Breaking News

12/07/2019

కర్ణాటకలో హై డ్రామా

మారిపోతున్న మకాం., ఫోన్ నెంబర్లు
బెంగళూర్, జూలై 12(way2newstv.in)
దొంగ పోలీస్ ఆట కాదిది… ప్రజాస్వామ్య పలాయనం..ఎంతో గౌరవమర్యాదలు కలిగి ఎన్నికైన ప్రతినిధులు..ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుంటారు..చిరునామా దొరక్కుండా శిబిరాల్లో విడిది చేస్తారు. అంతలోనే అనుమానం… ఎవరైనా పట్టుకుంటారేమోననే సందేహం.. మళ్లీ ముంబై టు గోవా….గోవా టు గుట్టు తెలియని అజ్ణాతం…ఫోను నెంబర్లు మార్చేస్తుంటారు.. అసలు ఫోనులే వారి నుంచి తీసేసుకుంటుంటారు…వీరంతా ప్రజాప్రతినిధులు.. ఎమ్మెల్యేలు..కొన్ని లక్షలమందిచేత పట్టం గట్టించుకున్న ప్రజాస్వామ్య శిఖరాలు…నేడు కర్నాటక రాష్ట్రాన్ని రక్తి కట్టిస్తున్న పాత్రధారులు..దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తూ దిగజారుతున్న డెమొక్రటిక్ వాల్యూస్ కు దర్పణం పడుతున్నఘట్టాలు రోజుల తరబడి అక్కడ కొనసాగుతున్నాయి. రాజ్యాంగం, చట్టాలు ప్రవచించిన సూత్రాలకు పల్లెత్తు విలువ లేకుండా పోయింది. నిబంధనలను నిర్వీర్యం చేసే నీడలు చట్టాల సంక్లిష్టతలోనే దాగి ఉంటాయి. రాజ్యాంగానికి తూట్లు పొడిచే సూదులు నిర్వచనాల రూపంలో నివురుగప్పి కనిపిస్తాయి. 
కర్ణాటకలో హై డ్రామా

