Breaking News

05/10/2019

పశ్చిమ బెంగాల్ లో ఎన్ ఆర్ సీ ప్రకంపనలు

కోల్ కత్తా, అక్టోబరు 5, (way2newstv.in)
పశ్చిమ బెంగాల్ లో జాతీయ పౌర పట్టిక అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. పొరుగున ఉన్న అసోంలో ఎన్.ఆర్.సి తదనంతర పరిణామాలు ఈ తూర్పు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఎన్.ఆర్.సి నిర్వహిస్తామన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసోం తరువాత బెంగాల్ లోనే ఎన్.ఆర్.సి ఉంటుందనే సంకేతాలు కేంద్రం నుంచి వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, హర్యానా సీఎం మనోహర్ లాల్ తమ రాష్ట్రాల్లో ఎన్.ఆర్.సి నిర్వహణకు సుముఖమని ప్రకటించారు.ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏమవుతుందోనన్న భయం బెంగాల్ ప్రజలను వెంటాడుతోంది. 
పశ్చిమ బెంగాల్ లో ఎన్ ఆర్ సీ ప్రకంపనలు

వివిధ రకాల ధృవపత్రాలు, అనుమతి పత్రాల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బారులు తీరుతున్నారు. రాష్ట్రంలో ఎన్.ఆర్.సి నిర్వహించే ప్రసక్తే లేదని ఒకపక్క మమతా బెనర్జీ ప్రకటించినప్పటికీ ప్రజలు దానిని విశ్వసించడం లేదు. ధృవపత్రాలు లభించలేదన్న కారణాలతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నారు. సమస్య తీవ్రతకు ఈ ఘటన దర్పణం పడుతోంది. ఎన్.ఆర్.సి అంశం వేల కుటుంబాల్లో కలకలం రేపుతోంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పొరుగున ఉన్న అసోంలో ఎన్.ఆర్.సి ప్రతి జాబితాలో హిందువుల పేర్లు కూడా పెద్ద సంఖ్యలో గల్లంతు అయ్యాయని వార్తలు గందరగోళం సృష్టిస్తోందిహిందువుల పరిస్థితే ఇలా ఉంటే తమ గతేందని ముస్లిం, క్రిస్టియన్ ఇతర మైనారిటీ వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. నివాస ధృవపత్రాలు, అనుమతి పత్రాలు, గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఓటరు కార్డుతో పాటు డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాహనాల రిజిస్ట్రేషన్లు, సొంత ఇంటి పత్రాలను తాజాగా పొందేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తీరా ఎన్.ఆర్.సి ప్రకటించాక అప్పటికప్పుడు హడావుడి పడే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మేలన్న ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. జనన ధృవపత్రాల కోసం ఇంత పెద్ద క్యూలతో ప్రజలు తమ కార్యాలయాల ముందు బారులు తీరడం గతంలో ఎన్నడూ చూడలేదు. కోల్ కత్తా నగర పాలక సంస్థ కార్యాలయాల్లోని వైద్యవిభాగం ఉద్యోగి సుభ్రతా బెనర్జీ పేర్కొనడం గమనార్హం.రోజు వంద జనన దృవీకరణ పత్రాలు మాత్రమే ఇవ్వగలమని, కానీ గత మూడు రోజులుగా రోజుకు 250 పత్రాలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. మధ్యవయస్కులు, వృద్ధులు కూడా వివిధ రకాల గుర్తింపు కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. ధృవీకరణ పత్రం లేకపోతే ఎక్కడ విదేశీయుడు అనే ముద్ర వేస్తారోనన్న భయంతో ప్రజలు పత్రాల కోసం ధరఖాస్తు చేసుకుంటున్నారు. ఇన్నేళ్ల తర్వాత పత్రాలు, డాక్యుమెంట్లు అడుగుతున్నారు. ఇప్పుడు వాటిని నేను ఎక్కడి నుంచి తేగలను ? అవి దెబ్బతిని ఉండవచ్చు. ప్రకృతి వైపరీత్యాల్లో కొట్టుకుపోయి ఉండవచ్చు. కనుమరుగై ఉండవచ్చన్న ముఖ్యమంత్రి మమత వ్యాఖ్యలను తోసిపుచ్చలేం. ఒక్క మున్సిపల్ కార్యాలయాల వద్ద రద్దీ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతి, బ్లాక్, మున్సిపల్, నగర పాలక సంస్థల కార్యాలయాల వద్ద జనన ధృవీకరణ పత్రాలకోసం క్యూ కడుతున్నారు. జనన ధ్రృవీకరణ పత్రాల తప్పనిసరి అంటున్నందున కోల్ కత్తా నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారని 75ఏళ్ల అజిత్ రామ్ తెలిపారు.బెంగాల్ పై కేంద్రం దృష్టిసారించడానికి కారణాలు లేకపోలేదు. అసోం తర్వాత ఎక్కువగా అక్రమ వలసలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. అసోం కు బంగ్లాదేశ్ నుంచి వలసలు నిత్యం వస్తాయి. అదే విధంగా బెంగాల్ ను సరిహద్దున ఉన్న బంగ్లాదేశ్ నుంచి కూడా వలసలు సాగుతుంటాయి. వరుసగా ఎంతో మంది పేద ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి సరిహద్దుల్లో కళ్లు గప్పి బతుకుదెరువు కోసం వస్తుంటారు. ఇక్కడ కూలీనాలి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. అక్రమ వలస దారుల్లో ముస్లింలు ఎక్కువ. బంగ్లా నుంచి హిందువుల కూడా వలస వస్తున్నప్పటికీ వారి సంఖ్య తక్కువే. బంగ్లా నుంచి బతుకుదెరువుకోసం ముస్లింలు అక్రమంగా వలస వస్తుండగా బంగ్లా వేధింపులు, వివక్ష తట్టుకోలేక హిందువులు వలస వస్తున్నారు. బంగ్లాదేశ్ పేద దేశం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బెంగాల్ కు అక్రమ వలసలు ఈనాటి సమస్య కాదు. దశాబ్దాల తరబడి కొనసాగింది .తొలుత రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా వలసల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించాయి. ఆ తరువాత వచ్చిన సీపీఎం సర్కార్లు సైతం ఇదే ధోరణిని అనుసరించాయి. ఇప్పుడు మమత సర్కారుదీ అదేబాట. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో రైల్వే మంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖలు నిర్వహించిన అబ్ధుల్ ఖాన్ ఘనీ చౌదరి నియోజకవర్గం మాల్దా బంగ్లా సరిహద్దుల్లో ఉంటుంది. ఎప్పుడూ వలసదారుల ఓట్లతోనే ఆయన గెలిచేవారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో 18 స్థానాలు సాధించిన బీజేపీ ఇదే అదనంగా మమతను రాజకీయంగా దెబ్బతీయడానికి ఎన్.ఆర్.సి అస్త్రాన్ని వాడుకుంటోంది. ఎన్.ఆర్.సి వల్ల ఎక్కువ మంది ముస్లింల ఓట్లు తొలగుతాయని, హిందువులు ఏకీకృతం అవుతారని తర్వారా వచ్చే 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారం సాధించవచ్చన్నది కమలం ఆలోచన. ఓటు బ్యాంక్ రాజకీయాల ద్వారా అధికారం చేపట్టవచ్చన్న కమలం ఆలోచన ప్రమాదకరం. ప్రజల విశ్వాశాన్ని పొందాలే తప్ప ప్రజల్లో చీలికల ద్వారా లబ్ధి పొందాలన్న ఆలోచన ఎంత మాత్రం సరికాదు.

No comments:

Post a Comment