Breaking News

02/03/2019

ప్రభుత్వ భూముల్లో సప్తగిరి వెంచర్లు

మెదక్, మార్చి 2, (way2newstv.in)
ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ప్రైవేటు వ్యక్తులు వాటిని ప్లాట్లుగా మార్చి అమాయకులకు అంటకడుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా రామాయంపేటలో రియల్ దందా జోరుగా సాగుతుంది. హైవేకు అనుకొని ఎకరా కోటి పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. ఇదే అదునుగా బావించిన కొందరు రియల్ ఎస్టెట్ వ్యాపారం ద్వారా వెంచర్లు ఏర్పాటు చేసి ప్రైవేటు భూములతో పాటు చుట్టుపక్కల గల ప్రభుత్వ భూములను కబ్జా చేసుకొని వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తూ అక్రమంగా లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు చేపట్టడం లేదు. వివరాల్లోకి వెళ్తే రామాయంపేట-మెదక్ రహదారికి ఆనుకొని సప్తగిరి వెంచర్ పేరుతో 30నుండి 40 ఎకరాల్లో ప్లాట్ల కోసం చదును చేశారు. 


 ప్రభుత్వ భూముల్లో సప్తగిరి వెంచర్లు

1544 సర్వే నంబర్‌లో 0.39గుంటల ఖరీదు ఖాతా ప్రభుత్వ భూమిలోను ప్లాట్లు వెలిశాయి. 1541 ప్రభుత్వ సర్వే నంబర్‌లో ఎకరా తొమ్మిది గుంటల భూమిని కూడా వెంచర్ నిర్వాహకులు అధికారుల అండదండలతో ప్లాట్లుగా మార్చి విక్రయాలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో ఇట్టి వెంచర్‌పై స్థానికులు పిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేశారు. అది కొంత కాలానికి కనిపించకుండా పోయింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకుండి పోవడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఏది ఏమైనా కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.సప్తగిరి వెంచర్ నిర్వాహకులు ప్రభుత్వ భూమిలో ప్లాట్లు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని నూతనంగా వచ్చిన తహశీల్దార్ శేఖర్‌రెడ్డి అన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సప్తగిరి వెంచర్‌లో ప్రభుత్వ భూములు ఉన్నందున అందులో ఎవరూ ప్లాట్లు కొనవద్దని విజ్ఞప్తి చేశారు. మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని తహశీల్దార్ సూచించారు.

No comments:

Post a Comment