Breaking News

09/11/2019

రాజకీయాల్లో హీరోలు...జీరోలు (సండే స్పెషల్)

విజయవాడ, నవంబర్ 9  (way2newstv.in)
రాజ‌కీయాల్లో రోజులు ఒకేలా ఎప్పుడూ ఉండ‌వు. నాయ‌కుల‌కు ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉంటుంద‌నే ప‌రిస్థితి కూడా లేదు. ఎప్పుడు ఎవ‌రు హీరోలు అవుతారో. ఎవ‌రు జీరోల‌వుతారో చెప్పడం క‌ష్టం. కొంద‌రు ప‌ద‌వులు ఆశించి భంగ‌ప‌డుతుండ‌గా.. మ‌రికొంద‌రు టికెట్లు ఆశించి న‌ష్టపోయిన వారు ఇలా అనేక మంది ఉన్నారు. అయితే, వీరంతా కూడా ప్రజ‌ల్లో నిల‌బ‌డ‌క‌పోవ‌డం, ప్రజ‌ల నుంచి మ‌ద్దతు లేక‌పోవ‌డ‌మే వీరికి ప్రధాన స‌మ‌స్యగా మారింది. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌మ‌ులు స‌హ‌జ‌మే అయినా.. పాత త‌రం నేత‌ల మాదిరిగా ప్రజ‌ల్లో నిలదొక్కుకున్న వారి సంఖ్య నేటి త‌రం నేత‌ల్లో చాలా త‌క్కువ‌గా ఉండ‌డ‌మే ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం.తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత పార్టీల‌తో సంబంధం లేకుండా నాయ‌కుల ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. చాలా చిత్రమైన సంగ‌తులు గోచ‌రిస్తున్నాయి. 
రాజకీయాల్లో హీరోలు...జీరోలు (సండే స్పెషల్)

