Breaking News

02/03/2019

ఆ ముగ్గురు పై బాబు గురి

తిరుపతి, మార్చి 2, (way2newstv.in)
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన సొంత జిల్లాలో ప్రత్యర్థి పార్టీ నేతలు బలంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ ఎన్నికల్లో వారిని ఓడించి తీరాల్సిందేనని పార్టీ నేతలకు ఇప్పటికే పిలుపు నిచ్చారు. ప్రత్యేకంగా ఈ మూడు నియోజకవర్గాలపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆ మూడు నియోజకవర్గాల నేతలకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏ సమయంలోనైనా అవసరం అనుకుంటే తనకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని, అవకాశాన్ని జారవిడుచుకోవద్దని చంద్రబాబు సూచించారు. ఈమూడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను దాదాపుగా ప్రకటించారు. మరొక నియోజకవర్గంలో అభ్యర్థిని నిర్ణయించాల్సి ఉంది. నగరి నియోజకవర్గాన్ని చంద్రబాబు టార్గెట్ చేశారు. గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీకి మింగుడు పడటం లేదు. చంద్రబాబునాయుడి దగ్గర నుంచి మంత్రుల వరకూ ఎవరినీ వదిలిపెట్టకుండా రోజా విమర్శలను సంధిస్తున్నారు. 


ఆ ముగ్గురు పై బాబు గురి

అసెంబ్లీలో సయితం రోజా చేస్తున్న వీరంగాన్ని టీడీపీ అధినేత జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో రోజాను ఎట్టిపరిస్థితుల్లో అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఇక్కడ అభ్యర్థిని ఇంకా డిసైడ్ చేయలేదు. గాలి ముద్దుకృష్ణమనాయుడి కుటుంబంలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. రెండు, మూడురోజుల్లో ఇక్కడి అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నారు.ఇక చంద్రబాబు లక్ష్యం మరో నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈయన కూడా బాబుకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. గత ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంనుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పై విజయం సాధించారు. చెవిరెడ్డి దూకుడును చంద్రబాబు సహించలేకపోతున్నారు. ఈయనను ఎలాగైనా ఓడించి తీరాల్సిందేనని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విధాలుగా తాను ఈ నియోజకవర్గ నేతలకు అండగా ఉంటానని, అందుబాటులో ఉంటాననిచెప్పారు. ఇక్కడ పులివర్తి నానిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పోటీకి విముఖత చూపడంతో కొన్నాళ్ల క్రితమే నానిని ఇన్ ఛార్జిగా నియమించారు.చంద్రబాబు టార్గెట్ లో ఉన్న మూడో నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించి తీరాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. పెద్దిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాకు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా కొందరు వైసీపీ నేతలకు సహకారం అందిస్తుండటమే ఇందుకు కారణమంటున్నారు. అభ్యర్థుల ఎంపిక కూడా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుంది. దీంతో పెద్దిరెడ్డిని కట్టడి చేయడానికి మంత్రి అమర్ నాధ్ రెడ్డి మరదలు అనీషారెడ్డికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇక్కడ ద్వితీయ శ్రేణి నేతలతోనూ చంద్రబాబు మాట్లాడుతుండటం విశేషం. మరి చంద్రబాబు ఈ ముగ్గురు వైసీపీ నేతలను తన వ్యూహాలతో ఓడించగలగుతారో ? లేదో చూడాల్సి ఉంది

No comments:

Post a Comment