Breaking News

24/04/2019

జంప్ జిలానీలను అడ్డుకొనేందుకు మాస్టర్ ప్లాన్

హైద్రాబాద్, ఏప్రిల్ 24, (way2newstv.in)
సీల్పీని విలీనం చేసేందుకు అధికార పార్టీ తెరాస వ్యూహాల్లో ఉంటే… దాన్ని ఎలా అడ్డుకోవాలో అనే ప్ర‌య‌త్నంలో కాంగ్రెస్ నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న ప‌రిస్థితిలో ఉన్నారు. తెరాస ప్రారంభించిన ప్ర‌క్రియ ఇంకా విలీనం వ‌ర‌కూ వెళ్ల‌లేదు కాబ‌ట్టి… ఈలోగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేజార‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఇప్ప‌టికే 11 ఎమ్మెల్యేలు తెరాస‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు చేజారితే విలీన ప్ర‌క్రియ షురూ అయిపోయిన‌ట్టే. అయితే, ఈలోగా ఉన్న ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డం కోసం కాంగ్రెస్ వ్యూహం ఏంటంటే… జంప్ జిలానీల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డేలా స్పీక‌ర్ పై గ‌ట్టిగా ఒత్తిడి తేవ‌డం! సీఎల్పీ నేత భ‌ట్టితోపాటు ష‌బ్బీర్ అలీ మ‌రికొంద‌రు సీనియ‌ర్ నేత‌లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డిని క‌లుసుకున్నారు. తాజాగా పార్టీ వీడిన న‌లుగురు స‌భ్యుల‌పై అన‌ర్హ‌త వేటు వెయ్యాలంటూ స్పీక‌ర్ ని కోరారు. 



జంప్  జిలానీలను అడ్డుకొనేందుకు మాస్టర్ ప్లాన్

గ‌త‌వారంలో కూడా స్పీక‌ర్ కి ఇలాంటి పిటీష‌నే ఇచ్చారు భ‌ట్టి. పార్టీ వీడిన ఆరుగురిపై అన‌ర్హ‌త వేటు వెయ్యాల‌ని కోరారు. దానికి అనుబంధంగా ఇవాళ్ల మ‌రో ఫిర్యాదు ఇచ్చారు. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి, ప‌ద‌వికి రాజీనామా చెయ్య‌కుండా మ‌రో పార్టీలో చేరి శాస‌న స‌భ్యులుగా కొన‌సాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై వేటు వేయాలన్నారు. పార్టీ ఫిరాయింపుల్ని అధికార పార్టీ అప్ర‌జాస్వామ్యంగా ప్రోత్సిహిస్తోంద‌ని భ‌ట్టి విమ‌ర్శించారు. అన‌ర్హ‌త పిటీష‌న్ల‌పై వెంట‌నే స్పందించాల‌ని ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ ని కాంగ్రెస్ నేత‌లు కోరారు. ఓప‌క్క సీఎల్పీ విలీనానికి తెరాస‌ ప్ర‌య‌త్నిస్తుంటే… అన‌ర్హ‌త వేటుపై ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేస్తున్న‌ట్టు..? అంటే, పార్టీ నుంచి బ‌య‌ట‌కి వెళ్తే అన‌ర్హ‌త వేటు త‌ప్ప‌దు అనే సంకేతాలు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల‌కు ఇవ్వ‌డ‌మే దీని వెన‌క ఉద్దేశం కావొచ్చు. అయినా, స్పీక‌ర్ కి ఫిర్యాదు ఇచ్చినంత మాత్రాన జంప్ జిలానీల‌పై అన‌ర్హ‌త వేటు సాధ్య‌మా.? గత అసెంబ్లీలో జంప్ జిలానీలు ఏకంగా ఐదేళ్లూ కొన‌సాగారు క‌దా. అప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు ఇలానే స్పీక‌ర్ కి చాలా ఫిర్యాదులు చేశారు. అవ‌న్నీ బుట్ట దాఖ‌ల‌య్యాయి! కాబ‌ట్టి, ఈ ప్ర‌య‌త్నం పెద్ద‌గా వ‌ర్కౌట్ కాద‌నేది ఎవ‌రైనా ఇట్టే చెప్పేయ‌గ‌ల‌రు! ఇంకోప‌క్క‌… సీఎల్పీ విలీన ప్ర‌క్రియ‌ను అడ్డుకోవాలంటే న్యాయ‌ప‌రంగా ఏవైనా సాధ్యాసాధ్యాలున్నాయా అనేది కాంగ్రెస్ నేత‌లు అధ్య‌య‌నం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దాని కంటే ముందు చెయ్యాల్సింది… ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలను చేజార‌కుండా కాపాడుకోవ‌డం. ఎవ‌రు చెబితే టి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ‌ల‌స‌లు ఆగుతాయ‌నేది ప్ర‌స్తుతానికి వారికి కూడా ప్ర‌శ్నార్థ‌కంగానే క‌నిపిస్తోంది!

No comments:

Post a Comment