Breaking News

19/03/2019

టీడీపీలో కన్ఫ్యూజన్....

గుంటూరు, మార్చి 19, (way2newstv.in)
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయోమయంగా తయారైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గెలుపుపై పైకి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ వస్తున్న సంకేతాలు విజయం చాలా కష్టమనేలా అన్పిస్తున్నాయి. ఇది వరకూ ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి తయారయింది. తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ లేని సీన్లు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థులు దొరకని పరిస్థితి అధినేతకు ఎదురవుతుందంటే… ఈ తికమక… టీడీపీని ఎటు తీసుకెళుతుందన్నదే ప్రశ్న.లోక్ సభ కు పార్లమెంటు అభ్యర్థులు పోటీకి ముందుకు రాని పరిస్థితి. అభ్యర్థులను వెదుక్కోవాల్సిన స్థితి. నెల్లూరు, ఒంగోలులో చంద్రబాబుకు అక్కడి నేతలు చుక్కలు చూపించారు. అనేక చోట్ల ఎంపీ అభ్యర్థులు సరైన వారు లేకపోవడంతో కాంగ్రెస్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దాదాపు అరడజనుకు పైగానే నేతలను కాంగ్రెస్ నుంచి తీసుకువచ్చి టిక్కెట్లు ఇచ్చుకోవాల్సి వస్తోంది. కర్నూలులో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, తిరుపతిలో పనబాక లక్ష్మి, అరకులో కిషోర్ చంద్రదేవ్ వంటి వారిని తెచ్చుకోవాలి. ఇప్పటి వరకూ ఎంపీ అభ్యర్థులను టీడీపీ పూర్తి స్థాయిలో ఖరారు చేయలేకపోయిందంటే పరిస్థిితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


 టీడీపీలో కన్ఫ్యూజన్....

వలసలు కూడా వైసీపీలోకి జోరుగా పెరగడం కూడా టీడీపీకి కొంత మేర నష్టం చేకూర్చే అవకాశముంది. నోటిఫికేషన్ వచ్చే వారం రోజులు ముందు టీడీపీ నుంచి అనేక మంది పేరున్న నేతలు వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, తోట నరసింహం, ద్రోణంరాజు సత్యనారాయణ, కిల్లి కృపారాణి వంటి నేతలు వైసీపీ బాట పట్టారంటే ఆ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు అద్దంపట్టే విధంగా ఉంది. అలాగని చేరిన నేతలందరికీ జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. తనకు ఎన్నికలలో సంపూర్ణ సహకారం అందిస్తే, అధికారం లోకి వచ్చిన వెంటనే పదవులు ఇస్తామని సీనియర్లకు జగన్ హామీ ఇచ్చారు.తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ టిక్కెట్లకు కూడా కన్ఫ్యూజన్ కు లోనవ్వాల్సి వచ్చింది. చీరాలకు కరణం బలరాం, తాటికొండకు మాల్యాద్రి, పాయకరావు పేట సిట్టింగ్ ఎమ్మెల్యే అనితను కొవ్పూరు నియోజకవర్గానికి, కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే జవహర్ ను తిరువూరుకు పంపాల్సి వచ్చింది. ఇక ప్రత్తిపాడు నియోజకవర్గంనుంచి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ రంగంలోకి దించింది. శ్రీశైలం అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే తాను పోటీ చేయలేనని చేతులెత్తేశారు. దీంతో అక్కడ ఏవీ సుబ్బారెడ్డిని నిలబెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారు. దాదాపు 35 అసెంబ్లీ సీట్లను, ఎంపీ సీట్లను ఇంకా టీడీపీ అధినేత ఖరారు చేయలేదంటే సంకేతాలు ఏవిధంగా ఉన్నాయన్నది ఇట్టే అర్థమవుతుంది. కేవలం పసుపు కుంకుమ, పింఛన్ల వంటి సంక్షేమ కార్యక్రమాలపైనే చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వడం కూడా పార్టీకి నష‌్టం చేకూర్చే అంశమనే చెప్పాలి. మొత్తం మీద వస్తున్న సంకేతాలు తెలుగుదేశం గెలుపు అంత ఈజీ కాదన్నది స్పష్టమవుతుంది.

No comments:

Post a Comment