నెల్లూరు, జనవరి 10 (way2newstv.in):
నెల్లూరు నగరం, జిల్లా పరిధిలోని అనేక గ్రామాల్లో అతిసార వ్యాధి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది.. ప్రధానంగా ‘అతిసారం’ లక్షణాలే ఇక్కడ కనిపిస్తుండగా, రోగుల కిడ్నీలపైనా ప్రభావం చూపుతుండటం సమస్యను జటిలం చేస్తోంది.. దీంతో వైద్యులు సైతం తలపట్టుకుంటున్నారు. నగరంలోని అనేక ఆసుపత్రులు ఈ తరహా రోగులతో నిండిపోతుండగా.. నీటినమూనాలు సేకరించి విశ్లేషించే పనిలో కార్పొరేషన్ వర్గాలు నిమగ్నమయ్యారు. లోతుగాచూస్తే.. జిల్లా కేంద్రంతో సహా పరిసర గ్రామాల్లో గత ఇరవై రోజులుగా వాంతులు, విరేచనాల సమస్య ప్రజలను వెంటాడుతోంది. అనూహ్యంగా వీటి బారిన పడటం, వెంటనే ఆసుపత్రులకు క్యూ కట్టడం పరిపాటిగా మారింది.
అతిసారం కమ్మేస్తోంది (నెల్లూరు)
తొలుత అతిసారం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్లు కొన్ని ఆసుపత్రుల వైద్యులు భావించినా.. లక్షణాల్లో స్వల్ప మార్పులతో అయోమయంలో పడ్డారు. నగరంలో కొన్నిచోట్ల కుటుంబంలో అందరూ ఈ సమస్య బారిన పడినట్లు తెలుస్తుండగా.. అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో కారణాలు తేల్చలేకపోతుండటం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని జెండావీధి, కోటమిట్ట, మన్సూర్‌నగర్ తదితర చోట్ల నుంచి రోగులు నమోదయ్యారు. కేవలం కలుషిత నీరు అందుతుండటం వల్లే తాము, కుటుంబ సభ్యులు రోగాల బారిన పడుతున్నట్లు బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. క్రమేణా సమస్య ఎక్కువవుతున్న నేపథ్యంలో నెల్లూరు నగరపాలకసంస్థ వర్గాలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నగరంలో నీటిసరఫరా పరంగా సమస్యలున్నాయా? అన్న కోణంలో లోతుగా విచారిస్తున్నారు. నీటిసరఫరా విభాగం ఆధ్వర్యంలో పలు కాలనీల్లో నమూనాల సేకరణ, విశ్లేషణ జోరుగా సాగుతోంది. డిసెంబర్ 20వతేదీ నుంచి 31వతేదీ వరకు 11 రోజుల పాటు 14 ప్రాంతాల్లో నమూనాలు సేకరించినట్లు అధికారుల మాటలను బట్టి తెలుస్తోంది. కోటమిట్ట షాదీమంజిల్, సంతపేట, సుదర్శనం వారి వీధి, ఏబీఎం కాంపౌండ్, కపాడిపాళెం, ఫత్తేఖాన్‌పేట, చర్చివీధి, ముంగమూరివారివీధి తదితర చోట్ల ఈ సేకరణ జరిగింది. నమూనాలను ప్రయోగశాలకు పంపి విశ్లేషించారు. అయితే, అందులో ఎలాంటి కాలుష్య కారకాలు బయటపడలేదని కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, రోగుల సంఖ్య మాత్రం క్రమేణా పెరుగుతోంది. ఇప్పటివరకు కార్పొరేషన్ వర్గాల లెక్కల ప్రకారమే.. అర్బన్ ప్రాంతంలో 69 కేసులు ఆసుపత్రిలో చేరినట్లు తేల్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 73 కేసులు నమోదయ్యాయి. అయితే, అనధికారికంగా ఈ లెక్క రెట్టింపు ఉంటుందని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఇప్పటికే జిల్లా ఉన్నతస్థాయి అధికారులకు అందజేసినట్లు సమాచారం. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో శాఖల మధ్య సమన్వయలోపమే సమస్యను గుర్తించడంలో ప్రధాన ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తోంది. రోగుల సంఖ్య పెరుగుతున్నప్పుడు, ఆసుపత్రుల్లో కేసుల నమోదు ఎక్కువవుతున్న క్రమంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టడం విధి. కార్పొరేషన్ పరంగా నీటిసరఫరా విభాగం, ప్రజారోగ్యశాఖతో పాటు.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం.. ఇలా అన్నింటికి సంబంధించిన అధికారులకు భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుంది. ఆ దిశగా అడుగులు లేకపోవడంతో ప్రస్తుతం సమస్య ఏర్పడింది. ఒక్క నెల్లూరు నగరంలోనే అధికారికంగా 44వేల తాగునీటి కుళాయి కనెక్షన్లు ఉండగా.. ఇందులో సగానికి పైగా మురుగునీటికాల్వల్లోనే ఉంటున్నాయి. ఈ క్రమంలో ఆ పైపులైన్లు లీకై డ్రైనేజీ జలం తాగునీటిలో కలుస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్లెల్లోనూ సమస్య కనిపిస్తోన్న నేపథ్యంలో వాటర్‌ప్లాంట్లలో నీటి నాణ్యతపైనా సందేహాలు ఎక్కువవతున్నాయి. ఈ స్థితిలో జిల్లా ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment