Breaking News

14/02/2019

లక్ష్యం వైపు పరుగులు (కరీంనగర్)

కరీంనగర్, ఫిబ్రవరి 14 (way2newstv.in): 
జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం పనులు లక్ష్యం మేరకు పూర్తవుతున్నాయి.. పైపులైన్‌కు ట్రయల్‌రన్‌ చేపడుతూ తలెత్తే సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మిషన్‌ భగీరథ ప్రధాన పనులు పూర్తిచేసి ఊరి చివర ఏర్పాటు చేసిన ట్యాంకుల వరకు బల్క్ వాటర్‌ను పంపిస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ నీరందించే విషయంపై పైపులైన్ల నిర్మాణం పనులనూ చేపట్టారు. దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. ప్రతి ఇంటివద్ద నల్లా కనెక్షన్‌ బిగించుకోవడానికి వీలుగా అవసరమైన పైపులు ఏర్పాటు చేస్తున్నారు. జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరాకు అదనంగా అవసరమైన నీటి ట్యాంకుల నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటివరకు 380 ట్యాంకులకు 280 పూర్తయ్యాయి. మిగిలిన వాటిని పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయి. 


లక్ష్యం వైపు పరుగులు (కరీంనగర్)

అధికారులతో పాటు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు.
మార్చి కల్లా గ్రామంలో ప్రతి ఇంటికి నీరందించాలన్న లక్ష్యంలో భాగంగా ఇదివరకే నల్లా కనెక్షన్‌ ఉన్న నల్లాలతో పాటు కొత్తది ఇస్తున్నారు. ఇందుకు వీలుగా పైపులైన్ల పనులు చేపట్టారు. ప్రతి గ్రామంలో ఇంటిముందు వరకు పైపును వదిలేసి నల్లా కనెక్షన్‌ బిగించుకునేలా ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడిన కాలనీలు గ్రామాల్లోనూ బిగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కనెక్షన్‌ పనిచేస్తుందా..? లేదా పరిశీలిస్తున్నారు.
మిషన్‌ భగీరథ పనులతో పాటు నల్లా కనెక్షన్‌ ఇవ్వబడిన గ్రామాల్లో కనెక్షన్ల వారీగా వినియోగదారుని పేరును నమోదు చేస్తున్నారు. వీటిని గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో అంతర్జాలంలో నమోదు చేస్తున్నారు. పంచాయతీల వారీగా పనులు పూర్తయినట్లు తీర్మానాలు చేయిస్తున్నారు. చాలా గ్రామాల్లో పనులు పూర్తయినప్పటికీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తీర్మానాలు కాలేదు. మొత్తం 314 గ్రామాలకు గాను 121 గ్రామాల్లో తీర్మానం చేశారు. మిగిలినవి కావాల్సి ఉంది. కరీంనగర్‌ జిల్లాపరంగా దిగువ మానేరు జలాశయం నుంచి తాగునీటి కోసం నీటిని వినియోగిస్తారు. ప్రధాన రిజర్వాయర్లకు బల్క్‌ వాటర్‌ సరఫరా పూర్తయింది. చాలా గ్రామాలకు పైపులైన్ల ద్వారా నీరందిస్తున్నారు. కేవలం 15 నుంచి 20 శాతం వరకు పనులు పూర్తయితే అన్ని గ్రామాలకు నీరందనుంది. కొన్ని గ్రామాల్లో పాత కనెక్షన్ల ద్వారా ఈ నీటిని వినియోగిస్తున్నారు. కొత్త కనెక్షన్లకు కూడా నీరందుతుంది.

No comments:

Post a Comment