Breaking News

04/07/2019

కొత్త కార్డులెక్కడ..? (కరీంనగర్)

కరీంనగర్, జూలై 4  (way2newstv.in): 
పేదవారికి కేరాఫ్‌గా నిలిచేది రేషన్‌కార్డు..నిరుపేదలకు కేవలం చౌక ధరల్లో సరకులు అందించడమే కాకుండా ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పొందేందుకు ఈ కార్డును కలిగి ఉండాలనే నిబంధనలు విధిస్తున్నారు. మరోవైపు కొత్తగా ఆహారభద్రత కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. నూతన రేషన్‌కార్డుల కోసం వేచిచూస్తున్న అర్హులైన దరఖాస్తుదారులకు మరింత నిరీక్షణ తప్పేలా లేదు. నిన్నటి వరకు ఎన్నికల ప్రవర్తన నియామావళిని సాకుగా చూపించిన పౌరసరఫరాలశాఖ అధికారులు ఇప్పుడు ప్రభుత్వ మార్గదర్శకాలు రాకపోవడం వల్లే నూతన కార్డులను ఇవ్వలేకపోతున్నామని చెబుతుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. నూతన మార్గదర్శకాల అనంతరమే దరఖాస్తులకు ఆమోదం తెలపాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు దరఖాస్తుల ఆమోదాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయా జిల్లా బాధ్యులకు ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితోపాటు చేయాలనుకునే వారూ నిరాశ వ్యక్తంచేస్తున్నారు. 
కొత్త కార్డులెక్కడ..? (కరీంనగర్)

నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలనెల చౌకధరల్లో సరకులు అందించేందుకు పౌరసరఫరాల శాఖ రేషన్‌కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటుంది. రూ.1కే దొడ్డుబియ్యం, ఒక లీటర్‌ నీలి కిరోసిన్‌, అప్పుడప్పుడు పండగల వేళ చక్కెర, ఇతరత్రా సరకులు రాయితీ ధరలకు చౌకధరల దుకాణాల్లో అందిస్తున్నారు. ఆహార భద్రత కార్డుల పేరిట రూపాయికే కిలో బియ్యం అందిస్తున్న ప్రభుత్వం ఈ కార్డులు కేవలం సరకులు తీసుకోవడానికే తప్ప ఎలాంటి సంక్షేమ పథకాలకు ఉపయోగపడవని స్పష్టం చేసినప్పటికీ ఆదాయ, ఇతర పథకాలకు దరఖాస్తుల సమయంలో ఈ కార్డుల గురించి ఆరా తీస్తుండటంతో రేషన్‌కార్డులను పొందేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. వరుసగా వివిధ రకాల ఎన్నికలు జరగడంతో గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ప్రస్తుత జూన్‌ వరకు నూతన రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ నిలిచిపోవడంతో భారీగా దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతోంది. మొదట మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అది తొలుత తహసిల్‌ కార్యాలయానికి, ఆ తర్వాత జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆమోదం పొందాల్సి ఉంటుంది. కొత్తగా పెళ్లయిన వారు, కార్డు కలిగి ఉండి కొత్తగా పిల్లల పుట్టిన వారి పేర్లు నమోదు చేసుకోవడం, ఉమ్మడి కుటుంబాలు వేరు పడినప్పుడు వంటి కారణాలతో ఆహారభద్రత కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే వారు మీ సేవ కేంద్రాల్లో వేలాది మంది ఉంటున్నారు.జిల్లాలో 413 రేషన్‌ దుకాణాలుండగా ప్రస్తుతం 2.20 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. నూతనంగా గత ఏడాది నుంచి ఇప్పటి వరకు మరో 2,51,108 మంది మీసేవలో దరఖాస్తు చేసుకోగా 2,17,147 దరఖాస్తులను ఆయా తహసీల్దార్లు ధ్రువీకరించి కార్డు పొందే అర్హులుగా గుర్తించారు. 33,720 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. 241 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. అత్యధికంగా రామగుండంలో 55,620 మంది దరఖాస్తు చేసుకోగా ఎలిగేడు మండలంలో 7,852 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అంతర్గాంలో 8,197 మంది, ధర్మారంలో 19,170 మంది, జూలపల్లిలో 10,090, కమాన్‌పూర్‌లో 8,502, మంథనిలో 19,019, ముత్తారంలో 9,484, ఓదెలలో 16,288, పాలకుర్తిలో 12,359, పెద్దపల్లిలో 35,176, రామగిరిలో 12,150, శ్రీరాంపూర్‌లో 15,236, సుల్తానాబాద్‌లో 21,875 మంది కొత్తగా కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరిలో అర్హులైన వారిని గుర్తించినప్పటికి కొత్తగా కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక మార్గదర్శకాలు రాకపోవడంతో కార్డుల జారీ నిలిపివేశారు.జిల్లా జనాభాలో 75 శాతం మంది కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో పరిమితికి మించిన వార్షికాదాయం ఉన్నవారితో పాటు అధికభూములు, ఆదాయ సంపన్నులు కూడా ఉన్నట్లు మండల తహసీల్దార్లు నివేదికల్లో పొందుపరిచారు. కొత్త జిల్లాల పరిధిలో కూడా లక్షలాదిగా దరఖాస్తులు రావడం, ఉన్న జనాభా కంటే ఎక్కువగా రేషన్‌కార్డుల దరఖాస్తులు ఉండటంతో అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరింత నిబంధనలు కఠినతరం చేసి అర్హులైన పేదలకే కార్డులు ఇచ్చే విధంగా ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు రూపొందిస్తుంది.

No comments:

Post a Comment