ఏలూరు, ఫిబ్రవరి 20 (way2newstv.in): భవనంపైకి ఎక్కాలంటే మెట్లు ఉండాలి. ఒక సామాన్యుడు డాబా నిర్మించుకున్నా దానికి తప్పకుండా మెట్లు ఏర్పాటు చేసుకుంటారు. అది కచ్చితంగా చేయాల్సిన పని. అలాంటి కనీస ఆలోచన ప్రభుత్వ అధికారులకు లేకపోవడం శోచనీయం. ఫలితంగా సుమారు దశాబ్దం కిందట రూ.36కోట్లతో చేపట్టిన వంతెనలు ఇప్పటికీ అందుబాటులో రాలేదు. జిల్లాలో కీలకమైన యనమదుర్రు డ్రెయిన్‌పై నిర్మించిన వంతెనలకు అప్రోచ్‌లు ఏర్పాటు చేయలేదు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డెల్టా ఆధునికీకరణలో భాగంగా వంతెనల నిర్మాణం చేపట్టింది. ఈ పనులు ఇప్పటికీ నత్తను తలపిస్తూనే ఉన్నాయి. యనమదుర్రు - డేగాపురం గ్రామాల మధ్య వంతెన ప్రాథమిక దశలోనే నిలిచిపోయింది.
వారధి వేదన(పశ్చిమగోదావరి)
తర్వాత ఆ వంతెన పనులు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన వంతెనల నిర్మాణం పూర్తయి దాదాపు రెండేళ్లు దాటిపోయింది. నేటికీ అప్రోచ్‌లు నిర్మాణం లేక నిరుపయోగంగా మారాయి. కొన్ని చోట్ల అయితే మెల్లమెల్లగా శిథిలం అవుతున్నాయి. కొందరు రాత్రిళ్లు వంతెనలపైకి ఎక్కి మద్యం తాగుతున్నారు. ప్రజల రాకపోకలకు ఉపయోగపడాల్సిన వంతెనలు చివరికి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.
వంతెనల పైకి ఎక్కాలన్నా... దిగాలన్నా అప్రోచ్‌లే అత్యంత కీలకం. అసలు వాటి ప్రస్తావన లేకుండా ఎలా ప్రతిపాదించారనే విషయం జల వనరుల శాఖ అధికారులకే తెలియాలి. గత ఏడాది అప్రోచ్‌లకు ప్రతిపాదనలు పంపించామని అధికారులు చెబుతున్నారు. వంతెలను నిర్మించడానికే దశాబ్దకాలం పడితే ఇక అప్రోచ్‌లు ఎప్పుడు మంజూరవుతాయి? పనులు ఎప్పుడు ప్రారంభించి?? ఎప్పుడు పూర్తి చేస్తారనే విషయం ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. పాలకులు కూడా మొదటి నుంచి పూర్తిస్థాయిలో శ్రద్ద చూపలేదనే విమర్శలు ఉన్నాయి.
యనమదుర్రు డ్రెయిన్ నందమూరు అక్విడెక్టు వద్ద ప్రారంభమై భీమవరం శివారు పాతపాడు వద్ద ఉప్పుటేరులో కలుస్తుంది. దీని పొడవు 60 కిలోమీటర్లు. దీనికి ఇరువైపులా వందలాది గ్రామాలుండగా వాటి పరిధిలో లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారంతా కళ్లెదురుగా కనిపిస్తున్న ప్రాంతానికి వెళ్లాలంటే పూర్వం నుంచి నాటు పడవలే దిక్కు. ఆ క్రమంలో పడవ ప్రమాదాలు జరిగి ఇప్పటికి 80 మంది వరకు జలసమాధి అయ్యారు. దీంతో దీనిపై వంతెనలు నిర్మించాలని దశాబ్దాల కాలంగా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు డెల్టా ఆధునికీకరణలో పనులు ప్రారంభించినా నిరుపయోగంగా మారడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వంతెనల నిర్మాణానికి రూపొందించిన డిజైన్‌లో లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న వంతెనలు అప్రోచ్‌లు లేకుండానే గాలిలో తేలినట్లుగా ఉన్నాయి.దానికి సమాంతరంగా అప్రోచ్ నిర్మించాలంటే ఎంతో ఎత్తుతో పూడ్చాలి. దానికి అవసరమైన స్థలం చాలా చోట్ల లేదు. ఒక చోట పంట కాలువ మరో చోట పక్కా నివాస భవనాలు ఉండటంతో నిర్మించేందుకు అనువైన వాతావరణం కనిపించడం లేదు.
No comments:
Post a Comment