Breaking News

24/05/2019

10 శాతం బస్సులకే ఫిట్ నెస్


అదిలాబాద్, మే 24, (way2newstv.in)

ఆదిలాబాద్ జిల్లాలో 140 స్కూల్ బస్సులున్నట్లు రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి. వీటిలో గత విద్యా సంవత్సరంలో అన్ని బస్సులకు ఫిట్‌నెస్ చేశారు. ఈ బస్సులలో కొన్ని 15 సంవత్సరాలు కాలపరిమితి మించిపోయినవి కూడా ఉండగా, మరికొన్ని స్కూల్ యాజమాన్యాలు అనుమతి లేకుండానే కాలం చెల్లిన బస్సులను స్క్రాప్ చేశారు. గతేడాది ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డు మీద తిరుగుతుండగా తనిఖీ నిర్వహించి  బస్సులను సీజ్ చేసిన అనంతరం విడిచి పెట్టారు.స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ గడువు ఈ నెల 15తో ముగిసిందని, జిల్లాలో ఉన్న అన్ని స్కూల్ బస్సులు, వ్యాన్‌లు జూన్1లోపు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు. జూన్ 1 నుంచి 10 వరకు స్పె షల్ డ్రైవ్ ఏర్పాటు చేసి ధ్రువపత్రాలు సరిగా లేకపోతే కోర్టుకు పంపిస్తామని పేర్కొంటున్నారు. షోరూం నుంచి వచ్చిన కొత్త స్కూల్ బస్సులకు 2 సంవత్సరాల తర్వాత ఫిట్‌నెస్ చేయించాలని, పాఠశాల యాజమాన్యాలు బస్సును స్క్రాప్ వేయాలన్నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సుల్లో పిల్లలను పంపకూడదని సూచిస్తున్నారు. 


10 శాతం బస్సులకే ఫిట్ నెస్
అయితే ఫిట్‌నెస్ సమయంలో చూపుతున్న డ్రైవర్లను తప్పించడం లేదా అనుభవం కలిగిన వారి వివరాలను పొందుపర్చి ఆ తరువాత అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నారనే ఆరోపణలు సై తం ఉన్నాయి.ఈ ప్రక్రియను పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు జూన్1 వరకు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు జిల్లా మొత్తంలో 11 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ అనుమతి పొందాయి. ప్రతి ఏడాది మే 2వ వారం నుంచి జూన్ మొదటి వారం వరకు స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. బస్సుల ఫిట్‌నెస్ పరీక్షించడంతో పాటు వాటిని నడిపే డ్రైవర్లు, అటెండర్ల వివరాలను అర్హతలను కూడా రవాణాశాఖ పరిగణలోకి తీసుకుంటుంది. ఈ సారి ఫిట్ నెస్ కోసం స్లాట్ బుక్ చేసుకునే సమయంలో బస్సుల వివరాలతో పాటు వాటిని నడిపే ఇద్దరు డ్రైవ ర్లు, అటెండర్ల అర్హత, డ్రైవింగ్ లైనెన్స్, అనుభవం, ఫోటోలు కూడా అప్‌లోడ్ చేయాలని అధికారులు సూ చిస్తున్నారు. అయితే జూన్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బస్సులను ఫిట్‌నెస్ చేయించుకోవడంలో సంబంధిత పాఠశాల యాజమాన్యాలు నిర్లక్షంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవాణా శాఖ అధికారులను మచ్చిక  చేసుకొని పాఠశాలలు ప్రారంభమైన తరువాత ఫిట్‌నెస్ చేయించుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. కేవలం వారం రోజులే గడువు ఉండడం, ఇంకా 129 బస్సులు ఫిట్‌నెస్‌కు ఎలా ఆన్‌లైన్లో అప్లై చేసుకుంటారు, వాటినెలా పరీక్షిస్తారనేది అనుమానాలకు కారణమవుతుందని అంటున్నారు.  నిబంధనలకు అనుగుణంగా ప్రతి పాఠశాల బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలని, లేనిపక్షంలో బస్సులను సీజ్ చేసి జరిమానాలను విధిస్తామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. .  రెండేళ్ల నుంచి వివిధ ప్రాంతాలలో బస్సులు అదుపు తప్పి విద్యార్థులకు గాయాలైన సంఘటనలు సైతం జిల్లాలో చోటు చేసుకోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

No comments:

Post a Comment