Breaking News

16/05/2019

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మట్టి మాఫియా

కాకినాడ, మే 16, (way2newstv.in)
రైతులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని పంట పొలాలు చదును చేసుకునేందుకు ఉన్న చిన్నపాటి వెసులుబాటును మట్టి మాఫియా సొమ్ములు చేసుకుంటుంది. వేసవి కాలంలో పంట పొలాల్లో ఏర్పడిన ఎత్తుపల్లాలను చదును చేసుకునేందుకు అడుగు నుండి అడుగున్నర మట్టి వరకూ మనుషులతో తవ్వి వరి చేను చుట్టూ గట్టును పటిష్ఠం చేసుకునేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. దీన్ని ఆసరాగా తీసుకున్న మట్టిమాఫియా ఇష్టానుషారంగా జెసిబిలతో సుమారు 4 అడుగుల లోతువరకూ మట్టిని తవ్వి దానిని ట్రాక్టర్లు, లారీలతో పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్‌కు విచ్చలవిడిగా తరలిస్తున్నా, రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు, ఆర్టీఏ అధికారులు వాటిని నిలువరించేందుకు సాహసించలేకపోతున్నారు. 


ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మట్టి మాఫియా

దీంతో మట్టి మాఫియా కోనసీమ వ్యాప్తంగా కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. పంట పొలాల్లోని నల్లమట్టిని తొలగించాలంటే గనులు, భూగర్భశాఖ అధికారులు అనుమతులు తప్పనిసరి. అయితే అవేమి లేకుండా వరిచేలల్లోని మట్టిని విచ్చలవిడిగా తరలిస్తున్నారు. మైన్సుశాఖ నిబంధనలు ప్రకారం పంట పొలాల్లో అడుగులోతుకు మించి మట్టిని తవ్వితే తప్పని సరిగా అనుమతులు తీసుకోవడమే కాకుండా క్యూబిక్ మీటర్‌కు నిర్ణీత రుసుము చెల్లించవలసి ఉంటుంది. అయితే అవేమిలేకుండా మట్టిమాఫియా స్థానిక అధికారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమకు అడ్డులేదంటూ రెచ్చిపోతున్నారు. ఆమట్టిని ట్రాక్టర్లు,లారీలపై రియల్ ఎస్టేట్ భూములకు తరలిస్తున్నారు. అంతేకాకుండా లైసెన్సుల్లేని ట్రాక్టర్ల డ్రైవర్లు వాహనాలు వేగంగా నడపడంతో ప్రయాణికులు రోడ్లుపై ప్రయాణించాలంటే బెంబేలెత్తుతున్నారు. ఇటీవల అల్లవరం మండలం కోడూరుపాడు సమీపంలో వేగంగా వచ్చిన మట్టిట్రాక్టర్ ఢీకొట్టిన సంఘటనలో కుమారుడు మృత్యవాత పడగా తండ్రి,కూతుళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టిమిట్టాడుతున్నారు. ఇష్టానుసారంగా వరిచేలల్లో తీస్తున్న మట్టిని ఆయా మండల తహసీల్దార్లుకాని, పోలీసులుగాని ఎందుకు వాటిని అడ్డుకోవడంలేదని గ్రామస్థులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇష్టానుషారంగా తవ్వుతున్న మట్టి ట్రాక్టర్లను అదుపుచేయాలని పలువురు కోరుతున్నారు.

No comments:

Post a Comment