డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు సంబంధించిన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ–2019 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. కాలేజీ, కోర్సుల ఎంపిక కోసం ఆన్‌లైన్‌లో ఫోన్ నంబర్ సహా ఆధార్ నంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంది. చాలా మంది అభ్యర్థులు తమ ఫోన్ నంబర్‌తో ఆధార్ లింక్ చేయలేదు. దీంతో ఆ రిజిస్ట్రేన్లను సిస్టం యాక్సెప్ట్ చేయడం లేదు. ఉస్మానియా, పాలమూరు, మహాత్మాగాంధీ, కాకతీయ, శాతవాహన, తెలంగాణ వర్సిటీల పరిధిలో 1,173 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటి పరిధిలో మూడేళ్ల కోర్సుల్లో నాలుగు లక్షలకుపైగా సీట్లు ఉన్నాయి. వీటి భర్తీ కోసం మొత్తం 74 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆధార్ నంబర్‌లేని అభ్యర్థుల కోసం ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా హెల్ప్‌లైన్ కేంద్రాల్లోని ప్రొవైడర్లు సహా ఇతర ఆన్‌లైన్ సెంటర్లన్నీ ఒకే సమయంలో వెబ్‌సైట్ లాగిన్ చేస్తుండటంతో తరచూ సర్వర్‌డౌన్ అవుతోంది.
దోస్త్ కష్టాలు
ఏం చేయాలో తెలియక ప్రొవైడర్లు చేతులెత్తేస్తున్నారు. తమ భవితవ్యం ఏమిటో అర్థం కాక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల పది నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు 60 వేల మందే తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. రూ.400 అపరాధ రుసుంతో 29 వరకు ఈ ప్రక్రియకు అవకాశం ఇచ్చింది. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అభ్యర్థులు గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సివస్తోంది. రోజంతా క్యూలైన్‌లో నిలబడినప్పటికీ.. తీరా సర్వర్‌డౌన్ అవడంతో ఆయా అభ్యర్థులంతా నిరాశతో వెనుతిరగాల్సివస్తోంది. ఇక ఆధార్ నంబర్ లేని అభ్యర్థుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఆన్‌లైన్‌లో అడిగిన వివరాలన్నీ నమోదు చేసినా అప్‌లోడ్ కావడం లేదు. ఇలా ఒకే అభ్యర్థి వివరాలను రెండు మూడుసార్లు నమోదు చేయాల్సి వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ప్రొవైడర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. లాగిన్ చేసిన వెంటనే సైట్ ఓపెన్ కాకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. కంప్యూటర్లు తరచూ మొరాయిస్తుండటం, సర్వర్ డౌన్ అవుతుండటంతో ఒక్కో అభ్యర్థికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. ఆధార్‌తో ఫోన్ నంబర్ లింకు కాని అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేయన్నుట్లు అధికారులు ప్రకటించారు. అయితే తరచూ సర్వర్లు డౌన్ అవుతుండటం, కంప్యూటర్లు మెరాయిస్తుండటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం ఏర్పడుతోంది. ఇకపై ఈ సేవలు అందించలేమంటూ ప్రొవైడర్లు చేతులెత్తేస్తున్నారు.
No comments:
Post a Comment