Breaking News

22/11/2019

మహారాష్ట్ర అనుకున్నంత వీజీ కాదు

ముంబై, నవంబర్ 22 (way2newstv.in)
మహారాష్ట్ర రాజకీయ ఉత్కంఠకు తెరపడే సూచనలు కన్పిస్తున్నాయి. గత నెల రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇంతకాలం శివసేనకు మద్దతు విషయంలో నానుస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అంగీకరించింది. శివసేనతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంగీకరించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీని కలసిన మరుక్షణమే సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.ఎన్సీపీ, కాంగ్రెస్ దీర్ఘకాల మిత్రులు. శరద్ పవార్ బీజేపీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం కాంగ్రెస్ నేతలను అయోమయంలోకి నెట్టింది. మహారాష్ట్రలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రెండు పార్టీల మైత్రి దెబ్బతినకూడదని సోనియాగాంధీ భావించారు. 
మహారాష్ట్ర అనుకున్నంత వీజీ కాదు

ఎన్సీపీని ఎలాగైనా ముగ్గులోకి లాగాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని గ్రహించిన సోనియా గాంధీ చివరకు శివసేనతో కలసి నడవాలని డిసైడ్ చేశారు. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి.అయితే ఎన్సీపీ మాత్రం తమకు రెండున్నరేళ్లు సీఎం పదవి కావాలని మరో కొర్రీ పెట్టింది. ఈ షరతుకు అంగీకరిస్తేనే మద్దతిస్తామని స్పష్టం చేసింది. తొలి రెండున్నరేళ్లు శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారు. చివరి రెండున్నరేళ్లు ఎన్సీపీ అభ్యర్థి ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తారు. కాంగ్రెస్ కు మాత్రం మంత్రి పదవులతో పాటు ఐదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి మూడు పార్టీలూ అంగీకరించాయి.ప్రభుత్వం ఐదేళ్ల పాటు సుస్థిరంగా కొనసాగాలంటే సమిష్టి నిర్ణయాలు అవసరమని మూడు పార్టీలూ అభిప్రాయపడ్డాయి. ముఖ్యమంత్రి ఏ పార్టీ అభ్యర్థి ఉన్నప్పటికీ కీలక నిర్ణయాల విషయంలో అగ్రనేతలతో సంప్రదించిన తర్వాతనే ప్రకటించాలని భావించాయి. అలాగే ఉమ్మడి ప్రణాళికను కూడా ఖచ్చితంగా అమలు చేయాలని, పార్టీల ప్రణాళికలను పక్కన పెట్టాలని నిశ్చయించాయి. ఈ మేరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య ఒప్పందం కుదరడంతో త్వరలోనే మహారాష్ట్రంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటయ్యేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. మరికొద్ది గంటల్లోనే మూడు పార్టీల నిర్ణయం వెలువడి గవర్నర్ ను కలిసే అవకాశాలున్నాయి.

No comments:

Post a Comment