ఖమ్మంలో పార్లమెంటు స్థాయి సమావేశం
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు సన్మానం
ఖమ్మం,ఫిబ్రవరి18 (way2newstv.in)
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, నామా నాగేశ్వరరావు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగాలని తెలుగు తమ్ముళ్లు తీర్మానించారు. ఖమ్మం నగరంలోని మధుకాన్ కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటు స్థాయి పార్టీ ముఖ్య నేతలతో తెదేపా జాతీయ పొలిట్బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వాల నమోదు, కార్యకర్తల సంక్షేమం, తాజా రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై మాట్లాడుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో విజయం పొందడంపై సమావేశంలో చర్చించారు.
నామాకు తెలుగు తమ్ముళ్ల సూచన
పార్లమెంటు పరిధిలోని సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాల్లో తెదేపా విజయం సాధిస్తే.. మధిర, పాలేరు, కొత్తగూడెం స్థానాల్లో మిత్రపక్షం కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజాకూటమి హవా కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. ఖమ్మం శాసనసభా స్థానం కోల్పోవడంపై పలువురు ప్రసంగిస్తూ కంటతడి పెట్టారు. నామా నాగేశ్వరరావు ఓడిపోవడం బాధాకరమైన విషయంగా పేర్కొన్నారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లిలో నిర్వహించిన పొలిట్బ్యూరో సమావేశంలోని విశేషాలను నామా నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు వివరించారు. తెలంగాణలో పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత నేతలకే అప్పగించిన విషయాన్ని వెల్లడించారు. అభ్యర్థుల గెలుపు దిశగా పని చేయాలని సూచించారని వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం పని చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నామా ఎంపీగా పోటీ చేయాలని కోరారు. పార్లమెంటు స్థానంలో పోటీ, భవిష్యతు కార్యాచరణ తదితర అంశాలను సమావేశం సందర్భంగా నేతలు చర్చించుకున్నారు.
ఎమ్మెల్యే మెచ్చాకు సన్మానం.. అశ్వారావుపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన మెచ్చా నాగేశ్వరరావును సన్మానించారు. తెదేపా తరపున ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను సన్మానించి, అభినందించారు. ప్రజాకూటమి అభ్యర్థులు, సర్పంచి స్థానాల్లో మద్దతు ఇచ్చిన వారిని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, కార్పొరేటర్లు చేతుల నాగేశ్వరరావు, తోట రామారావు, నేతలు బుడాన్ బేగ్, మద్దినేని స్వర్ణకుమారి, కూరపాటి వెంకటేశ్వర్లు, వల్లంకొండ వెంకట్రామయ్య, చిత్తారి సింహాద్రి, పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, సరిపూడి గోపి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment