Breaking News

21/08/2019

కమలం గూటికి దేవేందర్ గౌడ్

హైద్రాబాద్, ఆగస్టు 21 (way2newstv.in - Swamy Naidu
ఆంధ్రపదేశ్‌లో అధికారం కోల్పోయి, తీవ్రంగా దెబ్బతిన్న టీడీపీకి తెలంగాణలో కూడా వరుస షాక్‌లు తగులుతున్నాయి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన టీడీపీ మాజీ మంత్రులందరూ ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరి పదవులు అనుభవిస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్రంలో టీడీపీని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే తెలుగుదేశానికి చెందిన ముఖ్య నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కూడా బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ గత సోమవారం బంజారాహిల్స్‌లోని దేవేందర్ గౌడ్‌ నివాసంలో ఆయణ్ని కలిసి గంట సేపు చర్చించారు. 
కమలం గూటికి దేవేందర్ గౌడ్
అనంతరం దేవేందర్ గౌడ్ కూడా బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయనతోపాటు కుమారుడు వీరేందర్ కూడా బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.  దేవేందర్ గౌడ్ మంగళవారమే ఢిల్లీకి వెళ్లారు. పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి, బుధవారం లేదా గురువారం పార్టీ కండువా కప్పుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు హామీ లభించిన వెంటనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకులతోపాటు మరికొంత మంది బీసీ నాయకులు కూడా కమలం గూటికి చేరుతారని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవేందర్ గౌడ్ టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేదంటూ 2008లో పార్టీకి రాజీనామా చేసి, నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మళ్లీ టీడీపీలో చేరి, ఇటీవల కాలం వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా టీడీపీలో క్రియా శీలకంగా వ్యవహరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరెందర్ గౌడ్ ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, టీఆర్ఎస్ అభ్యర్థి బేతి సుభాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆపరేషన్ కమల్ పేరుతో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ, వరుస చేరికలతో ఊపు మీదున్న బీజేపీ దేవేందర్ గౌడ్ చేరికతో తెలంగాణలో మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ముఖ్య నేతలందరికి కాషాయ కండువా కప్పిన బీజేపీ, టీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలపై కూడా కన్నేసింది. 

No comments:

Post a Comment