Breaking News

19/03/2019

మాండ్య... మరుగుతోంది

బెంగళూర్, మార్చి 19, (way2newstv.in)
కర్ణాటక రాజకీయాల్లో సినీనటి, అంబరీష్ సతీమణి సుమలతతో చిక్కొచ్చిపడింది. సుమలత మాండ్య నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఆమె గత కొద్దిరోజులుగా మాండ్య నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సుమలతను కట్టడి చేయడం కాంగ్రెస్ నేతల వల్ల కావడం లేదు. ఆమెకు మరో నియోజకవర్గం కేటాయిస్తామని చెప్పినా సుమలత ససేమిరా అన్నారు. ఇప్పటికే మాండ్య నియోజకవర్గాన్ని జనతాదళ్ ఎస్ కు కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.మాండ్య నియోజకవర్గం నుంచి తొలిసారి దేవెగౌడ మనవడు, కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పోటీ చేయనున్నారు. నిఖిల్ రాజకీయ అరంగేట్రాన్ని సాఫీగా చేయాలనుకున్న దళపతి దేవెగౌడ మాండ్య నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అయితే అంబరీష్ కు పట్టున్న స్థానం కావడం, ఆయన ఇటీవల మరణించడంతో సుమలత తాను బరిలో ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని సుమలత ఇప్పటికే ప్రకటించారు. 


మాండ్య... మరుగుతోంది

భారతీయ జనతా పార్టీ సుమలతకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాండ్య నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే తమ మద్దతు ఉంటుందన్న సంకేతాలను పంపింది. సుమలత ఓకే అంటే మద్దతు ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. సుమలత ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎస్ఎం కృష్ణను కూడా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుమలత బీజేపీ నుంచి బరిలోకి దిగుతారా? లేక స్వతంత్ర అభ్యర్థిగా ఉంటారా? అన్నది ఇంకా తేలలేదు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆలోచనలో సుమలత ఉన్నారు.ఇక మాండ్య నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలంతా సుమలతకే మద్దతు పలుకుతుండటం విశేషం. పార్టీ నుంచి సస్పెండ్ చేసినా తమ మద్దతు ఆమెకేనని ప్రకటించడంతో ఇప్పుడు జేడీఎస్ కు తలనొప్పిగా మారింది. నిఖిల్ రాజకీయ జీవితం ప్రారంభంలోనే ఇబ్బంది ఎదురవుతుందా? అన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కాంగ్రెస్ శ్రేణుల మద్దతు ఆమెకే ఉంటుందని జేడీఎస్ అనుమానిస్తుంది. పొత్తు ధర్మం ఇంక ఎక్కడ ఉందని జేడీెఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మాండ్యలో సహకరించకపోతై మైసూరులో తమ సత్తా చూపుతామంటూ జేడీఎస్ హెచ్చరికలు పంపుతుండటంతో సిద్దరామయ్య దిద్దుబాటు చర్యలకు దిగారు.

No comments:

Post a Comment