Breaking News

20/11/2019

కార్మికులపై కేసీఆర్ పైచేయి

హైద్రాబాద్, నవంబర్ 20, (way2newstv.in)
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైచేయి సాధించారనే చెప్పాలి. దాదాపు 46 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. సీరియస్ గా తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన సకలజనుల సమ్మె కంటే తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు ఎక్కువ రోజులు సమ్మె చేశారనే చెప్పాలి. అయితే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గకూడదని కేసీఆర్ తొలుతే నిర్ణయించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమైన దసరా, బతుకమ్మ పండగల సమయంలో అదను చూసి సమ్మెకు వెళ్లారని కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. యూనియన్ లీడర్ల బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తలొగ్గబోనని కూడా చెప్పారు. అయితే ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లోకి చేరాలంటే చేరవచ్చని ఆయన రెండుసార్లు పిలుపు నిచ్చారు. ఈనెల 5వ తేదీ డెడ్ లైన్ కూడా విధించారు.  
కార్మికులపై కేసీఆర్ పైచేయి

అయితే కేసీఆర్ పిలుపునకు ఆర్టీసీ కార్మికుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అతి తక్కువ మంది మాత్రమే చేరారు. దీంతో కేసీఆర్ ఈగో మరింత దెబ్బతిన్నట్లయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై యూనియన్ నేతలు వ్యక్తిగత దూషణలకు కూడా దిగడం ఆయన కోపం నషాళానికి అంటింది.హైకోర్టులో కేసు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు అయినా వెళ్లాలని ఒక దశలో కేసీఆర్ అధికారులతో జరిపిన సమీక్షలో నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలపై జోక్యం చేసుకోలేదని కూడా ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. అయితే అధికారులు కార్మిక సంఘాలతో జరిపన చర్చలు తూతూ మంత్రంగానే ముగిశాయి. ఆర్టీసీన ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని మరోసారి అధికారులు తేల్చి చెప్పడంతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. ఇక ఆర్టీసీ కార్మికులు విలీన అంశాన్ని పక్కన పెట్టామని ప్రకటించాల్సి వచ్చింది.హైకోర్టు కూడా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపని తాము ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి లేబర్ కోర్టు మాత్రమే సరైనదని అభిప్రాయపడింది. రెండు వారాల్లోగా సమ్మె పరిష్కారానికి కృషి చేయాలని హైకోర్టు కార్మిక న్యాయస్థానాన్ని ఆదేశించింది. కార్మికులు కూడా సమ్మెను విరమించి విధుల్లో చేరాలని కోరింది. దీనిపై కార్మిక సంఘాలు ఈరోజు నిర్ణయం తీసుకోనున్నాయి.అయితే కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలనుకున్న కేసీఆర్ అంగీకరించే ప్రసక్తి ఉండదంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం కార్మికులు విధుల్లో తిరిగి చేరాలంటే తమ షరతులకు అంగీకరించాలని ప్రభుత్వ కొర్రీ పెట్టే అవకాశముంది. షరతులకు అంగీకరించిన కార్మికులనే విధుల్లోకి చేర్చుకోవాలన్న ఉద్దేశ్యంలో ఉంది. అందులో ప్రధానమైనది భవిష్యత్తులో సమ్మెకు వెళ్లబోమని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత డిమాండ్లను పక్కన పెట్టి బేషరతుగా విధుల్లో చేరాల్సి ఉంటుంది. అలాగే సమ్మె కాలానికి జీతం చెల్లింపు కూడా ప్రభుత్వ పక్కన పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే సమ్మెలో పాల్గొన్న కార్మికులందరినీ వీఆర్ఎస్ వదలించుకోవాలన్న ఆప్షన్ కూడా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద 46 రోజుల ఆర్టీసీ సమ్మె విష‍యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పంతం నెగ్గించుకున్నట్లయింది. కార్మిక సంఘాలు ఈ విషయంలో ఓటమిని చవిచూశాయని చెప్పక తప్పదు. అయితే కేసీఆర్ కు ఇది తాత్కాలిక విజయమేనని, భవిష్యత్తులో ఆర్టీసీ సమ్మె ప్రభావం పార్టీపై చూపుతుందన్నది విశ్లేషకుల అంచనా.

No comments:

Post a Comment