విజయనగరం, జనవరి 10 (way2newstv.in):
రైతులకు ఎదురయ్యే సమస్యలు అధిగమించడానికి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. నాణ్యమైన ఉత్పత్తులు, సాగులో మెలకువలు, సాంకేతిక పరిజ్ఞానం అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి గ్రామ సచివాలయాలకు అనుబంధంగా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వం గ్రామ సచివాలయంలోని వ్యవసాయ, ఉద్యా, పశుసంవర్ధక సహాయకుల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు అవసరమైన భవనాల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. మొదటి విడతగా జిల్లాలోని 34 మండలాల్లో మండలానికి ఐదు కేంద్రాల చొప్పున 170 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సుమారు వందకు పైగా ప్రైవేటు భవనాలను గుర్తించారు. జిల్లాలోని ఐదు వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మాస్టర్ హబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఏర్పాటైన గోదాముల్లో ఎరువులు, పురుగు మందులు, రైతులకు అవసరమైన ఉపకరణాలన్నీ అందుబాటులో ఉంచుతారు.
రైతుకు భరోసా.. (విజయనగరం)
రైతులకు అవసరమైన వాటిని రైతు భరోసా కేంద్రంలో ఆన్‌లైన్లో నమోదు చేసుకోవాలి. గోదాముల నిర్వహణ ఆగ్రోస్ చేపట్టనుంది. వ్యవసాయ పరంగా అభ్యుదయ గ్రామాలను ఎంపిక చేసుకుని పైలెట్ ప్రాజెక్టుగా ఫిబ్రవరిలో కేంద్రాలను ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. సాగులో వచ్చే సందేహాలు నివృత్తి చేయడంతో పాటు చీడపీడల నివారణకు సూచనలు, సలహాలు ఇచ్చేలా కేంద్రాలను తీర్చిదిద్దుతారు.వీటికి అనుసంధానంగా సమీప వ్యవసాయ పరిశోధన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి సీజన్ వారీగా శాస్త్రవేత్తలు, నిపుణులు వచ్చి రైతులకు అవగాహన కల్పిస్తారు. ఈ కేంద్రం నుంచే అవసరమైన పురుగుమందులు, విత్తనాలు, పరికరాలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. వీటన్నింటినీ ప్రభుత్వ ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాతే విక్రయిస్తుండడంతో కల్తీ, నకిలీ, నాణ్యత లేమికి అడ్డుకట్ట పడుతుంది. రైతు భరోసా కేంద్రాన్ని 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పల్లె వాతావరణాన్ని ప్రతి బింబించేలా నిర్మాణాన్ని చేపడతారు. కర్షకులు కూర్చునేందుకు వీలుగా నిర్మాణాలు ఉంటాయి. చిన్న ప్రదర్శన క్షేత్రం ఉంటుంది. స్థానికంగా సాగు చేసే విత్తనాల రకాలు ఉంటాయి. ఆన్‌లైన సేవలు అందించడానికి అంతర్జాలం సౌకర్యంతో కూడిన కంప్యూటర్, ఎల్‌ఈడీ స్క్రీన్ అందుబాటులో ఉంటాయి. సుమారు రూ.2 లక్షల విలువైన సామగ్రి కార్యాలయంలో ఏర్పాటు చేస్తారు. ఇక్కడే భూసార పరీక్షలు చేయడానికి చిన్న ప్రయోగశాల ఉంటుంది. ప్రకృతి సాగును ప్రోత్సహించడానికి బీజామృతం, జీవామృతం, పంచగవ్వ తయారీ పద్ధతులను నేర్పిస్తారు. ఇప్పటికే ప్రకృతి సేద్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేంద్రియ ఉత్పత్తుల దుకాణాన్ని దీనికి అనుసంధానిస్తారు. గ్రామ రైతుల వివరాలు, భూమి విస్తీర్ణం, పంటల సాగు, పాడి పశువుల వివరాలతో డేటాబేస్ తయారు చేస్తారు. దీంతో ఏఏ సీజన్లో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయో తెలుస్తుంది. ఇందుకనుగుణంగా సూక్ష్మస్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడానికి గ్రామ వ్యవసాయ సహాయకుల చొరవ చూపుతారు. భవిష్యత్తులో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
No comments:
Post a Comment