 ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే. రివైజ్డ్‌ నేషనల్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ కంట్రోల్‌ ప్రాగ్రామ్‌ (ఆర్‌ఎన్‌టీసీపీ), సీబీఎన్‌ఏఏటీ, టీఆర్‌యూఈఎన్‌ఏటీ పరీక్ష విధానాలను అమలు చేయడంలో వారి పాత్ర కీలకం. 1996లో కాంట్రాక్టు విధానం షురూ అయింది తొలుత ఈ విభాగంలోనే కావడం విశేషం. ఇదిలా ఉండగా, గతేడాది స్టాఫ్‌నర్సులు, (1,561), ల్యాబ్‌ టెక్నీషియన్లు (359), ఫార్మసిస్టులు (616), రెండో ఏఎన్‌ఎంలు (4,064), ఏఎన్‌ఎంలు (1,216), ఎంబీబీఎస్‌ డాక్టర్లు (597), ఆయూష్‌ డాక్టర్లు (213), ఆర్‌బీఎస్కే డాక్టర్లు (293) మొత్తం 8919 మందికి ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేస్తున్నట్టు జీఓ నెం.510 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో క్షయ విభాగం ఉద్యోగులను విస్మరించారు.

No comments:

Post a Comment