అప్పటి వ‌ర‌కు అంటే ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు హీరోలుగా చ‌లామ‌ణి అయిన‌వారు ఒకే ఒక్క ఓట‌మి లేదా సీటు ద‌క్కక పోవ‌డంతో ఏకంగా అడ్రసే గ‌ల్లంత‌య్యారు. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్న కూడా ప్రజ‌ల్లో వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. ప‌రిశీలిస్తే.. వీరికి ప్రజ‌ల్లో బ‌ల‌మైన పునాదులు లేక పోవ‌డం ఒక కార‌ణ‌మైతే.. వార‌స‌త్వంగా వ‌చ్చిన రాజ‌కీయాల‌ను కూడా ఇప్పుడున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మ‌లుచుకోక‌పోవ‌డం, ప్రజ‌ల్లో త‌మ‌పై న‌మ్మకం క‌ల్పించుకోలేక పోవ‌డం మ‌రో కార‌ణంగా క‌నిపిస్తోంది.ఈ జాబితాలో సీనియ‌ర్లు, జూనియ‌ర్లు, మాజీ మంత్రులు చాలా మందే ఉన్నారు. సిక్కోలు నుంచి అనంత‌పురం వ‌ర‌కు ఇలా ఎంద‌రో నాయ‌కులు ఇప్పుడు అడ్రస్ గ‌ల్లంతైన వారి జాబితాలో మ‌న‌కు క‌నిపిస్తున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన తోట న‌ర‌సింహం ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీడీపీలో ఉన్నారు. ఎంపీగా.. పార్టీ పార్లమెంట‌రీ ప‌క్ష నాయ‌కుడిగా చ‌క్రం తిప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న ఆరోగ్యం బాగాలేక పోవ‌డంతో భార్యను రంగంలోకి దింపి.. పెద్దాపురం టికెట్ కోసం టీడీపీతో ఘ‌ర్షణ ప‌డి వైసీపీలో చేరారు. భార్య వాణికి పెద్దాపురం టికెట్ ఇప్పించుకున్నా..ఫ‌లితం లేకుండా పోయింది. ఓట‌మితో ఈ భార్యా భ‌ర్తలు రాజ‌కీయాల‌కే దూర‌మ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనికి కార‌ణం.. బ‌ల‌మైన ఓటు బ్యాంకు వీరికి అండ‌గా లేక పోవ‌డం.పండుల ర‌వీంద్రబాబు. అమ‌లాపురం ఎస్సీయోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున 2014లో ఎంపీగా విజ‌యం సాధించిన ఐఆర్ ఎస్ మాజీ అధికారి. అయితే, ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారి.. టికెట్ కోసం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయ‌న‌కు టికెట్ ల‌భించ‌లేదు. దీంతో ఈయ‌న ప‌రిస్తితి కూడా తెర‌మ‌రుగైంది. ఈయ‌న‌కు ఎక్కడా ప్ర‌జ‌ల మ‌ద్దతు కానీ, ప్రజాపోరాటాల్లో పాల్గొన్న చ‌రిత్ర కానీ లేక పోవ‌డం మైన‌స్‌. మ‌రో నాయ‌కుడు, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు. జంప్ జిలానీగా అత్యంత త‌క్కువ స‌మ‌యంలో పేరు తెచ్చుకున్న ఈయ‌న కూడా ప్రజ‌ల్లో మ‌ద్దతు కూడ‌గ‌ట్టుకోలేక పోయారు. ఐఆర్ ఎస్ ఉద్యోగం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఈయ‌న టీడీపీలో చేరి ప్రత్తిపాడు నుంచి విజ‌యం సాధించి, త‌ర్వాత మంత్రి కూడా అయ్యారు. త‌ర్వాత టీడీపీకి వ్యతిరేకంగా చ క్రం తిప్పారు.ఈ క్రమంలోనే ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌లో చేరి విజ‌యం కోసం త‌పించారు. ఓట‌మి త‌ర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే,ప్రజ‌ల బ‌లం కూడ‌గ‌ట్ట‌డంలో విఫ‌ల‌మైన నేప‌థ్యంలో ఏ పార్టీలో ఉన్నా.. ఈయ‌న ప‌రిస్థితి సున్నాగానే ఉంది. ఇక‌, జేసీ త‌న‌యులు. అనంత‌పురంలో రాజకీయ కంచుకోట‌ను నిర్మించుకున్న జేసీ దివాక‌ర్‌, ప్రభాక‌ర్ త‌న‌యులు ప‌వ‌న్, అస్మిత్ రెడ్డి చాలా ఊహించుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పోటీ చేశారు. అయితే, ప్రజ‌ల్లో తండ్రుల‌కు ఉన్న హ‌వాను వీరు నిల‌బెట్టలేక పోయారు. వారిపై ప్రజ‌ల‌కు న‌మ్మకం క‌లిగించ‌లేక‌పోయారు. దీంతో ఓట‌మి పాల‌య్యారు.ప‌రిటాల శ్రీరాం. అనంత‌కే చెందిన కీల‌క ప‌రిటాల కుటుంబం నుంచి వ‌చ్చిన వార‌సుడిగా ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పాల‌ని అనుకున్నా.. ఎన్నిక‌ల్లో ప్రజ‌ల మ‌ద్దతును, న‌మ్మకాన్ని కూడ‌గ‌ట్టలేక పోయారు. అదేవిధంగా 2014లో పాయ‌కరావుపేట నుంచి విజ‌యం సాధించిన టీచ‌ర‌మ్మ వంగ‌ల‌పూడి అనిత‌.. ప్రజ‌ల‌పై క‌న్నా.. త‌న వ్యక్తిగ‌త విష‌యాల‌కే ప్రాధాన్యం ఇచ్చిన క్రమంలో ఆమె ఏకంగా రాజ‌కీయాల్లో చ‌క్రబంధం ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనే ప్రత్యర్థి ఎదుర్కొంటున్న నాయ‌కుల్లో ఈమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మొన్న ఎన్నిక‌ల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిన ఇప్పుడు అనిత మ‌ళ్లీ పాయ‌క‌రావుపేట కేంద్రంగా రాజ‌కీయం చేసేందుకు రెడీ అవుతున్నారు.గిడ్డి ఈశ్వరి. పాడేరు నుంచి 2014లో వైసీపీ టికెట్‌పై గెలిచిన సుదీర్ఘ రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన‌నాయ‌కురాలు. చ‌దువుల‌మ్మగా పేరు తెచ్చుకున్నా.. ప్రజ‌ల విశ్వాసాన్ని ఒకే ఒక్క వీక్‌నెస్‌(ప‌ద‌వి ఆశించి పార్టీ మారిపోవ‌డం)తో పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఎన్ని తంటాలు ప‌డుతున్నా ప్రయోజ‌నం క‌నిపించ‌డం లేదు. ఇక‌, కిడారి శ్రావ‌ణ్‌, మాజీ మంత్రిగా, న‌క్సల్స్ పొట్టన‌బెట్టుకున్న స‌ర్వేశ్వర‌రావు కుమారుడిగా ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కుతార‌ని అంద‌రూ అనుకున్నా.. ప్రజ‌ల నాడిని ప‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ఇలా అనేక మంది నాయ‌కులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. వారికి ఫ్యూచ‌ర్ ఏమిటి? పార్టీల‌ను న‌మ్ముకోవాలా? ప్రజ‌ల‌ను న‌మ్ముకోవాలా? ఏం చేయాలి? అనేది వీరిముందున్న మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నలు. మ‌రి చూడాలి ఏం చేస్తారో.

No comments:

Post a Comment