Breaking News

20/11/2019

కలెక్టర్ కు చుట్టుకుంటున్న

ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ
కరీంనగర్, నవంబర్ 20, (way2newstv.in)
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఫోన్ సంభాషణ లీక్ కావడం, మంత్రి గంగుల కమలాకర్ ఫిర్యాదుతో ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి సమగ్ర సమాచారం సేకరిస్తుండడం మరోసారి చర్చనీయాంశమవుతోంది. వారిద్దరి మధ్య ఏం జరిగింది? వారి సంభాషణ సారాంశం ఏమిటి? అవి నిజంగా వారి గొంతులా? లేక ఫేకా అనే కోణంలో వారు దర్యాప్తు సాగిస్తున్నారు. దేశంలో మీరెక్కడున్నా మర్చిపోనని ఎంపీ సంజయ్ కలెక్టర్‌తో సాగిన ఫోన్ సంభాషణ రాజకీయంగా కలకలం రేపుతుండగా, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రి కమలాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కలెక్టర్‌తో సంజయ్ మొదట 1.30 నిమిషాలు, ఆ తరువాత 8 నిమిషాలు ఫోన్ సంభాషణలు బయటకొచ్చాయి. 
కలెక్టర్ కు చుట్టుకుంటున్న

కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సంజయ్ పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి కమలాకర్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఖర్చు చేశారని సంజయ్ కోర్టును ఆశ్రయించారు. ఇందుకు కలెక్టర్ సహకారం కోరిన ఫోన్ సంభాషణ లీకైంది. ఆ ఫోన్ సంభాషణ పరిశీలిస్తే అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి కలెక్టర్‌తో చర్చించినట్టుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో లోపాలు జరిగాయని, ఏ రౌండుకారౌండు సిస్టమ్‌లో ఎంటర్ చేయలేదని తన దృష్టికొచ్చిందని సంజయ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా నిబంధనల మేరకే జరిగిందని వెల్లడించారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించామని కలెక్టర్ చెప్పగా, థ్యాంక్యూ సార్, దేశంలో మీరెక్కడ ఉన్నా సరే మర్చిపోనంటూ సంజయ్ సంభాషణ సాగింది. మీ నెంబర్ నాకు మెస్సేజ్ చేయండని కలెక్టర్ సూచించగా తనకు వాట్సాప్ లేదని సంజయ్ బదులిచ్చారు. ఈ సంభాషణను మంత్రి కమలాకర్ సీరియస్‌గా తీసుకొని తనను ఓడించేందుకే కుట్ర పన్నారని, తాను ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మతోనే ఎమ్మెల్యేగా గెలిచానని, డిస్‌క్వాలిఫై చేయమని కలెక్టర్ సలహా ఇవ్వడమేంటని? మంత్రి మండిపడుతూ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఎంపీ సంజయ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఫోన్ సంభాషణ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ వివరణ కోరగా, సంజయ్‌తో తాను మాట్లాడింది నిజమేనని, కావాలనే మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి తమకు అనుకూలంగా మార్చిన సంభాషణే లీక్ చేశారని, రాజ్యాంగబద్ధంగానే తాను నడుచుకున్నానని కలెక్టర్ వివరణ ఇచ్చారు. అయితే ఎంపీ సంజయ్, కలెక్టర్ ఫోన్ సంభాషణ వ్యవహారం మంత్రి గంగుల కమలాకర్ బయటపెట్టడం, సీరియస్‌గా తీసుకొని సీఎంకు ఫిర్యాదు చేయడం ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడడం మళ్లీ చర్చకు దారితీసింది.

No comments:

Post a Comment