Breaking News

01/01/2020

టీడీపీ నేతలకు రాయపాటి, జేసీలతో తలనోప్పి

విజయవాడ, జనవరి 1 (way2newstv.in )
ఒకపక్క రాయపాటి సాంబశివరావు.. మరోపక్క జేసీ దివాకర్ రెడ్డి.. సీబీఐ దాడులు ఒకవైపు.. ఆర్టీఏ సీజులు మరోవైపు.. ఇద్దరు టీడీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ నాది కాదు.. ఇప్పుడు నాకందులో ఏ బాధ్యతా లేదని మొత్తుకుంటున్నా సీబీఐ వినడం లేదు. ఆధారాలతో రాయపాటిని అతలాకుతలం చేస్తోంది. సోమ, మంగళవారం ఆకస్మిక దాడులతో రాయపాటిని, ఆయన కుటుంబీకులకు చెమటలు పట్టించింది సీబీఐ. మరోవైపు రెండు నెలల క్రితం సీజ్ అయిన బస్సులను ఎలాగోలా కోర్టు ఆదేశాలతో తిరిగి తెచ్చుకున్న జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ ఆర్టీఏ అధికారులు మంగళవారం మరోసారి షాకిచ్చారు. జేసీ బ్రదర్స్‌కు చెందిన ఆరు బస్సులను మళ్ళీ సీజ్ చేశారు. దేశం నేతలే టార్గెటా? లేక వారి వ్యాపారాల్లోనే లొసుగులున్నాయా? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జోరందుకుంది.
టీడీపీ నేతలకు రాయపాటి, జేసీలతో తలనోప్పి

బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు నగరాల్లోని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆఫీసులపై సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌ కావూరి హిల్స్‌లోని ట్రాన్స్‌ట్రాయ్ ఆఫీసుతోపాటు.. రాయపాటి కార్యాలయంలో తనిఖీలు ముందుగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత గుంటూరు, బెంగళూరులోనూ తనిఖీలు కొనసాగాయి. యూనియన్ బ్యాంకు కన్సార్షియంతోపాటు ఇండియన్‌ బ్యాంక్‌ ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు దాడులు నిర్వహించారు. ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి 300 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు రాయపాటి సాంబశివరావు. ఈ విషయంలో రాయపాటి బ్యాంక్‌ను మోసం చేశారంటూ రాయపాటిపై గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది.రాయపాటి సాంబశివరావు ఫౌండర్ ప్రమోటర్ చైర్మెన్‌గా వ్యవహరించిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ యూనియన్ బ్యాంకు లీడ్ బ్యాంకుగా వున్న బ్యాంకుల కన్సార్షియం నుంచి 2013లో తీసుకున్న 264 కోట్ల రూపాయల రుణం, దాని తాలూకు వడ్డీ మొత్తానికి సంబంధించి హైదరాబాద్ సీబీఐలో ఫిర్యాదు దాఖలైంది. దీని విచారణకు ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న చెరుకూరి శ్రీధర్ గానీ, అంతకు ముందు ఫౌండర్ ప్రమోటర్ ఛైర్మెన్‌గా వుండి ప్రస్తుతం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సాంబశివరావు గానీ సహకరించడం లేదని యూనియన్ బ్యాంకు సీబీఐకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించి హైదరాబాద్ కావూరి హిల్స్‌ కార్యాలయంతోపాటు బెంగళూరు, గుంటూరు నగరాల్లోని ట్రాన్స్‌ట్రాయ్ ఆఫీసులలో దాడులకు సీబీఐ అధికారులు శ్రీకారం చుట్టారు. గుంటూరులోని రాయపాటి నివాసంపైనా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. సేకరించిన సాధారణ సమాచారంతో ఎఫ్ఐఆర్ రూపొందించారు సీబీఐ అధికారులు.

No comments:

Post a Comment