Breaking News

12/07/2019

కోమటికి కమలం నుంచి రాని పిలుపు

హైద్రాబాద్, జూలై 12, (way2newstv.in)
తెలంగాణలోని ఇతర పార్టీల నుంచి కీలక నేతలను తమ పార్టీలోకి తీసుకుంటున్న బీజేపీ... వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే అనేక మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్టు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. అతి త్వరలోనే బీజేపీలో చేరతానని...ఆ పార్టీ ముఖ్యనేతలతో ఈ మేరకు చర్చలు కూడా జరిపానని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఆయన బీజేపీలో చేరలేదు. 
 కోమటికి కమలం నుంచి రాని పిలుపు

దీంతో అసలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఎంట్రీ ఎందుకు ఆలస్యమవుతుందోనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ ద్వితీయ శ్రేణి నాయకుడితో రాజగోపాల్ రెడ్డి ఫోన్ సంభాషణ బయటకు రావడం... బీజేపీలో చేరితే తానే సీఎం అవుతానని అందులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. దీంతో ఆయనను పార్టీలోకి తీసుకునే విషయంలో అధిష్టానానికి స్థానిక నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్టు సమాచారం. ఈ కారణంగానే ఆయనను పార్టీలో చేర్చుకునే అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తాత్కాలికంగా పక్కనపెట్టిందనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కోమటిరెడ్డి అనుచరులు మాత్రం ప్రస్తుతం మంచి రోజులు లేని కారణంగానే బీజేపీలో ఆయన చేరిక ఆలస్యమవుతోందని అంటున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో ఆయన కాంగ్రెస్‌లో కొనసాగే అవకాశాలు కూడా పెద్దగా కనిపించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి బీజేపీలో చేరతానని బహిరంగంగా ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... కాషాయ కండువా కప్పుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది

No comments:

Post a Comment