Breaking News

11/03/2019

జనంలోనే జగన్

విజయవాడ, మార్చి 11, (way2newstv.in)
ఎన్నాళ్ల నుంచో ఈ సమయం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వేచి చూస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున జగన్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అంతేకాదు ఆ ఎన్నికలలో కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే రెండు ప్రధాన పార్టీలకు మధ్య వ్యత్యాసం ఉండటాన్ని కూడా ఆయన ఐదేళ్ల క్రితం ప్రస్తావించారు. తాను ప్రజల మధ్యనే ఉంటానని ఐదేళ్ల క్రితం జగన్ మీడియా సమావేశంలో చెప్పారు. ఆరోజు నుంచి జగన్ ప్రజల మధ్యలోనే ఉన్నారు.వివిధ సమావేశాల పేరిట 13 జిల్లాలను జగన్ అనేకసార్లు చుట్టి వచ్చారు. వివిధ సమస్యలపై సమావేశాలు, ప్రత్యేక హోదా కోసం యువభేరి వంటి కార్యక్రమాలతో జగన్ జనం చెంతనే ఉన్నారు. ఇక 2017 నవంబరు6వ తేదీన జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర దాదాపు ఏడాదిన్నర కాలం సాగింది. దాదాపు 126 నియోజకవర్గాల మీదుగా జగన్ పాదయాత్ర సాగింది. 


 జనంలోనే జగన్

పాదయాత్రలో వచ్చిన సమస్యలపై ఎక్కడికక్కడ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీకి హైప్ తెచ్చారనే చెప్పాలి.పాదయాత్ర ముగిసిన తర్వాత బస్సు యాత్ర చేయాలని భావించారు. తాను పాదయాత్రలో టచ్ చేయలేని నియోజకవర్గాల్లో పర్యటించాలని అనుకున్నా సమయం లేకపోవడంతో బస్సుయాత్రను వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల తొలిజాబితాను రెండు రోజుల్లో జగన్ ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 30 రోజుల సమయం తమకు చాలని వైసీపీ నేతలు చెబుతున్నారు. తమ అధినేత ఎప్పుడూ జనంలోనే ఉండటం తమకు కలసి వచ్చే అంశమని అంటున్నారు. ఐదేళ్ల నుంచి వేచి చూస్తున్న సమయం రావడంతో జగన్ పార్టీ అప్రమత్తమయింది. సీనియర్ నేతలు ఇప్పటికే జిల్లాల పర్యటనలను ప్రారంభించాలని పార్టీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం మీద నెల రోజుల్లో జరగనున్న ఎన్నికలు ఇటు చంద్రబాబుకు, వైఎస్ జగన్, పవన్ కల్యాణ‌్ ముగ్గురికీ ప్రతిష్టాత్మకమే. మరి జనం ఎవరిని ఆదిరిస్తారో చూడాలి.అయితే బస్సు యాత్ర చేయడానికి కేవలం ముప్ఫయి రోజులు సమయం మాత్రం సరిపోదన్నది పార్టీ నేతల అభిప్రాయం. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జగన్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంగ సభల్లో మాట్లాడాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది. కేవలం 30 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉండటం, మ్యానిఫేస్టో విడుదల చేయాల్సి ఉండటం, అభ్యర్థుల ప్రకటన వంటి వాటిపై జగన్ దృష్టి పెట్టాల్సి ఉండటంతో జగన్ రెండు, మూడు రోజులు ఇక్కడే ఉండి వీటిపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాను హెలికాప్టర్ ద్వారా ప్రచారం చేస్తూ, ముఖ్యనేతలను జిల్లాలకు పంపాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిలను కూడా ప్రచారంలోకి దింపనున్నారు.

No comments:

Post a Comment