Breaking News

25/05/2019

రాత్రికి రాత్రే పళ్లుగా మార్చేస్తున్నారు..


నిజామాబాద్, మే 25, (way2newstv.in)
ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్‌ మొదలైంది. మార్కెట్‌లో సీజనల్‌ పండ్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. కాయలను సహజసిద్ధమైన పద్ధతుల్లో మాగబెట్టి పండ్లుగా మార్చే వరకు వినియోగదారులు, వ్యాపారులు ఓపిక పట్టే పరిస్థితి లేదు. దీంతో నిషేధితమైనా విషపూరిత కార్బైడ్, ఇథిలిన్‌ వంటి రసాయనాలను వినియెగించి రాత్రికి రాత్రే పండ్లుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు.ఇలాంటి రసాయనాలను ఉపయోగించి పండించిన పండ్లు తినడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండు సహజ సిద్ధంగా పక్వానికి వచ్చినపుడు తింటే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రమాదకర రసాయనాలు వినియోగించిన పండ్లు తినడం ద్వారా అజీర్తి, కడుపు నొప్పి, దురద, జీర్ణాశయం దెబ్బతింటుదని వైద్యులు చెబుతున్నారు.చూడగానే నీళ్లూరించే మామిడి పండ్లను ఎం త ధర ఉన్నా కొనేందుకు జనం మొగ్గుచూపుతా రు. కాని వీటి వెనుక దాగి ఉన్న పచ్చి మోసాన్ని మాత్రం పసిగట్టలేక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. 


రాత్రికి రాత్రే పళ్లుగా మార్చేస్తున్నారు..
సంపాదనే ధ్యేయంగా వ్యాపారులు మార్కెట్‌లోకి వచ్చే పచ్చి కాయలను కృత్రి మంగా మాగబెడుతున్నారు.జిల్లాలో పెద్ద మొత్తంలో పండ్లను మగ్గించడం దందా నడుస్తున్నా అధికారులు మాత్రం ఇటువైపు చూడకుండా మూమూళ్ల మత్తులో మునిగిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనం జిల్లాలోని ఒక్క గోదాముల్లో కూడా ఇప్పటి వరకు తనిఖీలు చేయకపోవడమే. పదిహేను, నెల రోజులకు ఒకసారి అధికారులు వ్యాపారుల వద్దకు వచ్చి చేతులు తడుపుకుంటున్నట్లు సమాచారం.కాల్షియం కార్బైడ్‌ వంటి నిషేధిత రసాయనాలను వినియోగించి ఒక్కరోజులోనే కాయల రంగు, రుచి మార్చేస్తున్నారు. జిల్లాలో 750 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ సారి ఈదురుగాలులు అధికంగా రావడంతో కాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో జిల్లాలో మామిడి కాయలు దొరకక ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు 15 వరకు మామిడి పండ్ల గోదాములు ఉండగా వివిధ రకాల కాయలను అందులో నిల్వ చేస్తూ నిషేధిత రసాయనాలతో మాగపెట్టి పండ్లుగా మారుస్తున్నారు. ప్రధానంగా మామిడి సీజన్‌లో ఈ దందా జోరుగా నడుస్తున్నా అధికార యం త్రాంగం చోద్యం చూస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.జిల్లాలోని కొన్ని గోదాముల్లో కాయలను పండించేందుకు వ్యాపారులు సరికొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. కొత్తగా స్ప్రే ద్వారా మామిడి పండ్లపై రసాయనాలు చల్లుతున్నారు. గోదాముల్లో కాకుండా ఇళ్లలో మగ్గించి అవి పండిన తర్వాత గోదాములకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా సహజ సిద్ధమైన పండ్లు లేవనేది జగమెగిరిన సత్యమే అయినా అధికారుల మాత్రం తనిఖీలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

No comments:

Post a Comment