Breaking News

11/03/2019

జగన్ వైపు డీఎల్ చూపు

కడప, మార్చి 11, (way2newstv.in)
దాదాపు నలభై ఏళ్ల రాజకీయ జీవితం. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సమకాలీకుడు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించిన వ్యక్తి ఇప్పుడు బీఫాం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న మొన్నటి దాకా టీడీపీలో చేరతారని భావించినా, ఆయన ఆ పార్టీపై ఫైరవ్వడాన్ని చూసి ఇక పసుపు పార్టీని తన మైండ్ నుంచి డిలీట్ చేసేశారు. మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయనే కడప జిల్లాలో సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. డీఎల్ రవీంద్రారెడ్డి నిన్న మొన్నటి వరకూ టీడీపీ టిక్కెట్ కోసం ఎదురు చూశారు. అది రాదని తేలడంతో ఆయన టీడీపీపై ఫైరయ్యారు. ఏకంగా మీడియా సమావేశం పెట్టి టీడీపీని భూస్థాపితం చేస్తానని ప్రకటించారు. పుట్టా సుధాకర్ యాదవ్ ను మైదుకూరులో ఓడించడమే తన ధ్యేయమన్నారు.మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ జీవితం 1978లో ప్రారంభమయింది. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన మైదుకూరులో తన సత్తా చాటారు. అందుకే మైదుకూరు ప్రజలు ఆరు దఫాలు ఆయన పక్షాన నిలబడ్డారు. అయితే డీఎల్ రవీంద్రారెడ్డి గత కొంతకాలంగా టీడీపీ లో చేరతారన్న ప్రచారం జరిగింది. 



 జగన్ వైపు డీఎల్ చూపు

అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలవడంతో టిక్కెట్ అసాధ్యమని తేలిపోయింది. మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ నే ఖరారు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. డీఎల్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు. కానీ డీఎల్ అందుకు ససేమిరా అని చెప్పి టీడీపీని ఓడిస్తానని శపథం చేశారు.టీడీపీపై విరుచుకుపడ్డాక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డీఎల్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో చేరాలని, కడప జిల్లా బాధ్యతలను అప్పగిస్తామని కన్నా ప్రతిపాదన పెట్టారు. అయితే బీజేపీలో చేరేందుకు డీఎల్ ఇష్టపడటం లేదు. బలం లేని పార్టీ కావడంతో అందులో చేరి ఓటమి పాలు కావడం ఎందుకని కన్నా అభ్యర్థనను డీఎల్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. జనసేనలోకి వెళతారన్న ప్రచారమూ జరుగుతోంది. కానీ డీఎల్ అనుచరులు దానిని తీవ్రంగా ఖండిస్తున్నారు. జనసేన అనేది ఇక్కడ లేదని, అటువంటి పార్టీలో తమ నేత ఎందుకు చేరతారంటున్నారు.డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి అని ఎందుకంటే….గతంలో వైసీపీ టిక్కెట్ కోసం ఆయన అనుచరులు నేరుగా జగన్ సంప్రదించారు. అయితే జగన్ మాత్రం డీఎల్ వస్తే స్వాగతిస్తామని, ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తామని గౌరవంగా చెప్పారు. మైదుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఉండటంతో టిక్కెట్ ఇవ్వలేనని జగన్ చెప్పారు. కానీ టీడీపీ మీద ఆగ్రహంగా ఉన్న డీఎల్ తాను స్వయంగా జగన్ కలసి తన సీటు విషయంపై చర్చించాలని భావిస్తున్నట్లు సమాచారం. జగన్ టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని డీఎల్ భావిస్తున్నట్లు భోగట్టా. మొత్తం మీద డీఎల్ రానున్న ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

No comments:

Post a Comment