Breaking News

13/05/2019

ఆర్టీసీ రెస్ట్ రూమ్స్ అలంకార ప్రాయమే

మెదక్, మే 13, (way2newstv.in
ఆర్టీసీ డ్రైవర్లు రెస్ట్ రూమ్ లంటేనే హడలిపోతున్నారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా అధికారులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఎంజీబీఎస్ లో రెస్ట్ రూమ్ ల పరిస్థితిపై ఆర్టీసీ డ్రైవర్లు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. కొన్ని నెలలుగా ఇక్కడ రెస్ట్ రూమ్ లలో పరిస్థితి అధ్వానంగా మారింది. కనీసం తాగటానికి మంచి నీటిని కూడా అందుబాటులో ఉంచటం లేదు. పది మంది పడుకునే రూమ్ లో 20 బెడ్లు వేసేసి ఆర్టీసీ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. లాంగ్ డ్రైవ్ లు, ఎక్స్ ట్రా డ్యూటీలు, నైట్ డ్యూటీలు చేసే వారి కోసం ఎంజీబీఎస్ లో రెస్ట్ రూమ్ లు ఏర్పాటు చేశారు.ఈ రెస్ట్ రూమ్ లలో చాలా మంది డ్రైవర్లు సేద తీరుతుంటారు. కనీసం 4 గంటల నుంచి 8 గంటల వరకు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ చేయాలంటే డ్రైవర్ కు సరైన నిద్ర, మానసిక ప్రశాంతత ఉంటేనే డ్రైవింగ్ పై సరైన శ్రద్ధ పెట్టగలుగుతారు. కానీ ఇక్కడి రెస్ట్ రూమ్ లలో విశ్రాంతి తీసుకునే డ్రైవర్లకు కనీసం నిద్ర కాదు కదా బాత్ రూమ్, టాయిలెట్లలో ఉండే దుర్గంధం కారణంగా ఒక్క క్షణం కూడా రెస్ట్ రూంలో ఉండలేకపోతున్నారు. 


ఆర్టీసీ రెస్ట్ రూమ్స్ అలంకార ప్రాయమే

దాదాపు 8 ఫ్యాన్లు ఉండాల్సిన గదుల్లో రెండు ఫ్యాన్లతో సరిపెట్టారు. ప్రస్తుతం ఎండాకాలం కావటంతో ఉక్కపోతకు సరిగా నిద్ర ఉండటం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్ లు కావటంతో ప్రస్తుతం అప్పర్ బెడ్ కోసం నిత్యం ఆర్టీసీ డ్రైవర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  లోయర్ బెడ్ లలో పడుకుంటే కొంచెం కూడా గాలి రావటం లేదని డ్రైవర్లు చెబుతున్నారు.ఎమ్ జీబీఎస్ లో   జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ డ్రైవర్లు, కండకర్లు ఇతర సిబ్బందికి ఏసీ రెస్ట్ రూమ్ లు ఏర్పాటు చేశారు. కానీ కొన్ని నెలలుగా ఇక్కడ ఏసీలు పనిచేయటం లేదు. కేవలం అలంకార ప్రాయంగా నిలిచాయి. ఫ్యాన్లు కూడా లేకపోవటంతో ఎండాకాలంలో ఎవరూ వీటిని వినియోగించటం లేదు.  బాత్ రూమ్, టాయిలెట్ల నిర్వహణ పై పూర్తిగా అధికారులు చేతులెత్తేశారు. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులంటే ఇంత లెక్కలేని విధంగా వ్యవహరించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నైట్ డ్యూటీలు, ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే డ్రైవర్లకు రెస్ట్ రూమ్ లలో సరైన వసతులు కల్పించేందుకు  కేర్ టేకర్స్ ను నియమించారు. ఐతే వీరు సౌకర్యాలను కల్పించే విషయంలో  లెక్కలేని విధంగా వ్యవహరిస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి.పటాన్ చెరు రెస్ట్ రూమ్స్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. నిత్యం దాదాపు 200  మంది డ్రైవర్లు పటాన్ చెరు రెస్ట్ రూమ్స్ లో సేద తీరుతుంటారు. ఐతే కావాల్సినన్ని బెడ్లు లేకపోవటంతో డ్రైవర్లంతా బయటే పడుకుంటున్నారు. 200 మంది కి 6 టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా కంపు కొడుతుండటంతో డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలంలో ఉన్న రెండు ఫ్యాన్లు కూడా పనిచేయటం లేదు. ఈ పరిస్థితిపై డ్రైవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రెస్ట్ రూమ్ లలో సౌకర్యాల కొరత ఎప్పటి నుంచో ఉంది. దీనిపై ఎన్నోసార్లు కార్మికులు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవటంతో సోషల్ మీడియాలోనూ పలుమార్లు ఇక్కడి పరిస్థితి పై ఫొటోలను షేర్ చేశారు. అయినప్పటికీ ఆర్టీసీ అధికారుల్లో చలనం లేదు.కొంతమంది డ్రైవర్ల అభ్యర్థన మేరకు ఇటీవలే ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, ఈయూ సిటీ అధ్యక్షులు మజీద్  రెస్ట్ రూమ్ లను పరిశీలించారు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటిని కూడా ఏర్పాటు చేయకపోవటం దారుణమని రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి విమర్శించారు.

No comments:

Post a Comment