Breaking News

12/07/2019

జరభద్రం.. (కడప)

కడప, జూలై 12 (way2newstv.in): 
దేశంలోనే పేరు గాంచిన ప్రొద్దుటూరు బంగారు మార్కెట్‌పై దొంగలు పంజా విసురుతున్నారు. అనుకున్నదే తడవుగా బంగారు నగలను సులభంగా కొట్టేస్తున్నారు. మాయ మాటలు చెప్పి మరీ బంగారు నగలతో ఉడాయిస్తున్నారు. రైళ్లలో కూడా బంగారు నగలను కొట్టేస్తుండటంతో వర్తకులు ప్రొద్దుటూరుకు రావడానికి జంకుతున్నారు. మంచి నాణ్యత, కచ్చితమైన ధర ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి బంగారం కొనుగోలు చేసేందుకు నిత్యం కొనుగోలు దారులు ఇక్కడికి వస్తుంటారు. స్థానికంగా ఉన్న స్వర్ణకారులే కాకుండా ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ పని చేస్తూ కోరిన డిజైన్లలో ఆభరణాలను తయారు చేస్తుంటారు.దీంతో పూర్వం నుంచి ప్రొద్దుటూరు మార్కెట్‌కు మంచి పేరుంది. 
జరభద్రం.. (కడప)

అయితే మార్కెట్‌లో జరిగే మోసాలు, ఐపీలు, చోరీలు పసిడి వ్యాపారంపై ప్రభావాన్ని చూపుతాయేమోనని వ్యాపారులు, స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. కోయంబత్తూరు, చెన్నై, ముంబయి తదితర ప్రాంతాల వారికి ఇక్కడి వ్యాపారులు బంగారు నగలు తయారు చేయడానికి ఆర్డర్లు ఇస్తుంటారు. ఆయా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పెద్ద మొత్తంలో బంగారు నగలు తయారు చేసుకొని రోజు ప్రొద్దుటూరుకు వస్తారు. అయితే రైళ్లతో పాటు దారిలో అటకాయించి బంగారు నగలను దోచుకున్న సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో వ్యాపారులు ఎర్రగుంట్లకు రైల్లో వచ్చి ప్రొద్దుటూరుకు చేరుకునేవారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో వ్యాపారులు వేర్వేరు ప్రాంతాల మీదుగా ఇక్కడికి వస్తున్నారు. వీళ్లు తెచ్చే బంగారు నగలకు చాలా వరకు బిల్లులు ఉండవు. దీంతో పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ వాళ్ల కళ్లు గప్పి రావాల్సిన పరిస్థితి ఉంది.  ప్రొద్దుటూరులో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలతో బంగారు మార్కెట్‌లో అయోమయం నెలకొంది. ఇటీవలే ప్రొద్దుటూరులోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిథున్‌ దలై అనే స్వర్ణకారుడి నుంచి 100 గ్రాముల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తి దోచుకొని వెళ్లాడు. తనకు కొత్త మాడళ్లతో బంగారు చైన్‌లు తయారు చేయించాలని, కొన్ని రకాల చైన్లు చూపిస్తే తన అన్నకు చూపించి వస్తానని చెప్పి బంగారు నగలతో ఉడాయించాడు. కోయంబత్తూరు నుంచి రైలులో ప్రొద్దుటూరుకు బంగారు నగలను తీసుకొని వస్తున్న వ్యాపారిని రైల్వే పోలీసులమని చెప్పి నలుగురు వ్యక్తులు చిత్తూరు జిల్లా పాకాల వద్ద బెదిరించి 1.5 కిలోల బంగారు నగలను దోచుకొని వెళ్లారు. వారంతా ప్రొద్దుటూరు పరిసర ప్రాంత వాసులు కావడంతో ఆ బంగారాన్ని ఇక్కడే కరిగించి విక్రయించారు. నగలు తయారు చేసేందుకు ఇచ్చిన బంగారం తీసుకొని ఇతర రాష్ట్రాలకు చెందిన స్వర్ణకారులు అనేక మార్లు పారిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

No comments:

Post a Comment