Breaking News

15/02/2019

బడ్జెట్ తో అందరి మన్ననలు పొందిన పీయూష్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15, (way2newstv.in)
పియూష్ గోయల్…. నిన్న మొన్నటి దాకా ఆయన పేరు అంతగా ఎవరికీ తెలియదు. కేంద్రమంత్రిగా కొందరికే సుపరిచితం. అరుణ్ జైట్లీ అనారోగ్యంతో తాత్కాలిక ఆర్థిక మంత్రిగా కొద్ది రోజుల క్రితం బాధ్యతలను చేపట్టడంతో పియూష్ గోయల్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. గతంలోనూ అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టినప్పటికీ అంతగా పేరు రాలేదు. కానీ ఈ దఫా ఆ బాధ్యతలను అందుకున్నాక దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోయింది. తాత్కాలిక ఆర్థిక మంత్రి హోదాలో తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత పియూష్ గోయల్ కే దక్కుతుంది.


బడ్జెట్ తో అందరి మన్ననలు పొందిన పీయూష్

 సీఏ చదివిన తొలి ఆర్థిక మంత్రి కూడా పియూష్ కావడం విశేషం. మంత్రిగా బాధ్యతలను చేపట్టిన కొద్దిరోజులకే కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు అందుకోవడం పియూష్ ప్రత్యేకత. 70 మందికి పైగా మంత్రులు ఉన్నప్పటికీ కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు ప్రధాని మోదీ పియూష్ కు అప్పగించారు. పియూష్ పై ప్రధానికి గల నమ్మకం, విశ్వసనీయతకు ఇదే నిదర్శనం. తాజాగా ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అందరి మన్ననలను అందుకుంది. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇచ్చారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఎన్నికల ఏడాదిలో ఇది పార్టీకి ఎంతో మేలు చేస్తుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర కు చెందిన పియూష్ గోయల్ 1964 జూన్ 13న జన్మించారు. ఆయనది రాజకీయ కుటుంబం. తండ్రి వేదప్రకాశ్ గోయల్ వాజ్ పేయి మంత్రివర్గంలో నౌకా రవాణా శాఖమంత్రిగా పనిచేశారు. పార్టీలో ఆయన చాలా కాలం పనిచేశారు. తల్లి చంద్రకాంత్ గోయల్ మహారాష్ట్రలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పియూష్ స్వతహాగా ప్రతిభాశాలి. సీఏలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. ముంబయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో రెండో ర్యాంకర్ గా నిలిచారు. వాజపేయి హయాంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలలలో డైరెక్టర్ గా పనిచేశారు. పార్టీలో అనేక పదవులు నిర్వహించారు. పార్టీ జాతీయ కార్యవర్గంతో పాటు కీలకమైన పదవులు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు 2016 జూన్ లో ఎన్నికైన పియూష్ గోయల్ మోదీ మంత్రివర్గంలో చేరారు. 2017 సెప్టెంబరు 3న కేబినెట్ మంత్రిగా పదోన్నతిని పొందారు. చాలా నుంచి పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించారు. అప్పట్లో పార్టీ సమాచార, ప్రచార విభాగం కమిటీ ఛైర్మన్ గాపార్టీ గెలుపునకు కృషి చేశారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ విద్యుత్ సౌకర్యం కల్పించడంలో పియూష్ కృషి ప్రశంసనీయమైనది. భార్య సీమా గోయల్. వారికి ఇద్దరు పిల్లలు. వారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అభ్యసించారు. పియూష్ కేవలం ఆర్థిక వేత్త మాత్రమే కాదు. రక్షణ శాఖకు సబంధించిన విషయాలపై అవగాహన ఉంది. ఆ శాఖ సలహా, సంప్రదింపుల కమిటీ సభ్యుడు. ఇండియన్ మర్చంట్స్ ఛాంబర్ లోనూ సభ్యుడు. వికలాంగుల సంక్షేమం, గిరిజన విద్య కోసం కృషి చేశారు. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానానికి ఏర్పాటు చేసిన కమిటీలోనూ సభ్యుడు.వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన పియూష్ గోయల్ అనతికాలంలోనే ప్రధాని దృష్టిలో పడ్డారు. వివిధ రంగాలపై గల విషయ పరిజ్ఞానం, అవగాహన, నైపుణ్యం కారణంగా ప్రధాని మోదీ ఆయనకు కీలక బాధ్యతలను కట్టబెట్టారు. బొగ్గు గనులు, విద్యుత్తు, రైల్వే, తాత్కాలిక ఆర్థిక మంత్రిగా సత్తా చాటారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు అన్నింటికీ ఆయనే సూత్రధారి. కష్టకాలంలో తాను ఉన్నానంటూ పార్టీని, ప్రభుత్వాన్ని ఆదుకున్నారు. రాత్రిపొద్దుపోయేంత వరకూ పనిచేసే వ్యక్తిగా పనిరాక్షసుడిగా గుర్తింపు పొందారు. రైల్వే మంత్రిగా స్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైళ్లు భారతీయ రైల్వేలను పరుగెత్తిస్తున్నారు. రైల్వేల ఆధునికీ కరణతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేశారు. నిరంతర విద్యుత్, స్వచ్ఛ భారత్, ఉదయ్, దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి వంటి పథకాల రూపకర్త పియూష్ గోయల్ కావడం విశేషం. బొగ్గు గనుల శాఖ మంత్రిగా గనుల వేలాన్ని పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించి మోదీ వద్ద మార్కులు కొట్టేశారు. ఎల్.ఈ.డీ బల్బుల వినియోగాన్ని పెంచి విద్యుత్తు పొదుపునకు శ్రీకారం చుట్టారు. తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రజల మన్ననలను పొందింది. సహజంగా మధ్యంతర బడ్జెట్ సాదాసీదాగా ఉంటుంది. కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అనుమతి కోసం చేపట్టే ప్రక్రియ ఇది. కానీ తాత్కాలిక బడ్జెట్ తోనూ పియూష్ ప్రజల మనసులను చూరగొన్నారు. మున్ముందు ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు

No comments:

Post a Comment