Breaking News

16/10/2019

లాల్ త్రయం లేకుండా మొదటి ఎన్నికలు

ఛండీఘడ్, అక్టోబరు 16 (way2newstv.in)
శరాజధాని నగరం ఢిల్లీని ఆనుకుని ఉండే చిన్న రాష్ట్రం హర్యానా. పేరుకు చిన్న రాష్ట్రమైనప్పటికీ ఇక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. హర్యానా పేరు చెప్పగానే బన్సీలాల్, భజన్ లాల్, దేవీ లాల్ గుర్తుకు వస్తారు. వీరికి ‘లాల్ త్రయం’ అన్న పేరుంది. వీరి ప్రస్థానం లేకుండా రాష్ట రాజకీయాలను చర్చించడం అసాధ్యం. ముగ్గురు నాయకులు రాష్ట్రానికి సీఎంలుగా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాలను తమ కనుసైగలతో శాసించారు. మూడు సార్లు సీఎంలుగా పనిచేసిన బన్సీలాల్ ఏడో దశకంలో కీలకమైన కేంద్ర రక్షణ మంత్రిగా , తరువాత రైల్వేమంత్రిగా వ్యవహరించారు. 
లాల్ త్రయం లేకుండా మొదటి ఎన్నికలు

రాత్రికి రాత్రి ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఘనత భజన్ లాల్ ది. ఆయనా మూడు సార్లు సీఎంగా చక్రం తిప్పారు. ‘తావూ’ (పెదన్నాన) గా పేరు గాంచిన దేవీలాల్ రెండుసార్లు సీఎంగా, 1989లో జనతాదళ్ సర్కారులో ఉప ప్రధానిగా పనిచేశారు. ఈ ముగ్గురు దిగ్గజాల వారసులు ప్రస్తుతం కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ ( ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ) లో ఉన్నారు. హర్యానా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కురుక్షేత్ర. నూరు పాండవుల యుద్ధం జరిగింది ఇక్కడే. ప్రస్తుతం ఇది లోక్ సభ స్థానం.ఇక రాష్ట్ర రాజకీయాలకు వస్తే 90 స్థానాలు గల అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగుతోంది. అధికార బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ ( ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ) మధ్య పోరు నెలకొంది. అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ లాల్ ఖట్టర్ సారథ్యంలో కమలం పార్టీ ఎన్నికల గోదాలోకి దిగింది. మంత్రులు సహా 12 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్ ను నిరాకరించడంతో కొంత అసమ్మతి వ్యక్తమవుతోంది. 47 స్థానాల బోటా బోటి మెజార్టీతో 2014లో గెలుపొందిన బీజేపీ ఆ తరువాత తన పరిస్థితిని మెరుగు పరుచుకుంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో మొత్తం పది స్థానాలు గెలుచుకున్న కాషాయశ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగారు. విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో సంపన్న జాట్ సామాజిక వర్గానిదే రాజకీయ ఆధిపత్యం. కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ ( ఇండియన్ నేషనల్ లోక్ దల్ ) అధికారంలో ఉన్నప్పటికీ వారిదే పెత్తనం. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఈ సామాజిక సమీకరణను పక్కన పెట్టింది. వెనుకబడిన వర్గానికి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్ ను ముందుగా తీసుకువచ్చింది. బ్రహ్మచారి అయిన ఆయన గత అయిదేళ్ల పాలనలో నిలదొక్కుకున్నారు. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు షా మద్దతు పుష్కలంగా ఉంది. మొత్తం 75 స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో పార్టీ ముందుకు వెళుతోంది. ఇందుకోసం మిషన్ 75 అనే పథకానికి రూపకల్పన చేశారు. 27శాతం జనాభాగల జాట్ లకు బదులు జాటేతర వర్గాల మద్దతుతో గెలవ వచ్చన్నది బీజేపీ వ్యూహం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 47స్థానాలు, 33.2 శాతం ఓట్ల సాధించింది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో 33.2 శాతం ఓట్లు, పదికి పది స్థానాలు గెలిచి తన సత్తా తగ్గలేదని చాటింది.ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న ఐఎన్ఎల్డీ  ఇప్పుడు అచేతనంగా ఉంది. అంతర్గత కలహాలతో సతమత మవుతోంది. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని గెలుపొందలేదు. మాజీ సీఎం, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ స్థాపించిన పార్టీ ఇది. ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతలా ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో జైలుపాలయ్యారు. ఇటీవలే పెరోల్ పై బయటకు వచ్చి ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆ ఓట్లపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. చౌతలా కుమారుల్లో ఒకరైన అజయ్ చౌతలా, ఆయన కుమారుడు దుష్యత్ చౌతలా జన్ నాయక్ జనతా పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. పార్టీ ఇప్పటికి 35 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. పార్టీ అగ్రనేత దుష్యంత్ చౌతలా, ఆయన తల్లి నైనా చౌతలా బరిలోకి దిగారు. అంతర్గత కలహాల నేపథ్యంలో అటు ఐఎన్ఎల్డీ ( ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ) ఇటు జన్ నాయక్ జనతా పార్టీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని ఏలిన హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. రెండుసార్లు సీఎంగా పనిచేసిన భూపిందర్ సింగ్ హుడా హవా ప్రస్తుతం పార్టీలో నడుస్తోంది. ఆయన శక్తి వంతమైన జాట్ మైనార్టీ, వెనుకబడిన వర్గాల మద్దతుతో ముందుకు సాగుతున్నారు. హుడాపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ పార్టీ ఆయనకే పగ్గాలు అప్పజెప్పింది. ఎన్నికల ప్రకటనకు కొద్దిరోజుల ముందు పీసీసీ చీఫ్ అశోక్ తన్వర్ ను పార్టీ ఆ పదవి నుంచి తప్పించింది. ఈయన దళితనేత. తరువాత అదే సామాజిక వర్గానికి చెందిన కుమారి సెల్జాకు ఆ బాధ్యతలను అప్పజెప్పింది. ఆమె గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆమె నియామకం వెనుక హుడా హస్తం ఉంది. దీంతో పార్టీ టిక్కెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ అశోక్ తన్వర్ ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. తన్వర్ కు రాహుల్ గాంధీ అనుచరుడన్న పేరుంది. మొత్తానికి పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా భూపిందర్ సింగ్ హుడా చక్రం తిప్పాతున్నారు.అంతర్గత కలహాల నేపథ్యంలో ఎన్నికలను ఎంత సమర్థంగా ఎదుర్కొగలరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయినప్పటికి పానిపత్ , సోనే పత్ , రోహతక్ జాట్ సామాజిక ప్రాబల్య ప్రాంతాల్లో హుడాకు మంచి పట్టుందని, దీంతో ఎన్నికల గోదాను ఈద వచ్చని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో హుడా సోన్ పత్ నుంచి, ఆయన కుమారుడు దీపేంద్ర రోహతక్ నుంచి ఒడిపోవడం గమనార్హం. పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది. మొత్తానికి మూడు ప్రధాన పార్టీల్లో అసమ్మతి, అంతర్గత కలహాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. రైతు సమస్యలు, నిరుద్యోగం, ఉద్యోగుల్లో అసంతృప్తిని విపక్షాలు ఎన్నికల ప్రచారాంశాలుగా వాడుకుంటున్నాయి. 370 అధికరణ రద్దు, ఎన్ఆర్సీ, పాలనలో పార దర్శకత, అవినీతి నిర్మూలన, ప్రతిభ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు, తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని కమల నాధులు విశ్వాసంలో ఉన్నారు.

No comments:

Post a Comment