Breaking News

14/02/2019

రైతుకంట కన్నీరు (నిజామాబాద్)

నిజామాబాద్, ఫిబ్రవరి 14 (way2newstv.in):
 పచ్చ బంగారం రైతు కంట కన్నీటినే మిగిలిస్తోంది.  ఆరుగాలం చెమటను చిందించి పండించిన పసుపు పంట చివరకు నష్టాలే మూటగడుతోంది. ఎకరాన కనీసం    రూ.1.32 లక్షల వరకు ఖర్చు చేసి సాగు చేస్తే.. లాభాలు అటుంచి కనీసం పెట్టుబడి కూడా రాలేని దుస్థితి నెలకొంది.  జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 33 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతోంది. అత్యధికంగా ఆర్మూర్‌ డివిజన్‌లోని నందిపేట్‌, వేల్పూర్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, బాల్కొండ, జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌ మండలాల్లో రైతులు ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. నిర్మల్‌, మెట్‌పల్లి ప్రాంతాల్లో సైతం ఈ పంటను సాగు చేస్తున్నారు.


రైతుకంట కన్నీరు (నిజామాబాద్)

రైతుకు ఉన్న వ్యవసాయ భూమిలో సగం పసుపును సాగు చేస్తూ వచ్చే ఏడాది పంట మార్పిడితో సాగు చేస్తారు. అందుకే ఏడాది పంటగా పసుపును పేర్కొంటారు. పూర్తిగా నేల స్వభావం, సేంద్రియ ఎరువులు, నల్లమట్టి, పశువుల పేడపైనే దిగుబడులు ఆధారపడి ఉండటంతో పెట్టుబడి వ్యయం ఏటేటా పెరుగుతూ వస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంటోంది. కానీ దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి ధర ఆమాంతం తక్కువ పలుకుతుండటంతో పెట్టుబడి దక్కక అప్పులే మిగులుతున్నాయి.
ఎకరాన పెట్టుబడి సరాసరి రూ.1,32,250. వస్తున్న దిగుబడి 22 క్వింటాళ్లు. మార్కెట్‌లో ప్రస్తుతం పలుకుతున్న ధర క్వింటాలుకు రూ.4,800. ఎకరాన వస్తున్న నష్టం రూ.26,650. జిల్లాలో మొత్తంగా 33 వేల ఎకరాల్లో పసుపు పంట సాగు చేయగా.. మొత్తం రూ.87 కోట్ల వరకు రైతులు నష్టపోతున్నారు. పైగా వారి శ్రమ, కూలీ, విద్యుత్తు, మోట్లార్ల వ్యయం అదనం. ధరతో సంబంధం లేకుండా పంట దిగుబడినే ఎక్కువగా నమ్ముకుంటాడు రైతు. ధర తగ్గినా వచ్చిన దిగుబడి కనీసం నష్టాలను మిగిల్చదని నమ్మకం. కానీ ఈ ఏడాది గతంలో కంటే గణనీయంగా దిగుబడి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులే. కేవలం ఒకే నెలలో కురిసిన వర్షాలతో పంటకు సరైన తేమ అందలేదు. బోరుబావుల ద్వారా ఎంతగా నీరు అందించినా ప్రయోజనం అంతంత మాత్రమే. పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని దశాబ్ద కాలంగా రైతులు ఉద్యమిస్తున్నా ప్రభుత్వాల్లో కదలిక ఉండటంలేదు. 2009-10, 2010-11లో మాత్రమే క్వింటాలుకు రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు పలికింది. ఆ తర్వాత ఎప్పుడూ రూ.8 వేలు దాటలేదు. ఈ ఏడాది మరింత పతనం కావడం గమనార్హం. పసుపుబోర్డు విషయం పక్కనబెడితే కనీసం మద్దతుధర కూడా అందటం లేదు.

No comments:

Post a Comment