Breaking News

05/04/2019

కలిసికట్టుగా.. (ప్రకాశం)

కనిగిరి, ఏప్రిల్ 05 (way2newstv.in): ఎప్పుడొచ్చామన్నది కాదన్నా... అందరి మన్ననలు పొందామా... లేదా... అన్నది ముఖ్యమంటున్నారు తెలుగు తమ్ముళ్లు... సార్వత్రిక ఎన్నికల వేళ... కనిగిరి తెదేపా అభ్యర్థిని నిర్ణయించడంలో పార్టీపరమైన జాప్యం జరగడంతో నిన్న, మొన్నటి వరకు అయోమయంలో ఉన్న కార్యకర్తలు అంతలోనే సర్దుకుని సమరానికి సై అంటున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబురావుకు బదులు అభ్యర్థిగా బరిలో దిగిన ఉగ్ర నరసింహారెడ్డి గతంలో కంటే భిన్నంగా అందరు నాయకులతో కలిసిపోయి, ఒక్కటిగా పనిచేద్దామని చెప్పడంతో వారు విభేదాలను పక్కన పెడుతున్నారు. వైకాపా అభ్యర్థి బుర్రా సైతం చాప కింద నీరులా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఉగ్ర నరసింహారెడ్డి టిక్కెట్‌ ఖరారు కాగానే నేరుగా రంగంలోకి దిగారు. అన్ని వర్గాలను కూడగట్టేందుకు చురుగ్గా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా కదిరి బాబురావు వర్గాన్నీ కలుపుకొని పనిచేస్తున్నారు. ఉగ్ర నరసింహారెడ్డి, బాబురావులు కనిగిరి, దర్శిలలో పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించుకున్నారు. 


కలిసికట్టుగా.. (ప్రకాశం)

ఉగ్ర ఒక అడుగు ముందుకేసి బాబురావును ఇంటికెళ్లి సహకారం కావాలని కోరడం, దానికి ఆయన కూడా పూర్తి మద్దతు ప్రకటించడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇద్దరి కలయిక ఇటు కనిగిరి, అటు దర్శిలో సమీకరణాలు మారేందుకు దోహదం చేస్తుందని ఆ పార్టీ అంచనా.కనిగిరి నియోజకవర్గ ముఖ్య తెదేపా నాయకులతో ఉగ్ర ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి మద్దతు కూడగట్టడంలో తీరిక లేకుండా ఉన్నారు. ఇప్పటికే ఈబీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బేరి పుల్లారెడ్డి, లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు, పామూరు, పీసీపల్లి, వెలిగండ్ల మండలాల పార్టీ అధ్యక్షులు పువాడి వెంకటేశ్వర్లు, తిరుపతిరావు, శ్యామల కాశిరెడ్డి వారి మద్దతు ప్రకటించి ప్రచార కార్యక్రమాల్లో ఉగ్ర వెంట ఉంటున్నారు. దీంతో పాటుగా ఆర్య వైశ్య సంఘం నాయకులు నగర పంచాయతీ వైస్‌ ఛైర్మన్‌ విశ్వనాథుని మనోహరరావు, ఆర్యవైశ్య అన్నదాన సత్ర సముదాయ ఛైర్మన్‌ దేవకి వెంకటేశ్వర్లు ఏఎంసీ వైస్‌ ఛైర్మన్‌ ఐ.వి.నారాయణలతో ఉగ్ర ప్రత్యేకంగా మాట్లాడి వారి మద్దతు సాధించారు.పామూరు మండలానికి చెందిన ఏఎంసీ ఛైర్మన్‌ దారపనేని చంద్రశేఖర్‌, తెదేపా అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌ చౌదరి, తుమ్మా ఆంజనేయులు రెడ్డి, ఇతర బలమైన నాయకులు ఇప్పుడు ఉగ్ర వెంట నడుస్తుండటం కలిసి వచ్చే అంశమని పార్టీ ఆశిస్తోంది.

No comments:

Post a Comment