Breaking News

05/07/2019

వజ్రకరూర్ కు క్యూ కడుతున్న జనాలు


అనంతపురం, జూలై  5, (way2newstv.in
వజ్రాలకు పేరుగాంచింది...వజ్రకరూరు. అందుకే ఏటా తొలకరి వర్షాలు కురవగానే ఇక్కడ ఆశల వేట ప్రారంభమవుతుంది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా పొలాల్లో వజ్రాల వెతుకులాటలో నిమగ్నమవుతుంటారు. దొరికిన వారి జీవితాలే మారిపోగా...ఎప్పటికైనా అదృష్టం తలుపుతట్టకపోతుందా...ఓ రంగురాయి తమ జీవితం మార్చకపోతుందా అని ఏళ్లుగా వెతులాడే వారే ఎక్కువగా కనిపిస్తారు.వజ్రకరూరు ప్రాంతంలో లభించే వజ్రాలకు మార్కెట్‌లో భారీ రేటు పలుకుతోంది.

 వజ్రకరూర్ కు క్యూ కడుతున్న జనాలు

 ఇక్కడి పొలాల్లో ఏటా 10 నుంచి 20 వరకు వజ్రాలు దొరుకుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల వజ్రకరూరు పరిసర ప్రాంతంలో మోస్తరు జల్లులు కురిశాయి. దీంతో వారం రోజులుగా ఉదయాన్నే స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వజ్రకరూరు పరిసర ప్రాంతంలోని పొలాలకు చేరుకుని వజ్రాలకోసం వెతుకులాటలో నిమగ్నమవుతున్నారు. పొలాల్లో విత్తనం వేసేంతవరకు ఈ వజ్రాల వేట కొనసాగుతుందని ఇక్కడి వారు చెబుతున్నారు.వర్షం కురిసినప్పుడు పైభాగంలోనుంచి నీరుకిందకు ప్రవహిస్తూ ఒక ప్రాంతంలోనికి చేరి...అక్కడే ఇంకిపోతుంది. ఈ క్రమంలో నీటి వెంట వజ్రాలు వస్తాయని ఇక్కడి వారి నమ్మకం. అందుకే పొలాల్లోని లోతట్టు ప్రాంతాల్లోనే వజ్రాల అన్వేషణ ఎక్కువగా జరుగుతోంది. ఇక్కడ ఎవరికైనా వజ్రం లభిస్తే  గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. లేదంటే వజ్రకరూరు పరిసరాల్లోనే తిష్టవేసిన వ్యాపారులకు అమ్ముకుంటారు. ఇలా కొనుగోలు చేసిన వజ్రాలను వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యధిక ధరకు అమ్ముకుంటుంటారు. గత ఏడాది కూడా ఈప్రాంతంలో రూ.లక్షలు విలువచేసే వజ్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది

No comments:

Post a Comment