భువనేశ్వర్, ఫిబ్రవరి 19, (way2newstv.in)
ఒడిశా ముఖ్యమంత్రి , బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కొత్త పోకడలకు తెరతీస్తున్నారు. విపక్షాల కంటే ముందుండే ప్రయత్నాల్లో ఉన్నారు. నవీన్ పట్నాయక్ తొలి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఎన్నికలకు వెళతారు. అందుకే ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగుతుంది. వరసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ దాదాపు ఇరవై ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారంటే వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎన్నికల వ్యూహాలను అమలు పర్చడంలో దిట్ట. ఒకవైపు భారతీయ జనతా పార్టీ బలంగా వేళ్లూనుకుంటుండం, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పుంజుకుంటుండుంటంతో నవీన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తున్నారు.
కొత్త పోకడలకు తెర తీస్తున్న నవీన్ పట్నాయక్
తండ్రి బిజూ పట్నాయక్ వారసత్వాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయాల్లోకి వచ్చిన నవీన్ జాగ్రత్తగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎన్నికల్లో అపజయాలు ఎరుగని నవీన్ కు వచ్చే ఎన్నికలు ఒకింత పరీక్ష అనే చెప్పాలి. ప్రధానంగా రైతుల కోసం ఇప్పటికే ఆయన ప్రవేశపెట్టిన కాలియా పథకం పార్టీకి ఊపు తెచ్చిందంటున్నారు. తెలంగాణ తరహాలో రైతులకు పెట్టుబడిని ముందుగానే అందించడమే దీని లక్ష్యం. ఇప్పటికే రైతులు ఈ ప్రయోజనం పొందారు. ఇక మహిళా సంఘాలకు కూడా రూ.17,500ల చెక్కులను పంపిణీ చేశారు. దీంతో పాటు సెల్ ఫోన్ ను కొనుగోలు చేసేందుకు మహిళలకు మూడు వేల రూపాయలు అందజేశారు.ఇవన్నీ తమకు కలసి వచ్చే అంశంగా నవీన్ భావిస్తున్నారు. గత ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉండకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహిళ కోసం ఇప్పటికే మిషన్ శక్తి పథకాన్ని చాలా కాలం నుంచి అమలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఒడిశాలోని మొత్తం 147 స్థానాలకు గాను 117 స్థానాలు దక్కించుకున్న నవీన్ ఇప్పుడు మిషన్ 130గా కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఒడిశాలో ఉన్న 21 లోక్ సభ స్థానాల్లోనూ గత ఎన్నికల్లో 20 సాధించుకున్న నవీన్ ఇప్పుడు అదే సంఖ్యను టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే అన్ని వర్గాలకూ ప్రభుత్వ పథకాలు చేర్చేలా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.తాజాగా మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని నవీన్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అన్ని పార్టీలకూ మహిళ రిజర్వేషన్ల విషయంలో లేఖలు రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదింప చేయాలని నవీన్ అన్ని పార్టీలూ కోరినా ఫలితం లేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో మహిళలకు ఎన్ని స్థానాల్లో టిక్కెట్లు కేటాయిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయన చెప్పినట్లు 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే ఒడిశాలో ఉన్న శాసనసభ స్థానాల లెక్కల ప్రకారం 49 మందికి అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే అంతమందికి నవీన్ టిక్కెట్లు ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో నవీన్ 14 మంది మహిళలకు టిక్కెట్లు ఇస్తే పది మంది గెలిచారు. ఈసారి 33శాతం రిజర్వేషన్ ప్రకారం మహిళలకు టిక్కెట్లు ఇవ్వడం కష్టమే. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 21 మంది మహిళలకు ఖచ్చితంగా టిక్కెట్లు దక్కుతాయని తెలుస్తోంది. మొత్తం మీద తాను మాట మీద నిలబడేందుకు నవీన్ ప్రయత్నం చే్స్తూనే, విపక్షాలు నోళ్లు మూయించేందుకు ఎన్నికలకు ముందు నవీన్ భారీ కసరత్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment