Breaking News

19/03/2019

24 ఏళ్ల తర్వాత ములాయం, మాయవతి ఒకే వేదిక

లక్నో మార్చి 19, (way2newstv.in)
రాజకీయాల్లో ఒక వయసు వచ్చిన తర్వాత జనం మీద కంటే వారసుల మీద ఆధారపడటమే ఎక్కువగా జరుగుతుంటుంది. దశాబ్దాల పాటు పార్టీని, రాష్ట్రాన్ని శాసించిన నేతలు కూడా వారసుల నిర్ణయాలకు తలవంచక తప్పదు. ఇది ఖచ్చితంగా రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. వయసు మీద పడుతున్న ములాయం సింగ్ యాదవ్ ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లో ఒక నిర్ణయాత్మక శక్తి. ఆయన ప్రసంగాలు నేటికీ ఓట్ల వర్షం కురిపిస్తాయంటారు. అలాంటి ములాయం ఇప్పుడు కొడుకు అఖిలేష్ యాదవ్ చెప్పినట్లు ఆడాల్సి వస్తోంది. ములాయం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయరని అందరూ భావించారు. వయసు మీద పడటం, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ తనకు ప్రాధాన్యత లభిస్తుందా? లేదా? అన్న అనుమానంతో పాటు కుటుంబంలో కలహాలు కూడా ములాయం సింగ్ ను ఇరుకున పడేశాయి. 


24 ఏళ్ల తర్వాత ములాయం, మాయవతి ఒకే వేదిక

ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ ప్రత్యేకంగా పార్టీ పెట్టుకుని పోటీకి దిగుతుండటంతో అటు కుమారుడు, ఇటు సోదరుడి మధ్య ఆయన నలిగిపోతున్నారు. రెండు పార్టీల సమావేశాలకూ హాజరయిన ఆయన ఇద్దరితో సమదూరం పాటిస్తున్నారు. చివరకు పోటీకి ఆయన దిగుతున్నారు.ఇక తమకు సుదీర్ఘకాలం శత్రువుగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో చేతులు కలిపినా ములాయం చేష్టలుడిగి చూస్తున్నారు. మాయావతితో చేతులు కలపడం పెద్దాయనకు అస్సలు ఇష్టం లేదంటున్నారు. రెండు పార్టీలు చేతులు కలిపినా ఓట్ల మార్పిడి జరగదన్నది ములాయం వాదన. ఇది దీర్ఘకాలంలో పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే పార్టీ తన చేతుల్లో లేదని, నిర్ణయాలు కూడా తనను సంప్రదించి అఖిలేష్ తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన బద్ధ విరోధి మాయావతితో ములాయంసింగ్ వేదిక పంచుకోనున్నారు. మెయిన్ పురి నుంచి ములాయం సింగ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 20 వ తేదీన ములాయం కు మద్దతుగా మాయావతి ప్రచారం చేయబోతున్నారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత బద్ధవిరోధులిద్దరూ కలవనున్నారు. 1995 నుంచి వారిద్దరూ ఎదురెదురుకూడా పడలేదు. రేపు ఇద్దరూ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఇది ములాయం సింగ్ కు ఇష్టం లేకపోయినా కొడుకు కోసం అయిష్టంగానే తలూపారట. పాపం పెద్దాయన….!!!

No comments:

Post a Comment