Breaking News

04/07/2019

ఎందుకీ జాప్యం..? (గుంటూరు)

గుంటూరు, జూలై 4 (way2newstv.in) : 
సాగు నీరు వినియోగించుకుంటున్న రైతుల నుంచి ఏటా తీరువా రూపంలో రెవెన్యూ యంత్రాంగం సొమ్ము వసూలు చేసి సర్కారు ఖాతాలో వేస్తోంది. నిధుల లభ్యత ఆధారంగా ఏటా కాల్వల మరమ్మతుకు క్యాచ్‌మెంట్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ నిధులు విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో సాగర్‌ కాల్వల పరిధిలో రూ.కోటితో వాటి నిర్వహణ చేపట్టేందుకు మార్చి నెలకు ముందే ప్రతిపాదనలు పంపగా వసూలు చేసిన నీటి తీరువా వివరాలూ జత చేసి మళ్లీ పంపాలని కోరింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ప్రకటన రావడంతో ప్రతిపాదనలు వెళ్లలేదు. దీనికితోడు తీరువా వసూలు నివేదిక రెవెన్యూ అధికారుల నుంచి జలవనరుల శాఖకు రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నికల బదిలీల్లో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న వారు పొరుగు జిల్లాలకు వెళ్లారు. 

ప్రస్తుతం పనిచేస్తున్న వారు తీరువా వసూలు ఎంత వరకు వచ్చింది? ఎంత జమ అయ్యిందన్న వివరాలను చెప్పలేకపోతున్నారు. నాలుగేళ్లుగా సాగర్‌ కాల్వలకు నీటి విడుదల ఆలస్యం కావడం, వరికి నీరివ్వలేని పరిస్థితులు ఏర్పడడంతో ఆశించినస్థాయిలో తీరువా వసూలు కాలేదు. మెట్ట పంటలకూ దీనిని వసూలు చేయాల్సివున్నా రెవెన్యూ యంత్రాంగం దృషి ్టసారించలేదు. దీంతో జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపడంలో జాప్యం జరుగుతోంది.కృష్ణా పశ్చిమ డెల్టాలో కాల్వల మరమ్మతుకుగాను 78 పనులకు రూ.8.07 కోట్లు, గుంటూరు వాహిని పరిధిలో ఏడింటికి రూ.1.05 కోట్లు వెరసి మొత్తం రూ.9.12 కోట్లతో ఇటీవలే గుంటూరు వలయ పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం కాడాకు ప్రతిపాదనలు పంపింది. సాధారణంగా వీటిని మార్చిలో పంపితే ఏప్రిల్‌లో అనుమతులు వచ్చి మే, జూన్‌ మొదటివారంలో పనులు పూర్తిచేసి నీరు విడుదల నాటికి కాల్వలను సిద్ధం చేసేవారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ పనులు చేయడానికి కోడ్‌ అడ్డంకిగా మారగా ఇటీవలే ప్రతిపాదనలు పంపారు. వాటికి అనుమతి లభించిన వెంటనే పనులు పూర్తి చేయించాలన్న యోచనలో జలవనరుల శాఖ అధికారులు ఉన్నారు. కాల్వల పరిధిలోని నీటి సంఘాలకు వాటిని నామినేషన్‌పై అప్పగించేవారు. గత ప్రభుత్వంలో నియామకమైన సంఘాలు ఇప్పటికీ కొనసాగుతుండగా ఈ ప్రక్రియ నిర్వహిస్తారా? లేక టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు కట్టబెడతారా? అనే విషయమై స్పష్టత రావాల్సివుంది. డెల్టాలో తీరువా వసూలు సక్రమంగా జరుగుతుండటంతో రూ.30 కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాల్వలకు నీటి విడుదలకు ముందు చిన్న చిన్న మరమ్మతులు నిర్వహిస్తే సీజన్‌ మొత్తం ఇబ్బంది లేకుండా సాగు నీరందుతుంది. లేకపోతే పిచ్చిమొక్కలు, తూటుకాడ, మరమ్మతులు లేక షట్టర్లు పనిచేయక రైతులకు పాట్లు పడాల్సిందే. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇంకా వర్షాలు ప్రారంభం కాకపోవడంతో జలాశయాలకు నీటి చేరిక లేదు. సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలో నిల్వలు అడుగంటాయి. గోదావరికి వరద వస్తే ఆ నీటిని బ్యారేజీకి తరలించడం, లేదా కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిస్తేగానీ కాల్వలకు నీటి విడుదలపై స్పష్టత రాదు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వాటి మరమ్మతులకు అనుమతిస్తే యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయడం ద్వారా సీజన్‌ మొత్తానికి నీటి ప్రవాహ ఇబ్బందులు తప్పుతాయి.జూలై వచ్చినా కాల్వల్లో పిచ్చిమొక్కల తొలగింపు, చిన్న చిన్న మరమ్మతులు ప్రారంభం కాలేదు. ప్రతిపాదనలు పంపినా అనుమతులు రాకపోవడంతో క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టలేదు. ఏటా కాల్వలకు నీరు విడుదల చేసే ముందు మరమ్మతులు చేపట్టేవారు. అందుకు ఈసారి ప్రతిపాదనలు పంపినా ఇంకా ఏ విషయం తేలలేదు. నాగార్జునసాగర్‌ కాల్వలతోపాటు కృష్ణా పశ్చిమ డెల్టాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

No comments:

Post a Comment