Breaking News

05/07/2019

కార్పొరేషన్ గా మారిన విజయనగరం


విజయనగరం, జూలై 5, (way2newstv.in)
విద్యలకు నిలయం.. కళలకు కాణాచి... సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన విజయనగరం కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. ప్రభుత్వ పని వేళలు ముగిసినప్పటి నుంచి  టీడీపీ పాలకవర్గం పదవీకాలం ముగియటంతో 2016 ఫిబ్రవరి 12న ప్రభుత్వం జారీ చేసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేశాయి. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో కార్పొరేషన్‌ హోదాలో విజయనగరంలో పాలన సాగనుంది. ఓ వైపు పాలకవర్గం పదవీ కాలం ముగియటం... మరో వైపు కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన విజయనగరానికి ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ నియమితులయ్యారు.

కార్పొరేషన్ గా మారిన విజయనగరం

వాస్తవానికి విజయనగరం పట్టణం 2015 సంవత్సరంలోనే కార్పొరేషన్‌ హోదా దక్కించుకుంది. 2015 సంవత్సరం డిసెంబర్‌ 10వ తేదీన కార్పొరేషన్‌ స్థాయిని అందుకోగా.. అప్పటి వరకు మున్సిపల్‌ కార్యాలయం బోర్డును సైతం  మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మార్చారు. కార్పొరేషన్‌ స్థాయి కమిషనర్‌గా జి.నాగరాజును నియమించారు. అయితే ఈ ఉత్తర్వులు కేవలం రెండు నెలలు మాత్రమే అమలయ్యాయి.  2014లో ఎన్నికైన టీడీపీ పాలకవర్గం ఈ ఉత్తర్వుల కారణంగా అధికారానికి దూరమవుతుంది. స్పందించిన స్థానిక అధికార పార్టీ నేతలు అప్పట్లో ఆ ఉత్తర్వులను అభియన్స్‌లో పెట్టించారు. 2016 సంవత్సరం ఫిబ్రవరి 12 నుంచి మున్సిపాలిటీగా కొనసాగించగా... కౌన్సిల్‌ పదవీ కాలం ముగియగానే అభియన్స్‌లో ఉంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయంటూ జీఓ నంబర్‌ 36ను జారీ చేసింది. తాజాగా  కౌన్సిల్‌ పాలకవర్గం ముగియటంతో కార్పొరేషన్‌గా పాలన సాగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించనుంది. విజయనగరం మున్సిపాలిటీ 1888 ఏర్పడింది. 1998 నాటికి సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా మారింది. 57.01 చదరపు కిలోమీటర్ల పరిధిలో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,44,598 మంది జనాభా ఉన్నారు.. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌గా  రూపొంతరం చెందిన రోజు నుంచి  ప్రత్యేకాధికారి పాలన ప్రారంభం కావటం విశేషం. ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి అంతంతమాత్రంగానే జరిగింది. రూ. కోట్లు నిధులున్నా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. అధికారిక లెక్కల ప్రకారం ఐదేళ్లలో 2164 అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ276.43 కోట్లు కేటాయించినా రూ. 85.83 కోట్లతో 1037 పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. అసంపూర్తి పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తాజాగా పాలకవర్గం పదవీకాలం ముగియటం , మున్సిపల్‌ కార్పొరేషన్‌గా హోదా దక్కించుకోవటం, అదే సమయంలో జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా నియమితులు కావడంతో అభివృద్ధి సాధించగలదని నగరవాసులు ఆకాంక్షిస్తున్నారు

No comments:

Post a Comment