Breaking News

20/02/2019

కారుణ్యం చూపండి (కరీంనగర్)

కరీంనగర్, ఫిబ్రవరి 20 (way2newstv.in): 
సింగరేణిలో కారుణ్యం కరవవుతోంది. చిన్నచిన్న కారణాలకే నియామకం కలిపివేసి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. విచారణల పేరుతో కాలం వెల్లదీస్తున్నారు. కారుణ్య నియామకాల కింద అన్‌ఫిట్‌ అయిన 50 శాతం మందికి పైగా కార్మికుల వారసులు ఉద్యోగాల్లో చేరలేదు. విజిలెన్సు విచారణ పేరుతో కొంత మంది.. కులం పేరు తేడా ఉందని మరి కొంతమంది.. కుటుంబ సభ్యుల ఆమోదం లేదని చాలా మంది వారసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పేరుకే కారుణ్య నియామకాల కింద మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ చేస్తున్న యాజమాన్యం వారసులకు ఉద్యోగం కల్పించే విషయంలో అనేక కొర్రీలు పెడుతోంది. కొంతమంది కార్మికులు తమ పిల్లలకు ఉద్యోగం కల్పిస్తారో లేదోనని ఆందోళన చెందుతున్నారు. గనులపై ఉన్న కార్యాలయాల చుట్టు తిరుగుతున్న కార్మికులు, వారసులు ఎంతోమంది నానాతంటాలు పడుతున్నారు. 


కారుణ్యం చూపండి (కరీంనగర్)

సింగరేణి యాజమాన్యం కారుణ్యం కింద మెడికల్‌ బోర్డులో ఇన్‌వాలిడేషన్‌ అయిన కార్మికుని వారసునికి ఉద్యోగం కల్పించాలి. నిబంధనల ప్రకారం కార్మికుని వారసునిగా సరైన పత్రాలు చూపిస్తే సరిపోతుంది. దానికి సాక్షులుగా కొంతమంది కార్మికులు సంతకం చేయాలని నిబంధన పెడుతున్నారు. దీంతో పాటు కార్మికుని కుటుంబంలో ఉన్న మొత్తం మంది వారసునికి ఉద్యోగం కల్పించాలని ఆమోదం తెలపాలని ఒత్తిడి తెస్తున్నారు. వారసులు ఇద్దరు, ముగ్గురు ఉంటే వారి ఆమోదం తీసుకోవాలి. ఆ ఇంటి ఆడపడుచుకు సంబంధించిన ఆమోదం కూడా తీసుకోవాలనడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం గనిపైకి వచ్చి వారి ముందు ఆమోదం తెలపాలంటున్నారు. దీంతో చాలా మంది మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ అయిన కార్మికుల పిల్లల్లో 50 శాతంపైగా ఉద్యోగంలో చేరలేదు.
కార్మికుల పూర్తి వివరాలు నమోదు చేయడంలో సంస్థాగతంగా సిబ్బంది తప్పులు కూడా కార్మికులకు శాపంగా మారుతున్నాయి. కార్మికులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈపీఆర్‌లో నమోదు చేస్తారు. కార్మికుడు ఉద్యోగంలో చేరే సమయంలో తనకు సంబంధించిన పూర్తి వివరాలను పక్కాగా చెప్పినప్పటికీ కొంత మందివి రికార్డుల్లో తప్పుగా నమోదయ్యాయి. సాధారణ రికార్డుల నుంచి కంప్యూటీకరణ చేసే సమయంలో కార్మికుల వివరాలు సక్రమంగా నమోదు చేయలేదు. దీంతో మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ సమయంలో వారసుడి, కార్మికుని వివరాలు వేర్వేరుగా ఉండటంతో నియామక ప్రక్రియను పక్కన పెడుతున్నారు. ఉదాహరణకు ఒక కార్మికుని కులం ఉద్యోగంలో చేరే సమయంలో సక్రమంగానే చెప్పినప్పటికీ కంప్యూటీకరణ సమయంలో అతని కులం వేరుగా నమోదు చేశారు. వారసునికి ఉద్యోగ సమయంలో కుమారునికి సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాలు, తండ్రి రికార్డుల్లో ఉన్న కులం వేరుగా ఉండటంతో నియామక ప్రక్రియను నిలిపివేసి కార్పొరేట్‌కు అభిప్రాయం కోసం రాస్తున్నారు. ఇలాంటి కేసులు సింగరేణి వ్యాప్తంగా ఎక్కువగానే ఉన్నాయి. ఇక కుటుంబంలో కొంతమంది ఆమోదం తెలపలేదని చెప్పి ఉద్యోగాలు పెండింగ్‌లో ఉంచారు. ఇక విజిలెన్సుకు ఫిర్యాదులు వెళ్లాయని మరికొంత మందివి నిలిపివేశారు. ఇలా అనేక కారణాలతో వారసుల ఉద్యోగాలు ఆగిపోవడంతో 8 నెలల నుంచి ఉద్యోగం కోసం తిరుగుతున్న వారున్నారు. కారుణ్య నియామకాలు మొదలై 10 నెలలవుతోంది.
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గుర్తింపు సంఘం దృష్టి సారిస్తేనే వారసుల నియామక ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఇప్పటివరకు 28 మెడికల్‌ బోర్డులు నిర్వహించగా అందులో 3,500 పైగా కార్మికులు మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ పొందారు. వారి పిల్లలకు ఉద్యోగం కల్పించాల్సిన యాజమాన్యం ఇందులో సగం మందిని పక్కన పెట్టేసింది. మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌తో ఉద్యోగం లేక.. వారసునికి ఉద్యోగం రాక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గుర్తింపు సంఘం చొరవ తీసుకుంటేనే వారసుల ఉద్యోగాలను వేగవంతం చేసే అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment