Breaking News

27/08/2019

నైపుణ్యానికి పదును (తూర్పుగోదావరి)

కాకినాడ, ఆగస్టు 27 (way2newstv.in): 
జిల్లాలోని తీర ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉపాధి కల్పన దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాగరమాల ప్రాజెక్టుతో తీర ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ అభివృద్ధితో పాటు ఆయా ప్రాంతాల్లోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ మెరుగుపడనున్నాయి. దేశంలోని తొమ్మిది తీర ప్రాంత రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలను ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆయా తీరప్రాంతాల యువతకు సంబంధిత విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు. రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చోటు దక్కడంతో ఆ దిశగా చర్యలు ఊపందుకుంటున్నాయి. 
నైపుణ్యానికి పదును (తూర్పుగోదావరి)

ఇప్పటికే  విశాఖ కేంద్రంగా గాజువాకలో యువతకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.  త్వరలో జిల్లాలోనూ ఈ దిశగా అవగాహన కల్పించే చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో కాకినాడ పోర్టు, డీప్‌ వాటర్‌ పోర్టు, యాంకరేజ్‌ పోర్టులు ఇప్పటికే అందుబాటులో ఉండగా..సెజ్‌ పోర్టుకూ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సాగరమాల ప్రాజెక్టు కింద పోర్టులు, కారిడార్లను జాతీయ రహదారికి అనుసంధానం చేయడంతో పాటు రోడ్డు, రైలు మార్గాలు, అంతర్గత జల రవాణాను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రూ.1,30,762 కోట్లతో 90 ప్రాజెక్టులకు సాగరమాల కింద అభివృద్ధికి ప్రతిపాదనలు పంపారు. భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా దేశ వ్యాప్తంగా పోర్టుల ఆధునికీకరణ, పోర్టుల మధ్య అనుసంధానం పెంచడం, కోస్టల్‌ ఎకనమిక్‌ జోన్ల ఏర్పాటు దీని ప్రధాన లక్ష్యం.సాగరమాల ప్రాజెక్టు అమలు క్రమంలో జరిగే అభివృద్ధిలో భాగంగా సంబంధిత విభాగాలకు నిపుణులైన సిబ్బంది అవసరం. ఇందుకోసం స్థానిక తీర ప్రాంత యువతకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌసల్‌ యోజన అమలు బాధ్యతలను సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌, ఎంటర్‌ప్రైజ్‌ డెవలప్‌మెంటు ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ (సీడాప్‌) పర్యవేక్షిస్తోంది. సాగరమాలతో డీడీయూజీకేవై తాజా ఒప్పందం నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా చర్యలకు సీడాప్‌ రంగంలోకి దిగింది. తీర ప్రాంత నిరుద్యోగులకు సోలార్‌, లాజిస్టిక్‌, హెవీ డ్రైవింగ్‌, హైడ్రో కార్బన్‌, పోర్ట్‌ మెనేజ్‌మెంట్‌ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తారు. దీని ద్వారా నైపుణ్యం అందిపుచ్చుకుంటే దేశ, విదేశాల్లో మంచి వేతనాలతో కూడిన ఉపాధి కల్పన సాధ్యమవుతుందని చెబుతున్నారు. గతంలో తెదేపా ప్రభుత్వం కాకినాడలో మారిటైమ్‌ కళాశాల, సముద్ర అధ్యయనంతో కూడిన మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. వీటి ఏర్పాటు ద్వారా జిల్లాలోని సుదీర్ఘ తీర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పాటు పర్యాటక అభివృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయని భావించింది. తాజాగా ఉపాధి చర్యలతో పాటు వీటిపైనా దృష్టిసారిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుంది. వాస్తవంగా కోస్టల్ కారిడార్ ప్రాజెక్టు 2015 నుంచి 2020 నాటికి పూర్తికావల్సి ఉంది. ఈ మూడేళ్ల వ్యవధిలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపికైన జిల్లాల్లో ఏడాదికి 500 మందికి చొప్పున 1500 మందికి ఆయా నైపుణ్యాల దిశగా చర్యలు చేపట్టి ఉపాధి కల్పించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పనుల ద్వారా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దక్కనుంది. ఒప్పందంలో భాగంగా డీడీయూజీకేవై- సాగరమాల పథకం ద్వారా తీర ప్రాంత నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలను తాజాగా ప్రారంభించారు. సీడాప్‌ రాష్ట్ర సీఈవో మహేశ్వరరెడ్డి త్వరలో జిల్లాలో పర్యటించి తీర ప్రాంత యువత నైపుణ్య- ఉపాధి అవకాశాలపై సమీక్షించనున్నారు. జిల్లాలో శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో సీడాప్‌ పర్యవేక్షణలో నడుస్తున్న జేడీఎం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment