Breaking News

28/12/2019

మాజీలు సైలెంట్ అయిపోయారు

నల్గొండ, డిసెంబర్ 28, (way2newstv.in)
గులాబి పార్టీ తొలి విడత ప్రభుత్వంలో చక్రం తిప్పిన పలువురు నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారనే చర్చ జనాల్లో మొదలైంది. కొంతమంది నేతలు తమ రాజకీయ ప్రాభవాన్ని కోల్పోవడం, మరికొంత మంది నేతలు రాజకీయంగా చురుగ్గా లేకపోవడంతో పార్టీలో ఎక్కడా వారి హడావుడి కనిపించడం లేదు. జిల్లా స్థాయిలో చక్రం తిప్పిన మరికొంత మంది నేతలు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు.తొలిసారిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా అనుభవం ఉన్న నేతలకు పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద పీట వేసింది. ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో నేతలున్నా... ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మార్పు కోసం పాత నేతలకు ప్రాధాన్యమిచ్చి పదవులు కట్టబెట్టారు. 
మాజీలు సైలెంట్ అయిపోయారు

తొలి విడతలో చక్రం తిప్పిన ఆ నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా? అనే అనుమానాలు వచ్చేలా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.ఉద్యమ సమయంలో పార్టీకి పెద్దగా పట్టు లేని ఖమ్మం జిల్లాలో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న తుమ్మల నాగేశ్వరరావు 2014లో ఓటమి చెందినా తన అనుభవంతో గులాబి పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. నాలుగేళ్లు ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారు. 2018 ఎన్నికల్లో మరోసారి ఓటమి చెందడం, పాలేరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే కారెక్కడంతో తుమ్మల రాజకీయ భవితవ్యం అయోమయంగా మారిందన్న టాక్ మొదలైంది.మరో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావ్ పరిస్థితి కూడా అలానే ఉంది. కొల్లాపూర్ నుంచి సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన 2018 ఎన్నికల్లో ఓటమి చెందడంతో రాజకీయంగా ప్రాధాన్యత తగ్గిపోయింది. సిటింగ్ ఎమ్మెల్యే గులాబీ గూటికి చేరడంతో జూపల్లి రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న చర్చలు జోరందుకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చందూలాల్, స్పీకర్ మధూసూదనాచారి కూడా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.తొలి విడతలో మంత్రి పదవులు దక్కించుకున్న పలువురు నేతలు... ఆ విడతలో పార్టీకి, ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయారన్న అభిప్రాయంతో సీఎం కేసీఆర్ వారికి రెండో విడతలో ప్రాధాన్యం ఇవ్వలేదంటన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందినా ప్రస్తుతం వారంతా తమ నియోజకవర్గాలకే పరిమితం కావాల్సి వస్తోందని జనాలు అనుకుంటున్నారు.

No comments:

Post a Comment