Breaking News

02/03/2019

మధ్యాహ్న భోజనానికి దూరమౌతున్న విద్యార్ధులు

తిరుపతి, మార్చి 2, (way2newstv.in)
మధ్యాహ్న భోజన పథకాన్ని ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఏక్తాశక్తి అనే సంస్థకు ప్రభుత్వం అప్పగించడంతో ఆ సంస్థ సరఫరా చేస్తున్న భోజనం ఇక్కడి విద్యార్థులకు రుచించకపోవడంతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసే వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతోంది. విద్యా సంవత్సరం ఆరంభంలో సమయానికి పాఠ్యపుస్తకాలు అందక, స్కూల్‌ యూనిఫామ్‌ సరఫరా చేయక సమస్యలు ఎదుర్కొన్న విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో తరగతి గదులు అందుబాటులో లేక ఆరుబయటే చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.జిల్లాలోని సగానికి పైగా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో అవసరమైనన్ని తరగతి గదులు లేకపోవడం, మరికొన్ని పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఆరుబయటే చదువుకోవాల్సి వస్తోంది. దీనికి తోడు ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడంతో చాలా పాఠశాలల్లో  సిలబస్‌ పూర్తికాలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.


మధ్యాహ్న భోజనానికి దూరమౌతున్న విద్యార్ధులు

జిల్లాలో ప్రభుత్వ రంగ పాఠశాలల్లో వివిధ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 2,89,765 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ పాఠశాలలు మొత్తం 3297 ఉండగా వాటిలో సింహభాగం జిల్లా పరిషత్, మండల పరిషత్‌ పాఠశాలలదే. ఈ రెండు యాజమాన్యాల్లోని పాఠశాలలు జిల్లాలో 2643 ఉన్నాయి. కాగా 206 మున్సిపల్‌ పాఠశాలలు, 263 ప్రైవేట్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. మెత్తం పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల్లో 51,908 మంది బాలురు, 54,256 మంది బాలికలు , ప్రాథమికోన్నత పాఠశాలల్లో 12,878 మంది బాలురు, 13,522 మంది బాలికలు, ఉన్నత పాఠశాలల్లో 74,843 మంది బాలురు, 82,358 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు.జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని నమ్మి అనేక మంది విద్యార్థులు ప్రతీ రోజూ పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో పాఠశాలలోనే వంట ఏజెన్సీలు వేడివేడిగా విద్యార్థులకు వండివడ్డించేవారు. ఇటీవల ప్రభుత్వం ఉత్తరాదికి చెందిన ఏక్తాశక్తి అనే సంస్థకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించింది. తొలుత ఈ సంస్థకు జిల్లాలోని 1070 పాఠశాలలకు సంబంధించి 1,17,767 మందికి మధ్యాహ్న భోజనం సరఫరా చేయడానికి కాంట్రాక్టు ఇచ్చింది. గత జనవరిలో ఈ సంస్థ జిల్లాలోని 5 క్లస్టర్‌ పాయింట్లు ఏర్పాటు చేసుకుని సరఫరాకు సిద్ధమైంది. అయితే సాంకేతిక లోపం కారణంగా ప్రతీ క్లస్టర్‌లో ఒప్పందం చేసుకున్న పాఠశాలల కంటే సగానికి మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. ఉత్తరాదికి చెందిన సంస్థ కావడంతో ఇక్కడి వంటలకు, అక్కడి వంటలకు పూర్తి తేడా ఉండడంతో విద్యార్థులకు ఈ వంటలు రుచించక భోజనం మానేసి పస్తులుంటున్నారు. కొన్ని పాఠశాలలకు చల్లారిన వంటలు రావడం, మరికొన్ని పాఠశాలలకు సమయం గడిచిపోయిన తరువాత రావడం కూడా విద్యార్థులకు ఇబ్బందిగా మారింది.

No comments:

Post a Comment