Breaking News

27/08/2019

అతిగా వాడితే అనర్ధాలే..(కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, ఆగస్టు 27 (way2newstv.in): 
మోతాదుకు మించి వినియోగిస్తున్న ఎరువులు, హానికారక రసాయనాలతో నేలలు విషమయం అవుతున్నాయి. పంటలను పట్టిపీడించే పురుగులు, చీడపీడల కోసం వాడుతున్న రసాయనాలు మరిన్ని కొత్త చీడపీడలకు కారణమవుతున్నాయి. అంతు చిక్కని వింత తెగుళ్లు పంటలను ఆశిస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు పిచికారీ చేస్తున్న క్రిమిసంహారక మందులు పనిచేయకపోవడంతో అధిక మోతాదు కలిగిన రసాయనాలను చల్లుతున్నారు. మితిమీరిన ఎరువులు, పురుగు మందుల ప్రభావంతో భూసారం దెబ్బతింటోంది. సహాజసిద్ధ నేలలు సారాన్ని కోల్పోయి నిస్సారంగా మారుతున్నాయి. సారవంత నేలలు రసాయనాల ప్రభావంతో జీవం కోల్పోయి చౌడుబారుతున్నాయి. 
అతిగా వాడితే అనర్ధాలే..(కృష్ణాజిల్లా)

ఒకపక్క పర్యావరణవేత్తలు, శ్రాస్తవేత్తలు జీవవైవిధ్యం అంటూ గగ్గోలు పెడుతున్నా రైతులు మాత్రం మితిమీరిన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించడం లేదు. ఇప్పటికైనా మార్పు రాకుంటే పంటల మనుగడతోపాటు భూసారం ప్రశ్నార్థకంగా మారిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.జిల్లాలో 2.34 లక్షల హెక్టార్లలో వరిసాగు అవుతుంది. డెల్టా ప్రాంతంలో వెదజల్లే పద్ధతిలో ఇప్పటికే అన్ని గ్రామాల్లో సాగు మొదలయ్యింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం నారుమళ్లు వేసి ఊడ్పులకు సిద్ధమవుతున్నారు. మొక్కలకు అవసరమైన అన్ని పోషకాలను భూమి సహజంగానే అందిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అన్ని పంటలకు ఒకే మోతాదులో ఎరువులు చల్లాలన్న నియమేమీ లేదు. అవసరానికి మించి వేస్తే ఖర్చు తప్ప మొక్కకు ప్రయోజనమేమీ ఉండదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఎకరాకు రెండు బస్తాల యూరియా, బస్తా పొటాష్‌, వాడితే సరిపోతుంది. మిశ్రమ ఎరువుల వాడకం అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. వరి సాగులో అవసరం లేకున్నా మోతాదుకు మించి రసాయనాలను వాడుతున్నారు. ఎకరా వరి పంటకు ప్రస్తుతం ఉన్న తెగుళ్లకు రూ.2 వేలు ఖర్చుచేస్తే సరిపోతుంది. కానీ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు క్రిమి సంహారక మందుల కోసం వినియోగిస్తున్నారు. వరిలో దోమపొటు, పచ్చపురుగు, అగ్గితెగులు ఎక్కువగా ఆశిస్తుంది. గ్రామంలో ఒకరి పొలంలో అగ్గితెగులు కనిపిస్తే... రైతులంతా మందును పిచికారీ చేసేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ఏర్పాటైన ఆత్మా కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్వహించాలి.నాలుగేళ్లుగా జిల్లాలోని అన్ని మండలాల్లో పెద్దఎత్తున భూసార పరీక్షలు నిర్వహించి, వివరాలతో కూడిన కార్డులను రైతులకు పంపిణీ చేశారు. ఇందులో ఫలితాల ఆధారంగా చూస్తే... పంటలకు కావాల్సిన పోషకాలన్నీ నేలల్లో ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. భూసార కార్డుల ఆధారంగా ఎరువులను వినియోగిస్తే మేలు. దీనిపై రైతులను వ్యవసాయాధికారులు చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment