మెదక్, ఏప్రిల్ 05 (way2newstv.in:
పరిశ్రమల నుంచి నిరంతరాయంగా బయటకు వెలువడే జల, వాయు కాలుష్యం పచ్చని పల్లెల్లో విషమ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. నానాటికీ పెరిగిపోతున్న ఈ సమస్య పర్యావరణంతో పాటు ప్రజారోగ్యం, ప్రజల ఆర్థిక పరిస్థితులను అతలాకుతలం చేస్తోంది. పర్యావరణాన్ని హానికరంగా మార్చేస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం మానవ మనుగడ, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రజల జీవన స్థితిగతులను దుర్భరంగా మారుస్తోంది. గాలి, నీరు, నేల పూర్తిగా కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి. రసాయన పరిశ్రమలు సృష్టిస్తున్న విధ్వంసంతో మనుషుల్లో శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు తలెత్తుతున్నాయి. పరిస్థితి ఇంత అధ్వానంగా మారుతున్నా కట్టడి చేయడంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.హత్నూర మండలం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమల స్థాపన వడివడిగా సాగుతున్నాయి. అన్ని గ్రామాలకు విస్తరిస్తున్నాయి. గుండ్లమాచునూర్, పల్పనూర్, బోర్పట్ల, చందాపూర్, తుర్కల ఖానాపూర్, నస్తీపూర్, కాసాల తదితర గ్రామాల్లో రసాయన కర్మాగారాలతో పాటు పలురకాల ఉక్కు పరిశ్రమల్ని నెలకొల్పారు. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పక్కన పెడితే పరిశ్రమలు సృష్టిస్తున్న సమస్యలు అనేకం ఉన్నాయి. ఉన్న వాటితోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు.ఇకనైన పటిష్ఠ చర్యలు చేపట్టాల్సి ఉంది.
కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ (మెదక్)
మండలంలో వ్యవసాయ భూములు కాలుష్యమయంగా మారాయి. పరిశ్రమల నుంచి నిరంతరం వెలువడుతున్న కాలుష్యం కారణంగా పంట పొలాలు నాశనం అవుతున్నాయి. దీంతో వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగించే అన్నదాతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. పరిశ్రమల పుణ్యమా అని వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి ఎదురైందని రైతులు వాపోతున్నారు. చివరకు పంట భూముల్ని పరిశ్రమలకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికే గుండ్లమాచునూర్, బోర్పట్ల, చందాపూర్ శివారుల్లోని భూములను సాగు చేయకుండా వృథాగా వదిలేశారు. కష్టపడి పండించిన ఆహార ధాన్యాలు విషతుల్యంగా మారుతున్నాయి. ఇక్కడి పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు సమీపంలోని నక్కవాగు గుండా మంజీరాలో కలుస్తున్నాయి.కాలుష్యాన్ని నియంత్రించడంలో పీసీబీ అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆ శాఖ అధికారులు పరిస్థితిని చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధారాలతో సహా అధికారులకు సమాచారం అందించినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి ఒత్తిడి తీవ్రమైన నేపథ్యంలో నామమాత్రంగా నీటి నమూనాలు సేకరించి చేతులు దులుపుకొంటున్నారు. కొన్ని సందర్భాల్లో వాటి ఫలితాలను ఏళ్ల తరబడి ప్రకటించకుండా గోప్యంగా కార్యాలయాల్లోనే దాస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నెలలో రెండుమూడు సార్లు నీటి నమూనాలు సేకరిస్తున్నప్పటికీ నేటికీ ఏ పరిశ్రమపైనా చట్టపరంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రాత్రివేళల్లో ఫలానా పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలు బయటకు వస్తున్నాయని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదు. అధికారులు యాజమాన్యానికి ముందస్తుగా సమాచారం ఇస్తుండడంతో వారు అప్రమత్తమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులే తిరిగి ఫిర్యాదుదారుల్ని ప్రశ్నిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.రసాయన పరిశ్రమల కంటే ఇనుము తయారు చేసే కర్మాగారాల నుంచి పొగ విచ్చలవిడిగా వెలువడుతోంది. ఎత్తుగా ఏర్పాటు చేస్తున్న గొట్టాల ద్వారా దట్టమైన నల్లటి పొగ గాలిలో చేరుతోంది. దీంతో ఆ పరిసరాల్లోని గాలి విషతుల్యంగా మారుతోంది. దట్టంగా కమ్ముకుంటున్న పొగ కారణంగా కనుచూపు మేరలో ఏముందో కానరాక రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముక్కుపుటాలు అదిరే దుర్వాసన భరించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment