Breaking News

22/11/2019

నార్త్ నుంచి సౌత్ కు కమలం అడుగులు

లక్నో, నవంబర్ 22 (way2newstv.in)
ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలోని అయోధ్య నగరానికి, భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అయోధ్యను బీజేపీని వేర్వేరు చేసి చూడలేం. ఒక్క మాటలో చెప్పాలంటే అయోధ్య లేనిదే బీజేపీ లేదు. బీజేపీ లేనిదే అయోధ్య లేదు. అయోధ్య పునాదులపైనే బీజేపీ నిర్మాణమయింది. ఆ పునాదులతోనే దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరించింది. వివిధ రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది. దక్షిణాదినా వేళ్లూనుకుంటోంది. ఆఖరికి ఢిల్లీ దర్బారునూ ఆక్రమించగలిగింది. స్వాతంత్ర్య సముపార్జన అంశాన్ని తన అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ కాలం నెట్టుకుంటూ వచ్చింది. కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వామపక్షాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఒకప్పటి జన్ సంఘ్ కు ప్రతిరూపంగా 1980లో ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు తగిన అంశం లేదు. ఆ సమయంలో వెలుగు చూసిన బాబ్రీమసీదు – రామజన్మభూమి వివాదం పార్టీకి ఆయాచితంగా కలసి వచ్చింది. 
నార్త్ నుంచి సౌత్ కు కమలం అడుగులు

నాలుగు దశాబ్దాలుగా ప్రజల దృష్టికి తీసుకువచ్చి లబ్దిపొందింది. ఇప్పడు న్యాయవ్యవస్థను ఆసరాగా వివాదానికి ముగింపు లభించింది. ఇది భారతీయ జనతా పార్టీకి సంపూర్ణంగా కలసి వచ్చే అంశం.1980కు ముందు జన్ సంఘ్ ప్రభావం రాజకీయాల్లో దాదాపు శూన్యం. ఉత్తరాదిన అదీ కొన్ని ప్రాంతాలకే…ముఖ్యంగా పట్టణాలు, నగరాలకే పరిమితమైంది. దేశ వ్యాప్తంగా ఉనికి చాటుకోవడం కష్టంగా ఉండేది. ఏదో నాలుగైదు ఎంపీ స్థానాలు, పదుల సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు, వందల సంఖ్యలో మున్సిపల్ వార్డులు జన్ సంఘ్ ఖాతాలో ఉండేవి. అంతే తప్ప దేశవ్యాప్తంగా ప్రభావం శూన్యం 1980 ఏప్రిల్ లో జగన్ సంఘ్ భారతీయ జనతా పార్టీగా రూపాంతం చెందాక కూడా పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉండేది. అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ, జస్వంత్ సింగ్, మురళీ మనోహర్ జోషి, డాక్టర్ విజయ్ కుమార్ మల్హాత్రా, అరుణ్ జైట్లీ వంటి ఉద్దండులు ఉన్నప్పటికీ వారికి గల ప్రజాదరణ అత్యంత పరిమితం. బీజేపీ ఆవిర్భవించిన నాలుగేళ్లకు 1984 నవంబర్, డిసెంబరులో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఉనికే కరువైంది. ఇందిరాగాంధీ హత్యతో ఏర్పడిన సానుభూతి పవనాల ధాటికి బీజేపీ చిగురుటాకులా వణికిపోయింది. నాటి ఎన్నికల్లో కేవలం రెండే రెండు స్థానాలను సాధించిన పార్టీ భవితవ్యం పై విస్తృత చర్చ జరిగింది. రెండు స్థానాల్లో ఒకటి ఉమ్మడి ఏపీలోని హన్మకొండ ఒకటి. అప్పటి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని హన్మకొండలో బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పీవీ నరసింహారావును ఓడించారు. గుజరాత్ లో మరోస్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. నాటి ఎన్నికల్లో వాజపేయి వంటి ఉద్దండుడు ఓడిపోయారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ స్థానం నుంచి పోటీ చేసిన వాజపేయిని కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు సింధియా ఓడించారు. అప్పట్లో బీజేపీ భవితవ్యంపై ఆందోళన, అయోమయం ఉండేది .అయోధ్య అంశం బీజేపీకి ఆయాచిత వరమైంది. బాబ్రీమసీదు – రామజన్మభూమి అంశం పార్టీకి ఒక ఆయుధంగా మారింది. ప్రజల్లోకి వెళ్లడానికి ఒక భావోద్వేగ అంశం దొరికింది. అనంతరం 1989 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఏకంగా 85 స్థానాలు సాధించి అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి సవాలే విసిరింది. భారత రాజకీయాల్లో బీజేపీ విస్మరించలేని కీలక శక్తిగా ఎదిగింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం చేపట్టాలన్న 1989 నాటి పాలంపూర్ తీర్మానం బీజేపీకి ఎన్నికల్లో బాగా లబ్ది చేకూర్చింది. వాస్తవానికి 1991 లోక్ సభ మధ్యంతర ఎన్నికల సమయంలో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ తమిళనాడులో హత్యకు గురికానట్లయితే అప్పట్లోనే బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. రాజీవ్ హత్యతో సానుభూతి పవనాలు బలంగా వీయడంతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. రాజీవ్ హత్య అనంతరం జూన్ 12, 15 తేదీల్లో జరిగిన ఎన్నికల్లో సానుభూతితో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను గెలుచుకుంది. లేకపోతే బీజేపీనే పెద్ద పార్టీగా నిలిచేది. 1996 లోక్ సభ ఎన్నికల్లో పెద్ద పార్టీగా బీజేపీ నిలిచినప్పటికీ దేవెగౌడ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా హస్తం పార్టీ బీజేపీని అడ్డుకోగలిగింది. 1998 మధ్యంతర ఎన్నికల్లో పెద్ద పార్టీగా నిలచి వాజపేయి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తగినంత బలం లేక దిగిపోయింది. 1999లో ఒక్క ఓటు తేడాతో గద్దె దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత మిత్రపక్షాలతో ఎన్డీఏగా ఏర్పడి 2004 వరకూ వాజపేయి ఆధ్వర్యంలో పాలన సాగింది. 2004లో బీజేపీ ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్, బీజేపీల మధ్య సీట్ల తేడా చాలా తక్కువే. 2009లోనే కాంగ్రెస్ ఒకింత ఆధిక్యాన్ని చాటుకుంది. ఇక 2014లో బీజేపీ దేశవ్యాప్తంగా విజయదుందుభి మోగించింది. 2019లో తన చరిత్రను తానే తిరగరాసుకుంది. అంటే 1989లోఅయోధ్య అంశాన్ని బీజేపీ ఎత్తుకున్నప్పటి నుంచి పార్టీ బల పడిందే తప్ప ఏనాడూ బలహీనపడలేదు. తాజాగా సుప్రీంకోర్టు ఆసరాగా చేసుకుని దక్షిణాదిన పార్టీ దూకుడును ప్రదర్శించనుంది.

No comments:

Post a Comment