Breaking News

11/10/2019

ఇది కార్పొరేట్ స్టైల్ (తూర్పుగోదావరి)

కాకినాడ, అక్టోబర్ 11  (way2newstv.in):
జిల్లాలో సీఎస్‌ఆర్‌ నిధుల వ్యవహారం గందరగోళంగా ఉంది. రూ.వెయ్యి కోట్ల వార్షిక ఆదాయం గానీ.. రూ. 5 కోట్ల వార్షిక లాభం ఉన్న ప్రతి కంపెనీ విధిగా లాభాల్లో 2 శాతం సొమ్ము సీఎస్‌ఆర్‌ కింద కేటాయించాలి. ఇన్నాళ్లూ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో ఈ నిబంధన సక్రమంగా అమలు కావడం లేదు. సీఎస్‌ఆర్‌ బాధ్యతను విస్మరిస్తున్న కంపెనీలను ప్రశ్నించే పరిస్థితీ లేకపోవడం సమస్యగా మారింది. సమాజాభివృద్ధి దిశగా ప్రజలను చైతన్యపరచడంతో పాటు.. కంపెనీలు సమాజానికి చేయాల్సిన మేలుపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం చట్టాన్ని తెరమీదకు తెచ్చింది. కార్పొరేట్‌ సామాజిక బాద్యత (సీఎస్‌ఆర్‌) బిల్లుకు 2013లో ఆమోద ముద్ర వేసిన కేంద్రం 2014 ఏప్రిల్‌ 1 నుంచి చట్టం రూపంలో అమల్లోకి తెచ్చింది. కొత్త చట్టాన్ని పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో కీలకంగా ఉన్న జిల్లాలోనూ ఈ బాధ్యత సమర్థంగా నెరవేర్చని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం సీఎస్‌ఆర్‌ పరిధిలోకి వచ్చిన కంపెనీలు జిల్లాలో ఎన్ని ఉన్నాయి..? 
ఇది కార్పొరేట్ స్టైల్ (తూర్పుగోదావరి)

వాటి నుంచి ఏటా రావాల్సిన రెండు శాతం నిధుల మొత్తం ఎంత..? అన్న అంశంపై జిల్లా యంత్రాంగానికే స్పష్టత లేని పరిస్థితి. లాభాల్లో 2 శాతం సామాజిక అభివృద్ధికి విధిగా వెచ్చించాలి.. ఎక్కడ ఎంత మొత్తంలో ఖర్చుచేశారో ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంది. ఈ ప్రక్రియ సవ్యంగా సాగడం లేదు. జిల్లా ఉన్నతాధికారులకు తెలియకుండానే క్షేత్రస్థాయిలో స్థానిక ఒత్తిళ్లకు తలొగ్గి కొన్ని సంస్థలు నిధులు వెచ్చిస్తుండడం గమనార్హం. కంపెనీల చట్టం 2013, కంపెనీల కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌ నియమాలు)-2014 సెక్షన్‌ 135కు అనుగుణంగా సీఎస్‌ఆర్‌ విధానాన్ని అమలుచేయాల్సి ఉంది. జిల్లాలో ప్రధాన కంపెనీలు ఇచ్చిందే మహాప్రసాదంలా వ్యవహారం మారడంతో సామాజిక బాధ్యత ఆశించిన రీతిలో ముందుకు సాగడంలేదు. సహజ వనరులు చౌకగా పొందుతున్న కంపెనీలు ఈ బాధ్యతను సమర్థంగా నెరవేర్చడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.జిల్లాలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యతను ప్రధాన కంపెనీలు మినహా మిగిలినవి చేపట్టడంలేదన్నది అధికారుల దగ్గరున్న సమాచారం. ఇటీవల ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 15 కంపెనీల వరకు ప్రతినిధులు హాజరయ్యారు. 2014-15 నుంచి రెండు శాతం చొప్పున ఎంత నిధులు కేటాయించాలి..? ఎంత కేటాయించారు..? అందులో ఖర్చుచేసింది ఎంత..? అనే అంశంపై చర్చ సాగింది. జిల్లాలోని పలు గ్రామాలను మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. వైద్యశాలలు, ప్రభుత్వ వసతిగృహాలు, విద్యాలయాల్లో వసతుల లేమి తారసపడుతోంది. వీటన్నింటినీ అధిగమించడానికి ఉపాధి నిధులు, జిల్లా అభివృద్ధికి కేటాయించిన నిధులను కలెక్టర్‌ వెచ్చిస్తున్నారు. సీఎస్‌ఆర్‌ నిధుల ఊతం అందితే కొంత వరకు సమస్యలు అధిగమించవచ్చన్నది అధికారుల భావన. సీఎస్‌ఆర్‌ నిధులతో గ్రామీణాభివృద్ధితోపాటు రహదారులు, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, సురక్షిత తాగునీరు అందించడం, జోవనోపాధి మెరుగుదల ప్రాజెక్టులు, వృత్తి నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధి, వసతిగృహాలు, పాఠశాలలు ఇతరత్రా అభివృద్ధి చేసే వీలుంది. జిల్లాలో ప్రైవేటు కంపెనీల సహకారం అంతంతమాత్రంగా ఉండడంతో ఇది సాధ్యపడడం లేదు. కొన్ని సంస్థలు స్థానిక ఒత్తిళ్ల మేరకు అధికారులతో ప్రమేయం లేకుండానే నిధులు వెచ్చిస్తున్నాయి. అందుకు సంబంధించిన చిత్రాలు విడుదల చేస్తూ లక్ష్యాలు చేరుతున్నట్లు చూపుతున్నాయి. మరికొన్నిచోట్ల స్థానిక అవసరాలను విస్మరించి భూగర్భ విద్యుత్తు తీగలు, విద్యుత్తు సౌకర్యాల పేరుతో పనులకు ముందుకెళ్లే పరిస్థితీ ఉంది. వీటిపై అధికారుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది.స్థానిక ప్రజాప్రతినిధులతో, అధికారులతో చర్చించి స్థానిక ప్రాథమిక అవసరాలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి సీఎస్‌ఆర్‌ నిధులు వెచ్చించడం ఉత్తమమే వాదన వినిపిస్తోంది.జిల్లాలో సీఎస్‌ఆర్‌ నిధుల విడుదలకు కొన్ని సంస్థలే ముందుకొస్తున్నాయి. ఆయా సంస్థలు సైతం అరకొరగా నిధులు కేటాయించడం.. మిగిలిన సంస్థలు ఆ దిశగానే చొరవ చూపకపోవడంతో ఆశించిన ఫలాలు దక్కడం లేదు. జిల్లాలో 2016-17, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఇస్తామని అంగీకరించిన సొమ్మూ కొన్నిసంస్థలు ఇవ్వలేదు. ఇలా రూ.10 కోట్లపైగా బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.జిల్లాలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, రాజమహేంద్రవరం, కాకినాడలలోని ఓఎన్‌జీసీ సంస్థలు, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, గెయిల్‌, వేదాంత లిమిటెడ్‌ సంస్థలు మాత్రమే కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద కొంతమేర నిధులు వెచ్చిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాధ్యత నిర్వహించాల్సిన కంపెనీలు పదుల సంఖ్యలోనే ఉన్నా వీటి సమాచారం కూడా యంత్రాంగం దగ్గర లేకపోవడం గమనార్హం.

No comments:

Post a Comment