Breaking News

02/07/2018

పోరాట యోధుడిగా చంద్రబాబు ఫోజులు

అనంతపురం, జూలై 2, (way2newstv.in)
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తే 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలా మోసపోయారని ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ.. ప్రజలను రక్షించాల్సిన చంద్రబాబు తననే కాపాడాలంటూ ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేంద్రం స్పందించకపోతే కడప ఉక్కు పరిశ్రమ తానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు అనటం సరికాదన్నారు.నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనపై సమరశంఖం పూరించింది ప్రధాన ప్రతిపక్షం వైసీపీ. అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీలో వంచనపై గర్జన దీక్ష పేరుతో భారీ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఉదయం ప్రారంభమైన ఈ దీక్షా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ పెట్టిన అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భయపడలేదని వ్యాఖ్యానించారు. 



పోరాట యోధుడిగా చంద్రబాబు ఫోజులు

ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చిన పిరికిపంద చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిజమైన పోరాట యోధుడుగా ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబులో ధర్మమూ లేదూ.. పోరాటమూ లేదని వ్యాఖ్యానించారు.ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తర్వాత జిల్లాకు చెందిన పార్టీ నేత రూపొందించిన వైఎస్ జగన్ నవరత్నాల ఫ్లెక్సీని ఆవిష్కరించారు. నేతలు, కార్యకర్తలు నల్ల రంగు చొక్కాలతో తమ నిరసనను తెలియజేశారు. దీక్షా కార్యక్రమంలో టీడీపీ సర్కార్ పాలనపై నేతలు విరుచుకుపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి.. ఇప్పుడు హోదా పేరుతో హడావిడి చేస్తున్నారని విమర్శించారు. దీక్షలు, పోరాటాల పేరుతో ప్రజల్ని మభ్య పెట్టాలని అధికార పార్టీ చూస్తోందని.. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తుండటంతో ఈ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అలాంటి మోసగాళ్ల మాటలు నమ్మొద్దన్నారు నేతలు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లగా వైసీపీ మాత్రమే పోరాటం చేస్తోందన్నారు నేతలు. రాష్ట్రం ప్రయోజనాల కోసం నిజమైన పోరాటం చేస్తుంది ఎవరో టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజల అన్ని పరిణామాలను గమనిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం కూడా దగ్గరపడిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు కూడా సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు. 

No comments:

Post a Comment