విజయనగరం, ఫిబ్రవరి 20(way2newstv.in):
పునాదులుంటాయి. పైకప్పులుండవు. లేదంటే గోడల వరకూ నిలబెట్టేసి ఉంటుంది. ఆ తరువాత ఒక్క పని జరగదు. పొరబాటున పైకప్పు వేసినా చుట్టూ తలుపులుండవు. కిటికీలుండవు. ఇదీ జిల్లాలోని 139 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల పరిస్థితి. పేరుకి పనులు ప్రారంభమైనట్లుగా, రూ.కోట్లు ఖర్చు చేసినట్లుగా రికార్డుల్లో నమోదై ఉన్నా విద్యార్థులకు అవెందుకు ఉపయోగపడని దుస్థితి. కేవలం అదనపు గదులు లేని కారణంగానే ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులు వరండాల్లో, చెట్ల కిందో చదువుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. ఎన్నో పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరిన విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకున్నా సరే ఇప్పటికీ మొండిగోడలే మిగిలాయి.
సర్వశిక్ష అభియాన్ కింద జిల్లాలోని పాఠశాలల్లో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధుల లేమి సమస్యగా మారింది. దాదాపు అయిదేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో జిల్లాలోని 139 పాఠశాలల్లో చేపట్టిన 139 అదనపు తరగతి భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
దీంతో ఆయా పాఠశాలల్లో చదువుకుంటున్న 10,000 మందికి పైగా విద్యార్థులకు అవస్థలు పడాల్సి వస్తుంది. తరగతి గదులు సరిపోక వరండాల్లో, చెట్ల కిందో పాఠాలు వినాల్సి వస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే ప్రతిపాదనలు పంపుతున్నా ఎలాంటి కదలిక లేకపోవడంతో జిల్లా అధికారులంతా తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 2013-14లో 33 పాఠశాలలకు ఉన్నత స్థాయి కల్పించారు. దీంతో అక్కడ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాని వాటికి వసతి సమస్య ఉత్పన్నమవుతూంది. కాని నేటికీ ఆయా పాఠశాలల్లో అదనపు గదులు పూర్తికాక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి సదరు 139 గదుల నిర్మాణాల పూర్తికి రూ.5.65 కోట్లు ఉంటే సరిపోతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కలెక్టరు హరిజవహర్‌లాల్ రాష్ట్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు 2018-19లో మౌలిక సదుపాయాల నిమిత్తం ఉద్దేశించిన ఎయిమ్ ప్రాజెక్టులోను కదలిక లేదు. జిల్లా నుంచి రూ.338.81 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. దాంట్లో 866 పాఠశాలలకు గాను 1265 అదనపు గదుల నిర్మాణానికి అంగీకారం కోరారు. అయితే పాతవే పూర్తికాని ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నిర్మాణాలకు ఎంతవరకూ ఒప్పుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అసంపూర్తి భవనాల నిమిత్తం జిల్లా నుంచి గత అయిదేళ్లుగా ప్రతిపాదనలు వెళుతూనే ఉన్నాయి. 2013-14, 2014-15, 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో నయా పైసా విడుదల కాలేదు. 2017-18కి సంబంధించి రూ.3 కోట్లు మంజూరుచేసినా దాంట్లో రూ.1.30 కోట్లు మాత్రమే అసంపూర్తి భవనాలకు ఇవ్వగా, మిగతా రూ.1.70 కోట్లు కొత్త భవనాలకు కేటాయించింది. దీంతో జిల్లాలో అసంపూర్తి భవనాలకు మోక్షం లభించని పరిస్థితి ఎదురైంది. 2018-19 సంవత్సరానికి సంబంధించి మొత్తంగా రూ.220 కోట్ల నిధులు అవసరమంటూ సర్వశిక్ష అభియాన్ అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే ఇప్పటివరకూ రూ.46 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. పైగా ఆ నిధులేవీ సివిల్ పనులకు కాకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయిన అదనపు తరగతి భవనాలకు మోక్షం లభించలేదు. గత అయిదేళ్లుగా అధికారులు ప్రతిపాదనలు పెట్టడమే తప్ప రాష్ట్ర స్థాయి కటాక్షం కలగట్లేదు.
No comments:
Post a Comment