హైద్రాబాద్, మార్చి 2, (way2newstv.in)
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాకూటమిలో చేరిన కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి... లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో కలిసి పని చేసే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును కోదండరాం తప్పుబట్టినా... పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌తోనే కలిసి నడుస్తారని రాజకీయవర్గాలు భావించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాంకు పోటీ చేసే అవకాశం ఇవ్వని కాంగ్రెస్ పార్టీ... లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఏదో ఒక స్థానం బరిలోకి దింపొచ్చని వార్తలు వినిపించాయి.
లోకసభకు కోదండరామ్
అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే తమ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పటికే తమ అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. టీ పీసీసీ జాబితాను తయారు చేసి ఏఐసీసీకి పంపించడం... దానికి ఏఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎవరితో పొత్తులు లేకుండానే పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దీంతో ఈ సారి కోదండరాంకు చెందిన టీజేఎస్‌కు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చిందనే ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ పొత్తుకు అంగీకరించకపోతే సొంతంగా బరిలోకి దిగుతామని గతంలో కోదండరాం ప్రకటించారు. అయితే పెద్దగా క్యాడర్ బలం లేదని టీజేఎస్... ఒంటరిగా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావించిన కోదండరాం... ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నట్టు అర్థమవుతోంది.
No comments:
Post a Comment