అందుకే ఫిరాయింపులు..పార్టీ క్రమశిక్షణలు.. ప్రజాస్వామ్యంలో నేతిబీరకాయ చందమైపోతుంటాయి.అసమానతల చట్రంలో అవసరార్థం పొడిచిన పొత్తు ఫలితమే కర్ణాటకలోని జేడీఎస్, కాంగ్రెసు సర్కారు. ఏకసూత్రంతో కమలం పార్టీని దూరం పెట్టాలనే తాపత్రయంతో కంగాళీగా కొలువుతీరిన ప్రభుత్వం తొలి అడుగునుంచే సంక్షోభాన్నే ఎదుర్కొంటోంది. ఏడాది కాలంగా ఎదురీతతోనే మనుగడ సాగిస్తోంది. పాలన పడకేసింది. మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా అభివృద్ది అడుగంటిపోయింది. ప్రతినిత్యం ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే గగన కుసుమం అయిపోయింది. అసలు మూలం ఆ సంకీర్ణం మొలకెత్తించినప్పుడే తెలిసిపోయింది. 78 మందిశాసనసభ్యులున్న కాంగ్రెసుకు కాకుండా అందులో సగం కూడా సీట్లు రాని జేడీఎస్ నుంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిరావడమే పచ్చి అవకాశవాదం. రాజకీయ అనివార్యత. 37 మంది ఎమ్మెల్యేలతోనే ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కుమారస్వామి తన పదవీకాంక్షను తీర్చుకోగలిగారే తప్ప ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాలేదు. ఫలితంగానే ఈ కాంబినేషన్ కొలువుతీరినప్పుడే మూన్నాళ్ల ముచ్చట అని అందరికీ తెలుసు. అసమ్మతి ఆరకుండా సెగలు పొగలు కక్కుతోంది. అధిష్ఠానం స్థాయిలో ఎన్నిసార్లు సర్దుబాట్లు జరిగాయో చెప్పలేని స్థితి. కర్ణాటకలో ఈ సర్కారుకు ఏదేని జరిగితే లోక్ సభకు జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం పడుతుందనే భయంతో అన్నిటినీ భరిస్తూ వచ్చింది హస్తం పార్టీ అగ్రనాయకత్వం.కాంగ్రెసు నుంచి పెద్ద నాయకులు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. కేరళను మినహాయిస్తే దక్షిణాదిన ప్రభావం చూపగల స్థాయిలో ఉన్న రాష్ట్రం కూడా ఇదొక్కటే. సొంతంగా ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చేయని ప్రయత్నం లేదు. రాష్ట్రానికో జెండా అంటూ జాతీయపార్టీ లేవనెత్తకూడని వివాదాన్ని వెలికి తెచ్చారు. కర్టాటక ఆత్మాభిమానం పేరిట జాతీయ సంస్థలపై చిన్నాచితక దాడులకు పాల్పడిన ఉదంతాలూ ఉన్నాయి. మఠాలు,పీఠాలు, భాష, సంస్క్రుతులన్నిటినీ వాడుకోవాలని చూసింది హస్తం పార్టీ. అయినా పని కాలేదు. అతిపెద్ద పార్టీగా బీజేపీనే అవతరించింది. అలాగని ఆ పార్టీ కూడా తక్కువేమీ తినలేదు. కులాధిపత్యం మొదలు మత ప్రచారం వరకూ సకల అస్త్రాలను తాను సైతం పైకి తీసింది. ఎన్నికలో పరాజయం పాలైనప్పటికీ ప్రత్యర్థిగా పోటీ చేసిన జేడీఎస్ తో జట్టుకట్టి కమలం పార్టీకి అధికారం దక్కకుండా చేయగలిగారు. కానీ పరిపాలనను మాత్రం పట్టాలపైకి ఎక్కించలేకపోయారు. నిరంతరం అసంతృప్తి, పదవులు రాని వారి పేచీలతోనే సరిపోయింది. బుజ్జగింపులు, బేరసారాలు, బతిమాలటాలు, పంపిణీలతోనే కాలం వెళ్లబుచ్చాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలతోనే కమలం పవర్ రాష్ట్రంలో ఎంతగా ఉందో ఒక్కసారిగా తెలియవచ్చింది. ఇంతకాలం అణిచిపెడుతూ వస్తున్న అసంతృప్తి ఒక్కసారిగా బ్లోఅవుట్ లా పెల్లుబికింది. పర్యవసానమే రాజీనామాల పరంపర. ఈ త్యాగాలకు తర్వాత దక్కే ప్రతిఫలం ఎంత ఖరీదుగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తర్వాత సర్కారులో అమూల్యమైన పదవులకు అర్హుల జాబితాలో అగ్రతాంబూలం వారికి దక్కుతుంది. ఇది జగద్విదితం.అలవికాదని తెలిసి కూడా కర్ణాటకలో సంకీర్ణాన్ని అందలమెక్కించిన కాంగ్రెసు, జేడీఎస్ లకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. అయినా ఎవరికీ ఆ పార్టీల పట్ల సానుభూతి లేదు. అయ్యో అన్న భావన అంతకన్నా లేదు. ఎందుకంటే అంతా ఆ తానుముక్కలే. ఈరోజున ఇక్కడ ఉన్నవారు రేపు మరో పార్టీలో ఉంటారు. అవకాశవాదానికి పెత్తనమిస్తే పార్టీలకు జరిగే శాస్తి అదే. వేటగాడిలా కమలం పార్టీ అందినవారిని అందినట్లు తన బుట్టలో వేసేసుకోవడానికి కాచుకుని కూర్చుంది. రాజీనామాలతో బలం తగ్గితే అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకే పగ్గాలు ఖాయం. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు జరుగుతాయా? లేదా కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి అత్తెసరు మెజార్టీతోనే బీజేపీ వారు నెట్టుకొచ్చేస్తారా? ఈ సస్పెన్స్ తతంగం మరెంతకాలం సాగదీస్తారన్నది వేచి చూడాల్సిన ప్రశ్నే. పార్టీల సంగతెలా ఉన్నప్పటికీ మొత్తం కథలో ఎవరు విజేత, పరాజితులన్న సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కచ్చితంగా ప్రజాస్వామ్యమే బాధితగా మిగిలిపోతుంది. పరిహాసస్వామ్యంగా నవ్వుల పాలవుతుంది.

No comments:

Post a Comment