విజయనగరం, ఫిబ్రవరి 28, (way2newstv.in)
అర్బన్ మీ-సేవ కేంద్రాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సేవ పేరుతో ప్రజల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్న ప్రయివేటు ఏజెన్సీలు అందులో పనిచేస్తున్న సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అర్బన్ మీ-సేవ కేంద్రాలను రాష్ట్రంలో 2003లో అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వానికీ, వినియోగదా రులకూ మధ్య వారథిగా అన్ని సేవలూ ఒకే చోట లభ్యమయ్యేలా మీ-సేవ కేంద్రాలు నాలుగు సేవలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 400 సేవలు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 200 కేంద్రాలుండగా, వాటిలో ఆరు విజయనగరం జిల్లాలో ఉన్నాయి.ఉద్యోగ భద్రత లేక, కనీస వేతనం అమలు కాక, నెల జీతం ఎప్పుడు అందుతుందో తెలియక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. వాస్తవానికి ఈ నెల 23వ తేదీతో ప్రయివేటు సంస్థల నిర్వహణ గడువు పూర్తయింది.
ఆగమ్యగోచరంగా అర్బన్ మీ-సేవ కేంద్రాలు
అయితే టెండర్లు ఖరారయ్యే వరకు పాత ఏజెన్సీలే కొనసాగుతాయి. ప్రభుత్వం ఈ సారి టెండర్లు ద్వారా బడా కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తోంది. అర్బన్ మీ-సేవ కేంద్రాల్లో పని చేస్తోన్న సిబ్బంది మాత్రం వీటిని ప్రభుత్వమే నిర్వహించాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో నడిచిన ఈ కేంద్రాలను ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వర్ మెంటినెన్స్ పేరుతో ప్రయివేటు సంస్థలకు అప్పగించింది. అప్పట్లో సిఐటియు ఆధ్వర్యంలో సిబ్బంది సమ్మె చేయడంతో వారికి 97 కాంట్రాక్టు లేబర్ యాక్ట్ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016లో రాష్ట్రంలోని మీ-సేవ కేంద్రాలను రెండు జోన్‌లుగా విడదీసింది. విజయ నగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలను రామ్ ఇన్‌ఫో అనే ప్రయివేటు సంస్థకు, మిగిలిన ఏడు జిల్లాలనూ కార్వే సంస్థకు మూడేళ్లు అగ్రిమెంటుకు అప్పగించింది. ప్రభుత్వ భవనంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలతో ప్రయివేటు సంస్థలు పెట్టుబడి లేకుండా ఒక్కొక్క కేంద్రం నుంచి నెలకు సుమారు రూ.లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నాయి. ఈ సారి వీటిని ప్రీ పెయిడ్ మోడ్‌లోకి మార్చి, కార్పొరేట్లకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.చంద్రన్న పెళ్లి కానుక, యువనేస్తం, చంద్రన్న బీమా, పట్టాదారు పాసుపుస్తకాలు, ల్యాండ్ రెగ్యులేషన్ వంటి అనేక కీలక ప్రభుత్వ సేవలను మీ-సేవ సిబ్బంది నిర్వహిస్తున్నారు. కానీ, వారికి ప్రయివేటు సంస్థలు అరకొర జీతాలను చెల్లిస్తున్నాయి. జిఒ-6 ప్రకారం ఆపరేటర్లకు రూ.12 వేలు, మేనేజర్లకు రూ.14 వేలు కనీస వేతనంగా చెల్లించాల్సి ఉన్నా, నేటికీ రూ.6,450 చెల్లిస్తున్నారు. అడిగిన వారిపై వేధింపులకు దిగుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వారు సమ్మెకు సిద్ధమవుతున్నారు.
No comments:
Post a Comment